
మణికొండ (హైదరాబాద్): ఓపెన్ ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువపత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఓ అధికారిణి ఏసీబీ వలకు చిక్కారు. రూ.5 లక్షలు డిమాండ్ చేసి రూ. 4 లక్షలు తీసుకుంటూ మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్‌పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో టీపీవోగా పనిచేస్తున్న మణిహారిక మంచిరేవులలోని వినోద్‌కు చెందిన ఓపెన్ ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్ ఇచ్చేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.
అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో 4 లక్షలకు బేరం కుదిరింది. ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తే ఉచితంగా చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేయటంతో వినోద్ తమను వారం రోజుల క్రితం సంప్రదించాడని శ్రీధర్ తెలిపారు. తమ సూచన మేరకు తను ఇస్తానన్న డబ్బును మంగళవారం నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి ఆమెకు ఇచ్చాడు.
వెంటనే రంగంలోకి దిగి డబ్బును స్వా«దీనం చేసుకుని మణిహారికను అరెస్టు చేశామన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధి అలకాపూర్ టౌన్‌షిప్‌లోని ఆమె నివాసంలోనూ తనిఖీలు చేశామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు.