ఇక సొంతంగా ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు
కనీసం 2 వేల బస్సులు సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు
ప్రస్తుతం పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద అద్దె ప్రాతిపదికన 2,300 బస్సులకు ఆర్డర్
జనాభా దామాషా ప్రకారం సిటీలో కనీసం 5 వేల బస్సులుండాలని నిర్ణయం
ఆ మేరకు మిగతా బస్సులను సొంతంగా కొనే యోచనలో ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకుంటున్న ఆర్టీసీ, ఇక సొంతంగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం నగరంలో 3 వేల లోపు సంఖ్యలో మాత్రమే ఆర్టీసీ బస్సులున్నాయి. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవు. నగర జనాభా ప్రకారం దాదాపు 6 వేల బస్సులు అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న బస్సుల సంఖ్యను కనీసం 5 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పీఎం ఈ–డ్రైవ్ కింద కేంద్ర ప్రభుత్వం నగరానికి 2,300 బస్సులు మంజూరు చేసింది. ప్రస్తుతమున్న ఎలక్ట్రిక్ బస్సులతో కలుపుకొంటే మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 3 వేలకు చేరుకుంటుంది. దీంతో మరో 2 వేల బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2030 నాటికి అందుబాటులోకి కొన్ని సొంత బస్సులు
విజన్ 2047 కోసం ఆర్టీసీ కూడా ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందులో 2027 నాటికి గ్రేటర్ నగరం (ఔటర్ రింగురోడ్డు లోపల)లో ఆర్టీసీకి డీజిల్ బస్సులు ఉండకూడదన్నది లక్ష్యం. అంటే వచ్చే ఏడాది నాటికి నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉంటాయి. పీఎం ఈ–డ్రైవ్ కింద వచ్చే ఏడాది చివరి నాటికి అన్ని బస్సులు అందుతాయి. దీంతో అప్పటికి డీజిల్ బస్సులన్నింటిని ఔటర్ వెలుపలి డిపోలకు బదిలీ చేస్తారు. ఇక 2030 నాటికి జనాభా దామాషా ప్రకారం బస్సులను సమకూర్చుకోవాలన్నది రెండో లక్ష్యం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకం కింద గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో బస్సులను సమకూర్చుకుంటుండగా, అవి జనాభా దామాషా పద్ధతిలో కావాల్సిన సంఖ్యలో ఉండవు. దీంతో అదనంగా 2 వేల బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలన్నది ఆ లక్ష్యంలో భాగం.
వేయి వరకు మినీ బస్సులు: ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులన్నీ 9 మీటర్ల కంటే పొడవైన పెద్ద బస్సులు. ఇంత పరిమాణంలో బస్సులు నగరంలోని అన్ని ప్రాంతాలకు తిరగలేవు. పాత నగరంలోని రోడ్లపై మరీ కష్టం. దీంతో ఆయా ప్రాంతాల్లో తిరిగే విధంగా మినీ ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దీనికి తోడు, ఆర్టీసీ బస్సులను మెట్రో రైలు సర్వీసులతో అనుసంధానించబోతున్నారు. మెట్రో రెండు దశ కూడా రాబోతున్నందున ఫస్ట్ మైల్–లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫార్ములాను అమలులోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కాలనీలను మెట్రో స్టేషన్లతో అనుసంధానించాలి. అంటే కాలనీల్లో బస్సెక్కి మెట్రో స్టేషన్ వరకు వెళ్లేలా, మెట్రో రైలు దిగి బస్సెక్కి కాలనీల వరకు చేరేలా ఈ అనుసంధానం ఉంటుంది. మినీ బస్సులను ఇందుకు కూడా వాడాలన్నది ప్లాన్. వెరసి ఈ రెండు అవసరాలకు వేయి వరకు మినీ బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మెట్రో రైలు ప్రాజెక్టు లోన్‌తో అనుసంధానం
ఎలక్ట్రిక్ బస్సులు ఖరీదైనవి కావటంతో ఇంతకాలం ఆర్టీసీ సొంతంగా కొనటం కంటే అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవటం మెరుగైన విధానంగా భావిస్తోంది. భవిష్యత్‌లో మన దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలు తయారు కాబోతున్నందున ఎలక్ట్రిక్ బస్సుల ధరలు కూడా తగ్గనున్నాయి. దీనికి తోడు, మెట్రో రైలు విస్తరణకు ప్రభుత్వం భారీగా రుణాలు పొందబోతోంది. మెట్రో రైలు ప్రాజెక్టులో ఆర్టీసీ బస్సులకు కూడా భాగస్వామ్యం ఉండనున్నందున, మెట్రో ప్రాజెక్టు కోసం తీసుకునే రుణంలో కొంత మొత్తాన్ని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కూడా వాడనున్నారు.
ఉద్యోగాలకు భరోసా...
ప్రస్తుతం జీసీసీ పద్ధతిలో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటున్నందున, డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది ప్రైవేటు సంస్థలే సమకూరుస్తాయి. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ వైపు నుంచి ఉంటారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బందిని నగరం వెలుపలికి బదిలీ చేయనున్నారు. కొంతమందిని ఇతర అవసరాలకు వాడుకోనున్నారు. దీనిపై ఆర్టీసీ కారి్మకుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. భవిష్యత్‌లో ఆర్టీసీ సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటున్నందున, వెలుపలికి వెళ్లే సిబ్బంది తిరిగి నగరానికి వస్తారన్న భరోసాను ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేస్తోంది.


