పూడురు సర్పంచ్.. ఒకరోజు ఆమె, మరొకరోజు ఆయన.. ఏంటీ మాకీ కన్‌ఫ్యూజన్‌!

Telangana: Who Is Panchayat Sarpanch In Poodur Village Creating Confusion Medchal - Sakshi

మండలంలోని మేజర్‌ పంచాయతీలలో పూడూర్‌ గ్రామ పంచాయతీ ఒకటి. పూడూర్‌ గోసాయిగూడ గ్రామాలు కలిపి పూడూర్‌ గ్రామ పంచాయతీగా ఉంది. అలాంటి పూడూర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ సీట్లో సస్పెన్షకు గురైన వ్యక్తి ఒకరోజు, ఉపసర్పంచ్‌గా అవిశ్వాసంతో ఉపసర్పంచ్‌ పదవి కోల్పోయిన వ్యక్తి మరొక రోజు సర్పంచ్‌ సీట్లో కూర్చుంటూ గ్రామస్తులను అయోమయంలో పడేస్తున్నారు. అధికారులు ఏ విషయం ఖచ్చితంగా తేల్చకపోవడంతో ఎవరికి వారే సర్పంచ్‌గా కొనసాగుతుండటం గమనార్హం.

సాక్షి,మేడ్చల్‌: పూడూర్‌ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా బాబుయాదవ్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. అదే సమయంలో 7వ వార్డు నుంచి వార్డు సభ్యురాలిగా ఎన్నికైన జ్యోతిరెడ్డిని వార్డుసభ్యులు ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీలో ఉండటంతో అంతా సాఫీగా సాగింది. తదనంతరం మారిన రాజకీయ సమీకరణాలతో బాబుయాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఫిబ్రవరిలో బాబుయాదవ్‌ ఓ రియల్‌ ఎస్టెట్‌ వెంచర్‌ ఏర్పాటు వ్యవహారంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో జిల్లా అధికారులు బాబుయాదవ్‌ను సర్పంచ్‌ పదవి నుంచి తొలగించి ఉపసర్పంచ్‌ జ్యోతికి సర్పంచ్‌ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో జ్యోతిరెడ్డి కాంగ్రెస్‌ నుంచి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 

అవిశ్వాసంలో పదవి కోల్పోయి.. తిరిగి ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌గా బాధ్యతులు 
ఈ క్రమంలో వార్డు సభ్యులు ఉపసర్పంచ్‌ జ్యోతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది నెగ్గడంతో ఉపసర్పంచ్‌ పదవి కోల్పోయింది. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్‌ స్థానాలు రెండు ఖాళీ కావడంతో ఒక వార్డుమెంబర్‌కు ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌ బాధ్యతుల అప్పగించాల్సి ఉండగా.. తిరిగి 7వ వార్డు సభ్యురాలైన జ్యోతిరెడ్డి ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌గా అధికారులు నియమించారు. 

కోర్టు ఆర్డర్‌తో సర్పంచ్‌గా బాబుయాదవ్‌.. 
రెండు నెలలు తర్వాత బెయిల్‌పై వచ్చిన బాబుయాదవ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో బాబుయాదవ్‌ తిరిగి బాధ్యతలు తీసుకుని సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. బాబుయాదవ్‌ కేవలం తప్పుడు పత్రాలతో ఎలాంటి అధికారిక పత్రాలు చూపెట్టకుండా సర్పంచ్‌ కుర్చీలో కూర్చుంటున్నాడని.. ఆయన సర్పంచ్‌గా ఉండటానికి అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని జ్యోతి తిరిగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ కుర్చీలో కూర్చుంటున్నారు. దీంతో పూడూర్‌ సర్పంచ్‌ ఎవరో తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. 

జాతరకు ముందే సర్పంచ్‌ ఎవరో తేల్చాలి.. 
గ్రామంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ, మైసమ్మ జాతరను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ జాతర మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జాతర సాఫీగా జరగాలంటే గ్రామంలో సర్పంచ్‌ ఎవరో ముందుగా అధికారులు తేల్చాలి. లేకుంటే రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని స్థానిక నాయకులు అంటున్నారు. 

ఒత్తిళ్లతోనే ఆర్డర్‌ను ఆమోదించడం లేదా? 
దీనికి పుల్‌స్టాప్‌ పెట్టాలంటే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పూడూర్‌ సర్పంచ్‌గా బాబుయాదవ్‌ పేరును జిల్లా అధికారులు అధికారికంగా ప్రకటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోర్టు ఉత్తర్వులను జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే కోర్టు ఆర్డర్‌ను ఆమోదించడం లేదని అందరూ బాహాటంగానే అనుకుంటున్నారు. మరి దీనిపై జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. 

నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు 
బాబుయాదవ్‌ సస్పెన్షకు గురికావడంతో జిల్లా కలెక్టర్‌ నన్ను పూడూర్‌ ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌గా నియమించారు. అధికారులు పదవి అప్పగిస్తే సర్పంచ్‌ సీట్లో కూర్చున్నాను. çబాబుయాదవ్‌ను తిరిగి సర్పంచ్‌గా నియమించినట్లు నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ఆయన తానే సర్పంచ్‌ను అంటూ గ్రామస్తులు, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు              
– జ్యోతిరెడ్డి 

న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. 
జిల్లా కలెక్టర్‌ సర్పంచ్‌ పదవి నుంచి నన్ను తొలగించడంతో హైకోర్టును ఆశ్రయించాను. సర్పంచ్‌గా నన్నే కొనసాగించాలంటూ న్యాయస్థానాన్ని కోరాను. ఏప్రిల్‌ 11న ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌ జ్యోతిని పదవి నుంచి తొలగిస్తూ నన్ను సర్పంచ్‌గా కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యాయస్థానం ఆర్డర్‌ కాపీలను జిల్లా కలెక్టర్, డీపీఓ, గ్రామస్థాయి అధికారులకు అందజేశాను. పిటిషన్‌లో జ్యోతిని సైతం పార్ట్‌ చేశాను. న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. అధికారుల ఆదేశానుసారమే నేను తిరిగి సర్పంచ్‌ బాధ్యతలు చేపట్టాను. స్వార్థ రాజకీయాలతో జ్యోతి వర్గీయులు గ్రామస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారు. శుక్రవారం జ్యోతి సర్పంచ్‌ సీట్లో కూర్చోవంపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను.  
– బాబుయాదవ్‌ 

ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్‌
కోర్టు ఎవరిని ఉండమంటే వారే సర్పంచ్‌. పూడూర్‌ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి వివరణ కోరితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కొత్తగా అడుగుతారేంటి అక్కడ మొన్నటి వరకు ఎవరు ఉంటే వారే సర్పంచ్‌గా ఉంటారు. కోర్టు బాబుయాదవ్‌ను సర్పంచ్‌గా నియమించింది. ఆయనే సర్పంచ్‌గా కొనసాగుతారు. శుక్రవారం జ్యోతి సీట్లో కూర్చుంది కదా అని అడగగా తనకు తెలియదని... ఉదయం కూర్చుంటే కూర్చుండొచ్చు కాని ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్‌.    
– డీపీఓ రమణమూర్తి 

చదవండి: అయ్యో మౌనిక.. ప్రమాదం అని తెలియక మృత్యువు పక్కనే కూర్చున్నావా!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top