
రాష్ట్ర పారిశ్రామిక ఎగుమతులు పైపైకి
2024–25లో రూ.1.35 లక్షల కోట్ల ఎగుమతులు జరిగినట్లు అంచనా
2023–24తో పోలిస్తే 23% వృద్ధి నమోదు
ఫార్మా రంగానికి దీటుగా ఏరోస్పేస్, రక్షణ ఎగుమతులు
పెరుగుతున్న ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం
వచ్చే ఐదేళ్లలో 25 వేల సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటవుతాయని అంచనా
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి, వేతనాల పెరుగుదల, ఉత్పత్తి వ్యయం పెరగడం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం తదితరాల నేపథ్యంలో పలు దేశాలు, కంపెనీలు ‘చైనా ప్లస్ వన్’వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. భారత్, థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా వంటి దేశాలు ఎక్కువగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆ దేశం వెలుపల వ్యాపార విస్తరణకు, పారిశ్రామిక రంగ అభివృద్ధికి మొగ్గు చూపుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ సైతం ఇదే వ్యూహంతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో తెలంగాణ పారిశ్రామిక ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలకు చిరునామాగా ఉన్న జిల్లాలు పారిశ్రామిక ఎగుమతుల్లో కీలకంగా నిలుస్తున్నాయి. అంతరిక్షం, రక్షణ, ఔషధాలు, కర్బన రసాయనాలు, ఎలక్ట్రిక్ పరికరాలు తదితర రంగాల ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈలు గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి.
ఏరో స్పేస్ వేగం..
2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పారిశ్రామిక ఎగుమతులు రూ.1.16 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022–23 (రూ.91,776 కోట్లు)తో పోలిస్తే 23 శాతం వృద్ధి నమోదైంది. గత (2024–25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి గణాంకాలు అందుబాటులోకి రానప్పటికీ డిసెంబర్ నాటికి ఏరోస్పేస్ రంగం ఎగుమతుల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. 2023–24లో ఈ రంగంలో ఎగుమతులు రూ.15,907 కోట్లు కాగా గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.30,742 కోట్లకు చేరినట్లు అంచనా.
2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగ ఎగుమతులు రూ.41 వేల కోట్లకు చేరినట్లు లెక్కలు వేస్తున్నారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తెలంగాణ పారిశ్రామిక ఎగుమతులు రూ.1.35 లక్షల కోట్లకు చేరినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా ఏరోస్పేస్ రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తుండటంతో ఈ రంగం వేగంగా పురోగమిస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు చెప్తున్నారు.
కొనసాగుతున్న ఫార్మా ఆధిపత్యం
తెలంగాణ పారిశ్రామిక ఎగుమతుల్లో ఫార్మా రంగం ఆధిపత్యం కొనసాగుతోంది. పారిశ్రామిక ఎగుమతుల్లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు రాష్ట్రానికి వెన్నెముకగా నిలుస్తుండగా..ఫార్మా ఎగుమతుల్లో ఈ క్లస్టర్లు అధికంగా ఉండే సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
2023–24 నివేదికల ప్రకారం రాష్ట్ర పారిశ్రామిక ఎగుమతుల్లో ఈ నాలుగు జిల్లాల వాటాయే 87 శాతం మేర ఉంది. 2024–25 ప్రాథమిక నివేదిక ప్రకారం కేవలం రంగారెడ్డి జిల్లా నుంచే 40 శాతం ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధానికి పొరుగునే ఉండటం, పారిశ్రామిక పార్కులు, ఇతర మౌలిక వసతులు కేంద్రీకృతమై ఉండటం రంగారెడ్డి జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతోంది.
వచ్చే ఐదేళ్లలో రెట్టింపు
ప్రస్తుతం అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా నుంచి ఎక్కువ మొత్తంలో పారిశ్రామిక దిగుమతులు జరుగుతుండగా, తెలంగాణ నుంచి సుమారు వంద దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. పారిశ్రామిక ఎగుమతుల్లో కీలకమైన ఎంఎస్‌ఎంఈలు ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్ సప్లై చైన్‌లో కీలకంగా మారుతుండగా, మరోవైపు స్థానికంగా ఉపాధిలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తెలంగాణ ఎంఎస్‌ఎంఈ పాలసీ ప్రకటించిన నేపథ్యంలో.. వచ్చే ఐదేళ్లలో పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులు రెట్టింపు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ పాలసీలో భాగంగా ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు అవసరమైన భూమి, నిధులు, ముడి సరుకు, మార్కెట్‌తో అనుసంధానం, అన్ని పారిశ్రామిక పార్కుల్లో ఎంఎస్‌ఎంఈలకు 20 శాతం ప్లాట్ల కేటాయింపు వంటి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 25 వేల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు.