రాష్ట్రంలో తలసరి ఆరోగ్య ఖర్చు రూ.5,110 | Telangana ranks 8th in the country in health expenditure | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో తలసరి ఆరోగ్య ఖర్చు రూ.5,110

Apr 29 2023 3:54 AM | Updated on Apr 29 2023 11:55 AM

Telangana ranks 8th in the country in health expenditure - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో కలిపి ఆరోగ్యంపై చేస్తున్న తలసరి ఖర్చు రూ. 5,110గా ఉందని, ఈ అంశంలో తెలంగాణ దేశంలో ఎనిమిదో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆరోగ్య ఖర్చు రూ. 5,114గా ఉందని తెలిపింది. ఆరోగ్యంపై దేశంలో అత్యధికంగా కేరళ తలసరి రూ.10,607 ఖర్చుతో తొలిస్థానంలో నిలిచిందని వివరించింది.

ఈ మేరకు జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనాల నివేదిక–2019–20లో వివరాలను తాజాగా వెల్లడించింది. తెలంగాణలో ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగం కలిపి ఆరోగ్యంపై రూ.18,908 కోట్లు వ్యయం అవుతోందని.. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో 2 శాతమని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యయం రూ. 27,105 కోట్లు అని, ఇది ఆ రాష్ట్ర జీఎస్‌డీపీలో 2.8 శాతమని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యంపై రూ.8,374 కోట్లు ఖర్చు చేస్తోందని.. రాష్ట్ర మొత్తం ఆరోగ్య ఖర్చులో ఇది 44.3 శాతమని పేర్కొంది.

ప్రభుత్వం తలసరి చేస్తున్న ఖర్చు రూ.2,125గా ఉందని తెలిపింది. రాష్ట్ర బడ్జెట్‌లో 6.7 శాతాన్ని ఆరోగ్య రంగం కోసం వ్యయం చేస్తున్నారని.. దీనిలో దేశంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉందని వెల్లడించింది. అత్యధికంగా కేరళ బడ్జెట్‌లో 8 శాతం ఖర్చు చేస్తోందని వివరించింది. ఏపీలో ప్రభుత్వం 9,005 కోట్లు ఆరోగ్యంపై ఖర్చు చేస్తోందని వెల్లడించింది.  

ప్రజారోగ్య బీమాలో తెలంగాణ పదో స్థానం 
తెలంగాణలో మొత్తం వైద్య ఖర్చులో 41.6 శాతం ప్రజలు సొంత జేబు నుంచి ఖర్చు చేస్తున్నారు. ఈ అంశంలో దేశంలో అతి తక్కువ ఖర్చు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. అత్యంత తక్కువగా 31.8 శాతం ప్రజల ఖర్చుతో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. 

ఇక దేశంలో ప్రైవేట్‌ ఆరోగ్య బీమా కోసం ప్రజలు ఏటా చేస్తున్న వ్యయం రూ.45,838 కోట్లు.ఇందులో ఉద్యోగుల ఖర్చు రూ.25,881 కోట్లు, మిగతాది ఇతరులు ఖర్చు చేస్తున్నారు. 

ప్రజలు సొంత జేబు నుంచి చేస్తున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో 67వ స్థానంలో ఉంది. దేశంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 100 డాలర్లు (సుమారు రూ.8,200) ఖర్చు చేస్తున్నారు. అత్యంత తక్కువగా కిరిబితి దేశంలో ఏటా కేవలం 0.2 డాలర్లు
(రూ.16) ఖర్చు చేస్తున్నారు. 

ప్రజలు తమ జేబు నుంచి పెట్టుకునే తలసరి ఖర్చుతెలంగాణలో రూ.2,263 కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో అంతకంటే తక్కువగా రూ.1,699 ఉంది. 

ప్రజారోగ్య బీమాకు సంబంధించి.. తెలంగాణలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.300 కోట్ల ఖర్చుతో పదో స్థానంలోనిలిచింది. అత్యధికంగా తమిళనాడు ‘ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం’కింద రూ.1,467 కోట్ల వ్యయంతో మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.1,305 కోట్లు ఖర్చు చేస్తూ రెండో స్థానంలో నిలిచింది. 

దేశంలో మొత్తంగా ఆరోగ్యంపైజరుగుతున్న వ్యయంలో..కుటుంబాలు పెట్టే ఖర్చు 59.2 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం, కేంద్రం 12 శాతం, స్వచ్ఛంద సంస్థలు 8 శాతం, స్థానిక సంస్థలు 0.99% ఖర్చు చేస్తున్నాయి. మిగతా ఖర్చు ఇతర పద్ధతుల్లో జరుగుతోంది. 

దేశంలో ప్రభుత్వం ద్వారా అందే వైద్యసేవలతో 25.5 శాతం, ప్రైవేట్‌ ద్వారా 33 శాతం, ఫార్మసీల ద్వారా 22 శాతం, లే»ొరేటరీల ద్వారా 4 శాతం, ఇతర పద్దతుల ద్వారా మిగతా ఖర్చు జరుగుతోంది. 

ప్రజలు అత్యధికంగా ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నది స్విట్జర్లాండ్‌లో.. అక్కడ ఏటా 2,201 డాలర్లు (సుమారు రూ.1.8 లక్షలు) ఖర్చు చేస్తున్నారు. అమెరికాలో ఏటా 1,163 డాలర్లు (సుమారు రూ.95 వేలు) ఖర్చు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement