ఏపీకి వెళ్లాల్సిందే.. సోమేశ్‌ కుమార్‌కు హైకోర్టు ఆదేశం | Sakshi
Sakshi News home page

ఏపీకి వెళ్లాల్సిందే.. సోమేశ్‌ కుమార్‌కు హైకోర్టు ఆదేశం

Published Wed, Jan 11 2023 1:51 AM

Telangana High Court Orders IAS Somesh Kumar Report To Andhra Pradesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆయనను ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు కేటాయించినందున అక్కడికే వెళ్లి విధులు నిర్వహించాలని తేలి్చచెప్పింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ 2016లో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ పరిధి క్యాట్‌కు లేదని స్పష్టం చేసింది.

కేంద్రం జారీ చేసిన కేటాయింపులను సమర్థించింది. అఖిల భారత సరీ్వసు అధికారుల కేటాయింపులు, కేడర్‌ నియంత్రణ, నిర్ణయాధికారం కేంద్రానిదేనన్న వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. చట్టపరమైన వాటితో పాటు ఇతర అన్ని అంశాలను క్యాట్‌ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎస్‌.నందాతో కూడిన ధర్మాసనం 89 పేజీల తీర్పును వెలువరించింది.

కాగా అప్పీల్‌ కోసం తీర్పు అమలును మూడు వారాలు నిలిపేయాలన్న సోమేశ్‌కుమార్‌ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అన్ని అంశాలను వివరంగా పరిశీలించిన తర్వాతే తీర్పు ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల పంపిణీకి సంబంధించిన వివాదాలపై గతంలో క్యాట్‌ జారీ చేసిన ఉత్తర్వులను.. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ హైకోర్టులో సవాల్‌ చేసింది. సుదీర్ఘ కాలం ఇరుపక్షాల వాదనలు విని, గత జూలైలో తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది.     

మాకెలాంటి పక్షపాతం కనిపించడం లేదు.. 
‘కేంద్రానికి క్యాట్‌ అప్పిలేట్‌ అధికారిగా వ్యవహరించలేదు. అది చట్టప్రకారం సమర్ధనీయం కాదు. ఆలిండియా కేడర్‌ ఉద్యోగులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. ఫలానా రాష్ట్రంలోనే పని చేస్తానని చెప్పడం సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధం. సోమేశ్‌ను ఏపీకి కేటాయించడంలో మాకు ఎలాంటి పక్షపాతం కనిపించడం లేదు. సీరియారిటీ, కేడర్‌ దెబ్బతింటుందన్న వాదనలో వాస్తవం లేదు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్రం కేడర్‌ విభజన చేసింది. పరస్పర బదిలీకి సంబంధించి సోమేశ్‌ చేసిన అభ్యర్థనను మార్గదర్శకాల మేరకు కేంద్రం తిరస్కరించింది.

1989 బ్యాచ్‌ అధికారి సోమేశ్‌కు, 1990 బ్యాచ్‌ అధికారి రజత్‌భార్గవ్‌తో పరస్పర బదిలీ సాధ్యం కాదంది. విభజన సమయంలో సీఎస్‌గా ఉన్న మొహంతి.. ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో సభ్యుడిగా ఉండటం సరికాదని, కుమార్తె, అల్లుడికి ప్రయోజనం కలుగుతున్నందున కమిటీలో ఆయన ఉండొద్దన్న క్యాట్‌ నిర్ణయం సమర్ధనీయం కాదు. కేంద్రాన్ని ఆయన ఎలా ప్రభావితం చేశారో ఎవరూ చెప్పలేదు.

60 ఏళ్లు నిండటంతో 2014 ఫిబ్రవరిలో మొహంతి పదవీకాలం ముగిసింది. అయినా విభజన దృష్ట్యా 4 నెలలు పదవీ కాలాన్ని పొడిగించారు. జూన్‌ 1న పదవీ విరమణకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను నాటి సర్కార్‌ అంగీకరించింది. విరమణ రోజును పని దినంగా పేర్కొనరాదని నిబంధనలున్నా.. క్యాట్‌ ఆ రోజును కూడా పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పుబట్టాల్సిందే. ఈ కేసులో సోమేశ్‌ తరఫున నాటి జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. సోమేశ్‌ అఫిడవిట్‌ ఎందుకు వేయలేదన్నది సందిగ్ధం..’ అని తీర్పులో ధర్మాసనం పేర్కొంది. 

క్యాట్‌లో ఒకలా..హైకోర్టులో మరోలా.. 
సివిల్‌ సర్వీస్‌ అధికారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే కేడర్‌ కంట్రోలింగ్‌ అథారిటీ. ఇష్టం వచి్చన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే హక్కు సదరు అధికారులకు లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదు. తెలంగాణలో సోమేశ్‌ కొనసాగింపు చట్ట వ్యతిరేకం. ఆయన కంటే సమర్థులు లేరని తెలంగాణ భావిస్తే ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి డెప్యుటేషన్‌ మీద మళ్లీ రప్పించుకోవచ్చు. ఈ కేసుపై క్యాట్‌లో విచారణ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్‌ కేటాయింపులపై నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.

హైకోర్టు ఎదుట మాత్రం వైఖరిని మార్చుకుంది. రాష్ట్ర విభజనకు అపాయింటెడ్‌ డే అయిన జూన్‌ 2, 2014కు ఒకరోజు ముందు పీకే మొహంతి రిటైరయ్యారు. అందుకే ఆయనను ఇరు రాష్ట్రాల మధ్య విభజన అధికారుల జాబితాలో చేర్చలేదు. అలా చేర్చి ఉంటే తనకు తెలంగాణ వచ్చేదన్న సోమేశ్‌కుమార్‌ వాదన సరికాదు. అధికారుల విభజనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో పీకే మొహంతి ఎక్స్‌అఫీíÙయో మెంబర్‌ మాత్రమే. మిగతా సభ్యులు ఉండగా ఆయన వివక్ష చూపడానికి అవకాశం లేదు. క్యాట్‌ ఉత్తర్వులను కొట్టేయాలి. సోమేశ్‌కుమార్‌ ఏపీకి వెళ్లాల్సిందే. 
– ఏఎస్‌జే టి.సూర్యకరణ్‌రెడ్డి 

సోమేశ్‌ అవకాశాలను మొహంతి దెబ్బతీశారు 
రాష్ట్ర విభజన సమయంలో అఖిల భారత సర్వీస్‌ అధికారుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో సమైక్యాంధ్ర చివరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మొహంతి రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించలేదు. ఆయన తన కుమార్తె, అల్లుడికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు ఒక్కరోజు ముందు పదవీ విరమణ చేసిన మొహంతి పేరిట 2014, జూన్‌ 1న కూడా ప్రభుత్వ జీవోలు జారీ అయ్యాయి. దీని ప్రకారం అప్పటివరకు సరీ్వస్‌లో ఉన్న మొహంతిని ఏపీ లేదా తెలంగాణకు కేటాయించక పోవడం చట్ట వ్యతిరేకం. చివరిరోజు వరకు విధుల్లో ఉండి ఆపై రాజీనామా చేయడం ద్వారా కావాలని సోమేశ్‌కుమార్‌ అవకాశాలను దెబ్బతీశారు. లబి్ధదారుడైన మొహంతి కమిటీలో సభ్యుడిగా ఉండటం చెల్లదు. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి. 
– సోమేశ్‌కుమార్‌ తరఫు న్యాయవాదులు  

రాష్ట్ర ఏర్పాటు నుంచే వివాదం.. 
రాష్ట్ర విభజన (2014) నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సరీ్వస్‌ ఉద్యోగుల విభజనలో భాగంగా సోమేశ్‌ను ఏపీకి కేటాయించారు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా, తెలంగాణకు కేటాయిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి సోమేశ్‌ తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. క్యాట్‌ జారీ చేసిన ఉత్తర్వులను 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది.

సోమేశ్‌కు సంబంధించి క్యాట్‌ ఇచి్చన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జే) టి.సూర్యకరణ్‌రెడ్డి, సోమేశ్‌కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారాంమూర్తి, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్, ఏపీ తరఫున పి.గోవింద్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా సోమేశ్‌కుమార్‌తో పాటు మరో 14 మంది ఆలిండియా కేడర్‌ సరీ్వస్‌ అధికారులు కాŠయ్‌ట్‌ ద్వారా అనుమతి పొంది తెలంగాణలో పనిచేస్తుండటం గమనార్హం. వీరందరికీ సంబంధించి కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement