
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను రద్దు చేస్తూ.. మెయిన్స్ పరీక్షల రీవాల్యూయేషన్‌కు ఆదేశించింది. ఒకవేళ రీవాల్యూయేషన్ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు చుక్కెదురైనట్లయ్యింది.
గ్రూప్-1 వాల్యూయేషన్‌లో(మూల్యాంకనం) అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు, అలాగే ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని ఒక్కటిగా విచారించిన హైకోర్టు.. జులై 7న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో..
‘‘సంజయ్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఇచ్చిన తీర్పులోని మాన్యువల్ ప్రకారం రీవాల్యూయేషన్ జరగాలి. అవకతవకలకు తావు లేకుండా వాల్యుయేషన్ చేయాలి. ఆ తర్వాతే 563 మందిని ఎంపిక చేసి పోస్టింగులు ఇవ్వాలి. మరోసారి అవకతకవలు జరిగితే మళ్లీ పరీక్షలకు ఆదేశిస్తాం’’ అని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు వెల్లడించారు
ఇప్పటికే గ్రూప్-1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈలోపు.. రీవాల్యూయేషన్‌కు ఆదేశిస్తూ రిక్రూట్‌మెంట్ బోర్డు(TGPSC)ను హైకోర్టు ఆదేశించింది. రీవాల్యూయేషన్ జరిపించిన తర్వాతే వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.
తీర్పుపై సవాల్
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల రీవాల్యూయేషన్‌కు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ ఇవాళ ఇచ్చిన తీర్పును సవాల్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. నిరాశలో ఉన్న అభ్యర్థులు సైతం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే యోచనలో ఉన్నారు.

కిందటి ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన 563 పోస్టులకు టీజీపీఎస్సీ తరఫున నోటిఫికేషన్ వెలువడింది. మే/జూన్‌లో ప్రిలిమ్స్, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో మెయిన్స్ ఫలితాలు, ఏప్రిల్‌లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా పూర్తైంది. పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ పోస్టింగులకు బ్రేకులు వేసింది.