మా అవసరాలు తీరాకే.. | Telangana Has Once Again Made Clear Godavari Water Diverted To Kaveri | Sakshi
Sakshi News home page

మా అవసరాలు తీరాకే..

Aug 25 2020 2:22 AM | Updated on Aug 25 2020 2:22 AM

Telangana Has Once Again Made Clear Godavari Water Diverted To Kaveri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర నీటి అవసరాలు పూర్తిగా తీరాకే గోదావరి నీటిని కావేరికి మళ్లించాలని తెలంగాణ మరోమారు కేంద్రానికి స్పష్టం చేసింది. తమకున్న నికర జలాల వాటాను ముట్టుకోవద్దని, దీంతో పాటే భవిష్యత్తులో ఏర్పడే రాష్ట్ర అవసరాల నీటి వాటాను పక్కన పెట్టి, ఏవైనా మిగులు జలాలుంటేనే మళ్లించాలని తెగేసి చెప్పింది. ఈ మేరకు సోమవారం కేంద్ర జల శక్తి శాఖ పరిధిలోని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ తన వాదన వినిపిం చింది. అనుసంధాన ప్రతిపాదనను ఓకే చేసి తుది ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారు చేసే సమయంలోనే తమతో చర్చించకుండా ముందు కెళ్లరాదని కేంద్రానికి సూచించినట్లు తెలిసింది. 

అనుసంధానానికి 3 ప్రతిపాదనలు..
ఒడిశాలోని మహానది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరిని కలుపుతూ పెన్నా మీదుగా తమిళనాడులోని కావేరి నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి ఉపనదులు కలసిన అనంతరం, ఇచ్చంపల్లికి 63 కిలోమీటర్ల దిగు వన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద నుంచి 247 టీఎంసీల నీటిని కృష్ణా మీదుగా కావేరికి తరలిస్తామని ప్రతి పాదించింది. రాష్ట్ర ప్రయోజనాలు పెద్దగా లేని ఈ ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. తమ ప్రాంతంలో ముంపు ఎక్కువగా ఉంటుం దని వాదించింది. తెలంగాణ అభ్యంతరాల నేప థ్యంలో రెండో ప్రతిపాదనగా జనంపేట మీదుగా పైప్‌లైన్‌ ద్వారా నీటిని నాగార్జున సాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో ఇప్పటికే సాగులో ఉన్న ఆయకట్టు తీవ్రంగా నష్టపోతామని తెలంగాణ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీంతో ఇఛ్చిం పల్లి నుంచి నీటి తరలింపు అంశం తెరపైకి వచ్చింది. మూసీ రిజర్వాయర్‌ కేంద్రంగా ఇఛ్చింపల్లి– నాగార్జునసాగర్‌ను అనుసంధానిం చాలని ప్రతిపాదించింది. అయితే దీని సాంకే తిక, ఆర్థిక అంశాలపై ఎన్‌డబ్ల్యూడీఏ అధ్య యనం చేయాల్సి ఉంది.
 
కృష్ణా బేసిన్‌కు గోదారి జలాలు...
ఈ నేపథ్యంలో కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ అధ్యక్షతన, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భూపాల్‌ సింగ్‌ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు గోదావరిలో తనకున్న నికర జలాల వాటా 954 టీఎంసీలను ముట్టుకో రాదని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేయగా.. కేంద్రం అంగీకరించినట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుల అవసరాలకే ఈ నీరు సరిపోతుందని చెప్పింది. ఇక కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు నీటి వాటాలు తక్కువని, అవసరాలు మాత్రం గణనీయమని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కృష్ణా బేసిన్‌ అవసరాలు తీర్చేందుకు గోదావరి మిగులు జలాలే శరణ్యమని చెప్పినట్లుగా తెలిసింది. కనీసం 1,600 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని ఈ మేరకు పక్కనపెట్టాకే మిగిలిన నీరు ఏదైనా ఉంటేనే వాటిని మళ్లించాలని స్పష్టత ఇచ్చింది. అదీగాక జనంపేట ప్రతిపాదనతో తెలంగాణకు దక్కేది 39 టీఎంసీలే (17శాతం) అని, ఇచ్ఛంపల్లి ప్రతిపాదన ద్వారా కూడా 66 టీఎంసీ (27.6 శాతం) మాత్రమేనని దృష్టికి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచి నీటిని మళ్లిస్తూ ఏపీకి 81 టీఎంసీ, తమిళనాడుకు 83 టీఎంసీల మేర నీటిని కేటాయించారని అభ్యంతరం చెప్పింది. ఆయకట్టు వారీగా చూసినా తెలంగాణలో కొత్తగా లక్ష హెక్టార్ల కన్నా తక్కువగానే వస్తోందని.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు 2 లక్షల హెక్టార్ల మేర లబ్ధి కలుగుతోందని పేర్కొంది. 

50% డిపెండబులిటీ ఆధారంగానే...
ఇక గోదావరిలో మిగులు జలాలను 50 శాతం నీటి లభ్యత (డిపెండబులిటీ) ఆధారంగానే లెక్కించాలని తెలంగాణ కోరింది. అయితే 75 శాతం నీటి లభ్యత ఆధారంగా నీటిని గణించి అనుసంధాన డీపీఆర్‌ రూపొందిస్తున్నామని ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. ఇక నదుల అనుసంధాన ప్రక్రియపై మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారని, తుది ప్రత్యామ్నాయాన్ని తెలంగాణతో చర్చించిన తర్వాతే ఖరారు చేయాలని రాష్ట్రం కోరగా, దీనికి కేంద్రం అంగీకరించింది. పరీవాహక రాష్ట్రాలన్నింటికీ డీపీఆర్‌లు పంపి వారి ఆమోదం తీసుకుంటామని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. వినియోగంలో లేదని చెబుతూ ఇంద్రావతి నది నీటిని మళ్లించేందుకు ఛత్తీస్‌గఢ్‌ అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ తుది డీపీఆర్‌ ఉండాలని తెలంగాణ స్పష్టం చేసింది. అయితే తమ రాష్ట్ర అవసరాలు తీరాలంటే గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని తమిళనాడు ఈ సమావేశంలో గట్టిగా కోరినట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement