ప్రభుత్వ రంగ సంస్థల అప్పులకు తెలంగాణ సర్కారు ఎడాపెడా గ్యారంటీలు
జీఎస్‌డీపీలో 15.1% చేరిక.. ఇది దేశంలోనే అత్యధికం
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అప్పులకు ఈ గ్యారంటీలు అదనం
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి 26 శాతానికి సాధారణ అప్పులు
2015–23 మధ్య బడ్జెట్ అంచనాల్లో ఏకంగా 21 శాతం లోటు
నిధులన్నీ సంక్షేమం, సబ్సిడీలకే
నిధుల కేటాయింపులో అట్టడుగున విద్య, వైద్య రంగాలు
పీఆర్‌ఎస్ ‘స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్’ నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ‘గ్యారంటీ’ల గండం పట్టుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు చేస్తున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా గ్యారంటీలు ఇవ్వటంతో పరిస్థితి విషమించింది. అధికారిక అప్పులకు తోడు లెక్కల్లోకి రాని ఈ ‘గ్యారంటీ’ అప్పులు కొండలా పేరుకుపోయాయి. గ్యారంటీ అప్పుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తాజా నివేదికలో ప్రకటించింది.
ఇది చాలా ప్రమాదకరమైన ఆర్థిక నిర్వహణ అని హెచ్చరించింది. గ్యారంటీ అప్పులు జీఎస్‌డీపీలో ఏకంగా 15.1 శాతానికి చేరాయని వెల్లడించింది. నిధులన్నీ సంక్షేమం, సబ్సిడీలకే పోతున్నాయని.. భవిష్యత్తుకు కీలకమైన విద్య, వైద్య రంగాలను గాలికి వదిలేశారని తూర్పారబట్టింది. బడ్జెట్ అంచనాలు ఏకంగా 21 శాతం గల్లంతవుతుండటం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి అద్దం పడుతోందని నివేదిక పేర్కొంది.
అప్పుల ఊబిలోకి రాష్ట్రం..
‘స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్’నివేదిక తెలంగాణ రాష్ట్ర ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని హెచ్చరించింది. ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇచ్చిన గ్యారెంటీలు జీఎస్‌డీపీలో 15.1 శాతానికి చేరగా, ఇందులో సింహభాగం (37%) నీటిపారుదల రంగానికే ఉండటం గమనార్హం. దేశంలో మరే రాష్ట్రం ఇంతటి భారీ గ్యారెంటీలను ఇవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ గ్యారెంటీలకు తోడు, 2025 మార్చి నాటికి అధికారిక అప్పులు సైతం జీఎస్‌డీపీలో 26 శాతానికి చేరాయి. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం కమిటీ నిర్దేశించిన 20% పరిమితి కంటే చాలా ఎక్కువ. రాష్ట్రం బడ్జెట్ వెలుపల చేసే అప్పులు కూడా కొనసాగుతున్నాయి. 2024–25లో ఇవి రూ.2,697 కోట్లుగా ఉన్నాయి.
కాగితాలపై కోటలు.. వాస్తవాలకు బీటలు
పీఆర్‌ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. 2015–23 మధ్య కాలంలో బడ్జెట్‌లో వేసిన అంచనాలకు, వాస్తవంగా వచ్చిన ఆదాయానికి మధ్య ఏకంగా 21% వ్యత్యాసం (లోటు) కనిపించింది. దేశంలో అత్యంత దారుణమైన పనితీరులో ఇది ఒకటి అని నివేదిక పేర్కొంది. కాగితాలపై కోటలు కట్టడం, తీరా ఆదాయం రాకపోవడంతో.. చివరకు అభివృద్ధి పనులకు భారీగా కోత పెట్టాల్సి వస్తోంది.
ఇదే కాలంలో రాష్ట్రం తన మూలధన వ్యయంలో 12% కోత విధించింది. రాష్ట్రం సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో బలంగా ఉంది. మొత్తం ఆదాయంలో 77% సొంత వనరుల (63% సొంత పన్నులు, 14% పన్నేతర ఆదాయం) నుంచే వస్తోంది. జీఎస్‌డీపీలో సొంత పన్నుల వాటా 8.1%గా ఉంది. ఆదాయం ఇలా బలంగా ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రణాళిక మాత్రం దారుణంగా విఫలమవుతోంది.
విద్య, వైద్యానికి మంగళం:
రాష్ట్ర ఖజానాలో సంక్షేమం, సబ్సిడీలకు పెద్ద పీట వేస్తున్న క్రమంలో కీలకమైన మౌలిక రంగాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. రెవెన్యూ ఆదాయంలో 14% సబ్సిడీలకే పోతోంది. ఇందులో సింహభాగం 76% కరెంట్ సబ్సిడీలకే వెళ్తుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమానికి బడ్జెట్‌లో 12.4% వాటా ఇచ్చి దేశంలో రెండో స్థానంలో నిలిచారు. కానీ, భవిష్యత్ తరాలను నిర్మించే కీలక రంగాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజారోగ్యంపై తెలంగాణ తన బడ్జెట్‌లో 4.8% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది దేశంలోనే అత్యల్పం.
విద్యారంగానికి చేసిన కేటాయింపులు 9.0% మాత్రమే. ఇది కూడా దేశంలోనే అత్యంత తక్కువ కావడం గమనార్హం. మౌలిక వసతులైన రోడ్లు, వంతెనల కోసం ఖర్చు చేస్తున్నది 1.9% మాత్రమే. సొంత ఆదాయం బలంగా ఉన్నా ఆ డబ్బంతా సబ్సిడీలకే పోతుండటం, మరోవైపు గ్యారెంటీల పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం రాష్ట్రాన్ని ప్రమాదపు అంచున నిలబెట్టిందని నివేదిక హెచ్చరించింది. కీలకమైన విద్య, వైద్యం కుంటుపడటంతో రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని నివేదిక పేర్కొంది.


