
సాక్షి ఖమ్మం(సత్తుపల్లి): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మైకు పట్టుకుంటే వందల కోట్ల హామీలు ఇస్తారని, కానీ, ఆచరణలో మాత్రం రూ.10 లక్షలు కూడా ఇవ్వరని, మాయమాటలు చెప్పటంలో ఆయన సిద్ధహస్తుడని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్ మీ టైం అయిపోయింది..’అని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ ఆతీ్మయ సమ్మేళనాన్ని సత్తుపల్లిలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎనిమిదిన్నరేళ్లలో చేయలేని పనులు ఏడు నెలల్లో చేస్తానంటూ మంత్రివర్గ సమావేశాల్లో కేసీఆర్ చెప్పడం ఎన్నికల స్టంటేనని విమర్శించారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను, మద్దతు పలికిన బీజేపీని కాదని కేసీఆర్‌ను సీఎంను చేస్తే బంగారు తెలంగాణ అంటూనే రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో 500 మందికి దళితబంధు ఇస్తామని చెప్పారని, ఈ ఐదు నెలల్లో ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, రాష్ట్ర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్ పాల్గొన్నారు.