పాఠాలు.. ప్రాక్టికల్‌గా 

Telangana Education Department Working Hard To Change Educational Approach - Sakshi

చదువులో.. సృజనాత్మకతే కీలకం 

సీబీఎస్‌ఈలో మంచి ఫలితాలు.. తెలంగాణ కూడా అదే బాటలో 

రాష్ట్ర విద్య పరిశోధన విభాగం కసరత్తు.. 

సరికొత్త విద్యా ప్రణాళిక వైపు అడుగులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చదువుకు మరింత పదును పెట్టేందుకు విద్యా శాఖ నడుం బిగిస్తోంది. అర్థమయ్యే బోధనా విధానాలే కాకుండా, ఏమాత్రం కష్టం లేని పరీక్ష పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు ఈ విధానాన్ని మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సరికొత్త విద్యా విధానంపై కసరత్తు మొదలు పెట్టింది.

కరోనా కారణంగా పాఠశాలల్లో బోధన, పరీక్ష విధానాలను మార్చుకోవడం అనివార్యమైంది. గడిచిన రెండేళ్లుగా సిలబస్‌ను కుదించడం, ఐచ్ఛిక ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించడం తప్పని సరైంది. నిజానికి ఈ తరహా బోధన పద్ధతులను సీబీఎస్‌సీ ఇప్పటికే అమలు చేస్తోంది. తరగతి పాఠాల కన్నా, సృజనాత్మకత పెంచే ప్రాజెక్టులను చేపట్టింది. ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు గుర్తించారు. 

ముందున్న సవాళ్లు ఎన్నో.. 
రాష్ట్రంలో ఆధునిక బోధన విధానం ప్రస్తుతం అమల్లో ఉన్నా, ఆచరణలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు. నిజానికి పాఠశాల విద్యలో నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనే విద్యార్థి సృజనాత్మకతను అంచనా వేస్తారు. ప్రాజెక్టు వర్క్, రాత పని విధానం, ఏ కోణంలో ఆసక్తిగా ఉన్నారో తెలుస్తుంది. ప్రతి పాఠ్యాంశం ముగిసిన తర్వాత ప్రాజెక్టు వర్క్‌ ఇస్తారు. దీన్నే కీలకం చేయాలని కేంద్ర విద్యా విధానం చెబుతోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అరకొర మౌలిక వసతులు దీనికి అడ్డంకిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు 6వ తరగతిలో సంఖ్యా విధానం బోధిస్తారు. దీన్ని ప్రాక్టికల్‌గా తెలుసుకునేందుకు విద్యార్థులు గ్రామ పంచాయతీకి వెళ్లి, అక్కడ మ్యాప్‌ ద్వారా ఏ గ్రామానికి ఎంత దూరం ఉందనేది లెక్కించాలి. ఈ పని కోసం విద్యార్థులను తీసుకెళ్లేందుకు వాహనం కావాలి.

ఒక రోజంతా ఉపాధ్యాయుడు వెచ్చించాలి. పాఠశాల విద్యలో సైన్స్‌ సబ్జెక్టులో భూసార పరీక్ష గురించి ఉపాధ్యాయుడు బోధిస్తాడు. భూసార పరీక్ష లేబొరేటరీకి వెళ్లి పరీక్ష విధానాన్ని స్వయంగా విద్యార్థులు పరిశీలించాలని, దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త విద్యా విధానం చెబుతోంది.  

పరిష్కారం ఏమిటి? 
సృజనాత్మక విద్యా విధానం అమలుకు సాంకేతికతను జోడించడమే సరైన మార్గమని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు గ్రామాల మధ్య దూరం తెలుసుకోవడానికి పంచాయతీ దాకా వెళ్లే బదులు స్కూల్‌లోనే ఇంటర్నెట్‌ ద్వారా గూగుల్‌ మ్యాప్స్‌తో పరిశీలించే విధానం ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు. ఇది సాధ్యపడాలంటే హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలి. అధ్యాపకులకు సాంకేతిక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ కోణంలోనూ ఆలోచన చేస్తున్నామని ఎస్‌సీఈఆర్‌టీ అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా క్షేత్రం స్థాయిలో నేర్చుకునే సృజనాత్మకతనే పరీక్షగా భావించి, దానికే ఎక్కువ మార్కులు ఉండేలా చూడాలని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధ్యమైనంత వరకు క్షేత్రస్థాయిలో ఎక్కువ నేర్చుకుని, పాఠ్యాంశాలు తక్కువగా ఉన్నప్పుడు పరీక్షల్లో మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వడం మంచిదని పేర్కొంటున్నారు. 

స్కూళ్లకు నిధులివ్వాలి 
నేటి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు అవసరమే. ఇప్పటికే మన పాఠ్య ప్రణాళిక ప్రొగ్రెసివ్‌గానే ఉంది. కార్యాచరణలో దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు స్కూళ్లకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. మారుమూల పల్లెల్లోనూ సాంకేతిక విద్యా బోధన, ఆన్‌లైన్‌ విధానాలను తీసుకురావాలి.  
రాజా భానుచందర్‌ ప్రకాశ్, రాష్ట్ర గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top