118 నియోజకవర్గాల్లోనూ ‘దళితబంధు’

Telangana: Dalit Bandhu For 100 Families Every Assembly Constituency By March End - Sakshi

మార్చి ఆఖరులోగా వంద చొప్పున యూనిట్లకు ఏర్పాట్లు: మంత్రి ఈశ్వర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 118 శాసనసభ నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబమే యూనిట్‌గా 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మార్చి నెలాఖరు కల్లా నూరుశాతం యూనిట్లు గ్రౌండింగ్‌ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే వాసాలమర్రి గ్రామంతోపాటు హుజూరాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈ పథకాన్ని నూరు శాతం అమలు చేశామన్నారు. దళితబంధుపై శనివారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.స్థానిక ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను సంబంధిత జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో ఆమోదింపచేయాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుకూ ఏ విధమైన బ్యాంకు లింకేజీ లేకుండా రూ.10 లక్షలను ఈ పథకం కింద ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

లబ్ధిదారు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలని, ఒక్కో లబ్ధిదారుకు మంజూరైన రూ.10 లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణనిధి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.1,200 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.100 కోట్లను విడుదల చేశామని చెప్పారు. విడతలవారీగా మిగతా నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చారగొండ, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండలాల్లో కూడా నూరు శాతం అమలు చేస్తున్నామని, విడతలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ పథకం అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, కార్పొరేషన్‌ ఎం.డి.కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top