ఈసారైనా దక్కేనా! గత బడ్జెట్లలో రాష్ట్ర అవసరాలు పట్టించుకోని కేంద్రం | Sakshi
Sakshi News home page

ఈసారైనా దక్కేనా! గత బడ్జెట్లలో రాష్ట్ర అవసరాలు పట్టించుకోని కేంద్రం

Published Sun, Jan 30 2022 1:23 AM

Telangana Central Government introducing budget On on February 1st - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు లేకపోగా, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదాతో పాటు రాష్ట్ర విభజన హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా ప్రత్యేక పరిస్థితుల వేళ 2022–23 ఆర్థిక సంవత్సరంలోనైనా స్పెషల్‌ గ్రాంట్లు, ఇతర ఆర్థిక సాయం విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుందా లేదా అన్నది రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత బడ్జెట్‌ సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎంతో సహా మంత్రులు రాసిన లేఖలను పట్టించుకోని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈసారైనా రాష్ట్ర అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశమవుతోంది.

ప్రాజెక్టుల సంగతన్నా చూస్తారా? 
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్‌ను కేంద్రం ఎప్పటికప్పుడు పక్కన పెట్టేస్తోంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే నిధుల వెసులుబాటుతో పాటు భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ కూడా సులభతరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టునైనా పరిగణనలోకి తీసుకుంటారేమోనని ఎదురుచూస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏడేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన, ఉద్యాన వర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌లాంటి ప్రాజెక్టులు ఇప్పటివరకు మంజూరు చేయలేదు. ఇందులో ఒకట్రెండు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇప్పటికే చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఈసారి ఎలాంటి ప్రతిపాదనలుంటాయో అంచనా వేయలేని పరిస్థితి ఉందని ఆర్థికశాఖకు చెందిన ఓ అధికారి అన్నారు.  

ఎన్నికల రాష్ట్రాలకే నిధులా? 
గతేడాది బడ్జెట్‌ సమయంలో దేశంలోని నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు సమీపించాయి. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 2021–22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలను ప్రకటించింది. ఇప్పుడు కూడా కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మలమ్మ పద్దు ఆయా రాష్ట్రాలవైపు ఎక్కువగా తూగుతుందనే చర్చ జరుగుతోంది. 

పెండింగ్‌ నిధులు, గ్రాంట్ల కోసం మంత్రుల లేఖలు 
ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలన్న దానిపై ఇప్పటికే పలువురు మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలురాసి అభ్యర్థించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆ లేఖల్లో రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. స్పెషల్‌ గ్రాంట్‌ కింద రూ.723 కోట్లు, రాష్ట్రంలో ఏర్పడిన కొత్తలో ఏపీకి మళ్లించిన రూ.495.20 కోట్లు, పెండింగ్‌ ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లు, స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృదిధ్‌ పెండింగ్‌ నిధులు రూ.900 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.10వేల కోట్లు కావాలన్నారు.

ఈ మేరకు రానున్న బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయిస్తూ ప్రతిపాదించాలని కోరారు. వీటితో పాటు మున్సిపల్‌ ప్రాంతాల్లో ప్రజారవాణా, మౌలిక సదుపాయాల కోసం చేపడుతున్న ప్రాజెక్టులకు రూ.7,800 కోట్లు, చేనేత, టెక్స్‌టైల్‌ పరిశ్రమ కోసం రూ.954 కోట్లు, ఫార్మాసిటీతో పాటు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధికి రూ.14వేల కోట్లు, మిషన్‌ భగీరథ, కాకతీయకు నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన రూ.24,205 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ మంజూరు చేయడంతో పాటు కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకునేలా గ్రాంట్లు పెంచాలని, పన్నుల్లో వాటాను మరింత ఇవ్వాలని, సెస్‌ చార్జీల కింద వసూలు చేసిన మొత్తాల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని చాలా కాలంగా రాష్ట్రం కోరుతోంది. 

Advertisement
Advertisement