సంజయ్‌ అరెస్ట్‌ .. 14 రోజులపాటు బీజేపీ ఆందోళనలు

Telangana Bjp  Wants To Protest Rally Against Bandi Sanjay Arrest For 14 Day - Sakshi

సంజయ్‌ అరెస్ట్‌ తీరుపై 14 రోజులపాటు బీజేపీ ఆందోళనలు 

 క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొననున్న జేపీ నడ్డా..

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్, 14 రోజుల రిమాండ్‌కు పంపించిన తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. జీవో317కు నిరసనగా సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షభగ్నంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎంతదాకైనా వెళ్లేందుకు జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి బయలుదేరి నేడు హైదరాబాద్‌కు రానున్నారు.

కరీంనగర్‌ వెళ్లి ఎంపీ కార్యాలయాన్ని సందర్శించి అనంతరం జైలులో ఉన్న బండి సంజయ్‌ను పరామర్శించనున్నారు. మంగళవారంనాడు రాజధానితో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ర్యాలీలు చేప ట్టాలని రాష్ట్ర నేతలు నిర్ణ యించారు. ఆరెస్సెస్‌ జాతీయ కార్యకారణి సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం నగరానికి వస్తున్న నడ్డా... విమానాశ్రయం నుంచి నేరుగా బషీర్‌బాగ్‌ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు సాగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొననున్నారు.

బుధవారం హైదరాబాద్‌ నుంచి ‘చలో కరీంనగర్‌’కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. రిమాండ్‌కు నిరసనగా 14రోజుల పాటు ఆందోళన చేపట్టాలని  సోమ వారం రాత్రి జరిగిన కోర్‌కమిటీ భేటీలో తీర్మానించారు. డా.కె.లక్ష్మణ్, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకరరెడ్డి, రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, ఈటల, దుగ్యాల ప్రదీప్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, టి. వీరేందర్‌గౌడ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top