సిట్ విచారణపై సీజే ఉత్తర్వులు హర్షణీయం: బండి సంజయ్

సాక్షి, హైదరాబాద్: నలుగురు ఎమ్మెల్యేలకు ప్రలోభ ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని హైకోర్టు సీజే ఉత్తర్వులు జారీ చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ధర్మాసనం పట్ల తమ కు నమ్మకం ఉందని, వాస్తవాలు వెలుగులోకొచ్చి కుట్రదారులెవరో తేలి దోషులకు తగిన శిక్ష పడుతుందని అభిప్రాయపడ్డారు.
సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ వాదన అని, హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందన్న అభిప్రాయాన్ని సంజయ్ ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గతపర్చకూడదని, ఈనెల 29లోపు పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో సింగిల్ జడ్జికి సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతించారు.