
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనసభతో పాటు మండలి సమావేశాలు సైతం జరగనుండగా, ఎన్నిరోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్వించిన విచారణ నివేదికపై సభలో చర్చించే అవకాశం ఉంది.
కాగా అదేరోజు రాష్ట్ర మంత్రివర్గం కూడా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంలో ఎదురవుతున్న ఆటంకాలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై ప్రత్యేక దృష్టి
ఒకవైపు సెపె్టంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరో ప్రయత్నంగా ఆర్డినెన్స్‌లను రూపొందించి పంపగా వాటిని సైతం గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేయడంతో ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
కాళేశ్వరం కమిషన్ నివేదిక, యూరియా కొరత తదితరాలపై..
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్వించిన విచారణ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించాలని భావిస్తున్న నేపథ్యంలో.. దీనిపై సైతం మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ గృహాల నిర్మాణం, ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలను కూడా మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది.