పదేళ్లలో అక్రమార్జన రూ.1,000 కోట్లు! | Telangana ACB Registers Record thousand plus Cases in last ten years | Sakshi
Sakshi News home page

పదేళ్లలో అక్రమార్జన రూ.1,000 కోట్లు!

Oct 26 2024 6:19 AM | Updated on Oct 26 2024 6:19 AM

Telangana ACB Registers Record thousand plus Cases in last ten years

రాష్ట్రంలో అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ

2014 నుంచి ఈ ఏడాది ఆగస్టు మధ్య 1,032 కేసులు నమోదు 

అధికారిక లెక్కల ప్రకారమే అక్రమాస్తుల విలువ రూ. 265 కోట్లు 

బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ నాలుగు రెట్లపైనే..

(శ్రీరంగం కామేశ్, ‘సాక్షి’ ప్రతినిధి) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు / అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎప్పటికప్పుడు కొరడా ఝళిపిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన (డీఏ) వారితోపాటు లంచాలు తీసుకుంటూ చిక్కిన (ట్రాప్‌) వారి భరతం పడుతోంది. గత పదేళ్లలో ఏసీబీ నమోదు చేసిన కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 

2014 నుంచి 2024 ఆగస్టు మధ్య డీఏ, ట్రాప్‌ కేసులు కలిపి మొత్తం 1,032 కేసులను ఏసీబీ నమోదు చేసింది. వాటిలో 109 డీఏ కేసులుకాగా మిగిలినవన్నీ ట్రాప్‌ కేసులే కావడం గమనార్హం. డీఏ కేసుల్లో స్వా«దీనం చేసుకున్న ఆస్తుల అధికారిక విలువను రూ. 265 కోట్లుగా ఏసీబీ లెక్కించగా బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ. 1,000 కోట్లపైనే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది.

ప్రథమ స్థానంలో దేవికారాణి..
ఏసీబీ నమోదు చేసిన 109 డీఏ కేసుల్లో అత్యధికంగా 29 కేసులతో తొలి స్థానంలో నిలిచి రెవెన్యూ విభాగం అపఖ్యాతిని మూటకట్టుకోగా 20 కేసులతో మున్సిపల్‌ అడ్మిని్రస్టేషన్, 11 కేసులతో హోంశాఖ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈఎస్‌ఐ మందుల సరఫరా కుంభకోణంలో ఏసీబీ 2019లో అరెస్టు చేసిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సరీ్వసెస్‌ (ఐఎంఎస్‌) మాజీ డైరెక్టర్‌ దేవికారాణి అక్రమాస్తులే ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఆమె నుంచి స్వా«దీనం చేసుకున్న ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారమే రూ. 25,70,84,461గా తేలింది. అలాగే రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎంవీ భూపాల్‌రెడ్డిపై నమోదైన ట్రాప్‌ కమ్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 32 ఇళ్ల స్థలాలకు సంబంధించిన దస్తావేజుల అధికారిక విలువ రూ. 4.19 కోట్లుగా తేలింది. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ. 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

 లంచాల బాధితుల కోసం ఏటా రూ. 30 లక్షలు 
ఏసీబీ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే అంశం అవినీతిపరుల్ని వలపన్ని పట్టుకోవడం. బాధితులు ఓ అధికారి లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే ఏసీబీ ఆధారాలు సేకరిస్తుంది. ఆపై రహస్య కెమెరాలు, వీడియో రికార్డింగ్‌ పరికరాలను బాధితుడికి అమర్చి లంచం అడిగిన అధికారి వద్దకు పంపుతుంది. లంచం డిమాండ్‌ వీడియో రికార్డయ్యాక ఆ మొత్తంలో కొంత ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఇచ్చేలా ఫిర్యాదుదారుడితో చెప్పిస్తుంది. ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుడే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. బాధితుల నుంచి అధికారి ఆ లంచం సొమ్ము అందుకుంటుండగా అప్పటికే మాటు వేసి ఉండే ఏసీబీ బృందాలు పట్టుకుంటాయి. ఈ మొత్తాన్ని సీజ్‌ చేసి కోర్టుకు సమరి్పస్తారు. నిరీ్ణత సమయంలో ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుడికి రీయింబర్స్‌ చేస్తారు. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి రూ.30 లక్షల చొప్పున ఏసీబీకి కేటాయిస్తుంది.

‘పింక్‌’తో రెడ్‌ హ్యాండెడ్‌గా..
లంచం అడిగిన అధికారికి ఇచ్చేందుకు ఫిర్యాదుదారుడు తీసుకొచ్చే కరెన్సీ నోట్లపై ఏసీబీ ముందే ఫినాఫ్తలీన్‌ అనే రసాయన పొడిని పూస్తుంది. లంచం తీసుకొనే అధికారి లేదా ఆయన సూచించిన వ్యక్తి నోట్ల కట్టలను ముట్టుకోగానే ఈ కెమికల్‌ అంటుకుంటుంది. వెంటనే ఏసీబీ ఆ సొమ్మును స్వా«దీనం చేసుకోవడంతోపాటు సదరు అధికారి చేతుల్ని సోడియం బైకార్బొనేట్‌ ద్రావణంలో ముంచుతుంది. అప్పుడు ఆ ద్రావణం గులాబీ రంగులోకి మారుతుంది. ఈ ప్రక్రియను సాక్షుల సమక్షంలో వీడియో రికార్డింగ్‌ చేసి కోర్టుకు ఏసీబీ సమరి్పస్తుంది. 

శిక్షల వరకు ‘ప్రయాణం’లో అవాంతరాలెన్నో..
ఏసీబీ నమోదు చేసే కేసులు శిక్షల వరకు వెళ్లడం మధ్య ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులపై ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జిïÙట్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఈ దశలోనే అనేక కేసులు మూతపడటం, డిపార్ట్‌మెంట్‌ ఎంక్వైరీకి సిఫార్సు కావడం జరుగుతోంది. ఒకవేళ చార్జ్‌ïÙట్లు దాఖలు చేసినా న్యాయ విభాగంలో ఉన్న మానవవనరుల కొరతతో విచారణకు సుదీర్ఘ సమయం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు ఏసీబీ కోర్టులే ఉండటంతోపాటు కొన్ని సందర్భాల్లో సాక్షులు ఎదురు తిరగడం, సుదీర్ఘ విచారణ తదితరాల నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ కేసుల్లో శిక్షల శాతం 55గా ఉంది. దీన్ని ఈ ఏడాది 60 శాతం దాటించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

మొత్తం ఐదు రకాలైన కేసులు...
వాస్తవానికి ఏసీబీ ఐదు రకాల కేసులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ట్రాప్, డీఏ కేసులను నేరుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. వాటిని రిజిస్టర్డ్‌ కేస్‌ ట్రాప్‌ (ఆర్సీటీ), రిజిస్టర్డ్‌ కేస్‌ అసెట్స్‌ (ఆర్సీఏ) అంటారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీల ద్వారా అధికారుల నేరపూరిత దు్రష్పవర్తనను గుర్తించి ప్రాథమిక దర్యాప్తు చేపడుతుంది. అనంతరం ఆయా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సిఫార్సు చేస్తుంది. మరోవైపు ఆర్టీఏ చెక్‌పోస్టులు, కార్యాలయాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీల ద్వారా గుర్తించే అవినీతిపై రిజిస్టర్డ్‌ కేస్‌ అదర్స్‌ (ఆర్సీఓ) నమోదు చేసి శాఖాపరమైన చర్యలకు బదిలీ చేస్తుంటుంది. ఇక ఏసీబీ డీజీ సూచనల మేరకు కొన్ని అంశాలపై డిస్క్రీట్‌ ఎంక్వైరీలు చేపడుతుంది. ఇందులో ఆధారాలు లభిస్తే ఆర్సీటీ, ఆర్సీఏ కింద మార్చి ముందుకు వెళ్తుంటుంది.

ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాం
ప్రభుత్వ ఉద్యోగులు లేదా అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే మాకు ఫిర్యాదు చేయండి. 1064 నంబర్‌కు కాల్‌ చేసి లేదా నేరుగా మా 
కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి ఫిర్యాదును అన్ని కోణాల్లోనూ విచారించి చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేసిన వారి 
వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. – విజయ్‌కుమార్, డీజీ, అవినీతి నిరోధక శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement