సాదాబైనామాలపై ‘కుస్తీ’ | Tehsildars are struggling with Sadabainama applications | Sakshi
Sakshi News home page

సాదాబైనామాలపై ‘కుస్తీ’

May 3 2026 4:50 AM | Updated on May 3 2026 4:50 AM

Tehsildars are struggling with Sadabainama applications

కలెక్టర్లకు వచ్చిన మార్గదర్శకాలతో దరఖాస్తుల పరిశీలన మళ్లీ మొదటికి 

ఆమోదం పొందని అన్ని దరఖాస్తులను మరోమారు చెక్‌ చేస్తున్న తహసీల్దార్లు  

ఇప్పటివరకు ఆర్డీఓలకు చేరింది కేవలం 20 శాతం దరఖాస్తులే

సాక్షి, హైదరాబాద్‌: తహసీల్దార్లు సాదాబైనామా దరఖాస్తులతో కుస్తీ పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా 2020 అక్టోబర్, నవంబర్‌ నెలల్లో స్వీకరించిన 9 లక్షలకు పైగా దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోవడం, నియమ నిబంధనల్లో మార్పులు జరగడం, వీలున్నంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత ముమ్మరమైంది. హైకోర్టు తీర్పు అనంతరం నిర్వహించిన పరిశీలన ప్రక్రియలో అమ్మకందారుని అఫిడవిట్‌తోపాటు నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు. ఇప్పుడు అమ్మిన వ్యక్తి అఫి డవిట్‌ అవసరం లేదని, కొనుగోలుదారుడు మాత్రం అఫిడవిట్‌ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధన మా ర్చింది. దీంతో గతంలో అమ్మకందారు కూడా అఫిడవిట్‌ ఇవ్వాలన్న నిబంధనతో తిరస్కరించిన వాటితో సహా మొత్తం దరఖాస్తులను ఈసారి పున:పరిశీలిస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే కొంత ఆలస్యమవుతోందని తెలుస్తోంది.  

అన్నీ.. రీఓపెన్‌ 
వాస్తవానికి, ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్చిన నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను గత నెల మొదటి వారంలో రెవెన్యూ శాఖ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు సాదాబైనామాలను పరిష్కరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది. అయితే, గతంలో అమ్మిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్‌ లేని వాటితోపాటు కొన్ని దరఖాస్తులను సాంకేతిక కారణాలతో కూడా తిరస్కరించారు. కొన్ని ప్రభుత్వ భూములు ఉండడం, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడం లాంటి కారణాలతో ఈ దరఖాస్తులను తిరస్కరించారు. మార్గదర్శకాలు కొత్తగా వచ్చినా, ఇలాంటి దరఖాస్తులను మళ్లీ పరిశీలించాల్సిన అవసరం లేదు. కానీ, అన్ని దరఖాస్తులను పునఃపరిశీలన చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్నింటినీ రీఓపెన్‌ చేశామని తహసీల్దార్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత జాప్యం జరుగుతోందని అంటున్నారు. కాగా, ఇప్పటివరకు తుది నిర్ణయం కోసం కేవలం 20 శాతం లోపు దరఖాస్తులు మాత్రమే ఆర్డీఓలకు చేరినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే సాదాబైనామా దరఖాస్తుల పూర్తిస్థాయి పరిష్కారానికి 3, 4 నెలల సమయం పడుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement