‘క్లూ’ దొరికింది | Tanuja Ranjan wife of retired IPS officer Vinay Ranjan | Sakshi
Sakshi News home page

‘క్లూ’ దొరికింది

May 11 2026 8:18 AM | Updated on May 11 2026 8:18 AM

Tanuja Ranjan wife of retired IPS officer Vinay Ranjan

పుణెలో జూబ్లీహిల్స్‌ హత్య కేసు నిందితులు   

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌ నగర్‌లో విశ్రాంత ఐపీఎస్‌ వినయ్‌ రంజన్‌ భార్య తనూజ రంజన్‌ను పని మనిషితో పాటు మరో ముగ్గురు నేపాలీలు హత్య చేసి, నగదు, నగలతో ఉడాయించిన ఘటనపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నిందితులు పుణెలో ఉన్నట్లు సమాచారంతో గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హత్య జరిగిన రాత్రి నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్లి పుణెలో దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 పది పోలీసు బృందాలు అక్కడ జల్లెడ పడుతున్నాయి. కాగా.. నిందితురాలు కల్పన లక్నోలో పని చేస్తున్న సందర్భంలో కూడా నేరాలకు పాల్పడినట్లు.. పథకం ప్రకారం హైదరాబాద్‌కు వచ్చి సంపన్నుల ఇళ్లలో పని చేస్తూ వారి కదలికలను గమనిస్తూ అవకాశం రాగానే అందినకాడికి దండుకుంటున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. లక్నోలో కల్పన పని చేసిన ఇంట్లోనూ ఓ పోలీసు బృందం విచారణ చేపట్టింది. మూడు బృందాలు నేపాల్‌ సరిహద్దులో తిష్టవేశాయి. 

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కూడా మరో మూడు బృందాలు నిఘా పెట్టి నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత నిందితులు పుణె చేరుకోగా అక్కడ నుంచి ఎక్కడిడి ప్రయాణం కాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పుణె చుట్టూ బృందాలు నిఘా పెట్టాయి. వినయ్‌ రంజన్‌ ఇంట్లో ఈ గ్యాంగ్‌ 225 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. నగదు ఎంత చోరీ అయిందనేది ఇంకా లెక్క తేలలేదు. నేడో, రేపో నిందితులను పట్టుకునే దిశలో పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. నిందితుల వద్ద ఎలాంటి సెల్‌ఫోన్లు లేవని పోలీసులు గుర్తించారు. రెండు సెల్‌ఫోన్లు హైదరాబాద్‌లోనే పడేసిపోయినట్లు సమాచారం. నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనర్‌ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement