
ఎస్సీ గురుకుల సొసైటీలోడిగ్రీ లెక్చరర్లకు వింత కొర్రీ
పీహెచ్‌డీ లేదా డిపార్ట్‌మెంటల్ టెస్ట్ పాసవ్వాలని నిబంధన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో డిగ్రీ లెక్చరర్ల(డీఎల్స్)కు వేతన ప్రోత్సాహకాల విడుదలకు అధికారులు విచిత్ర నిబంధనలు తీసుకువచ్చారు. పదోన్నతి పొందేందుకు ఉండాల్సిన అర్హతలుంటేనే ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద ఇంక్రిమెంట్ ఇస్తామని తేల్చి చెప్పారు. ఈ నిబంధన కేవలం 2019 ఆగస్టులో నియమితులైన వారికి మాత్రమే వర్తింపజేస్తున్నట్లు పైఅధికారులు సమాచారం ఇవ్వడంతో వారినుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2017 జూలై నోటిఫికేషన్ ద్వారా నియమితులై 2019 మార్చిలో విధుల్లో చేరిన బ్యాచ్‌కు ఇంక్రిమెంట్లు విడుదల చేసిన సొసైటీ అధికారులు... 2018 ఆగస్టులో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఎంపికై 2019 ఆగస్టులో విధుల్లో చేరిన వారికి మాత్రం కొత్త నిబంధనలు వర్తింపచేయడం గమనార్హం.
గురుకుల విద్యా సంస్థల్లో డిగ్రీ లెక్చరర్లుగా ఎంపికైన వారిని నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్), స్లెట్(స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్) లేదా పీహెచ్‌డీల్లో ఏదేని ఒకటి అర్హత సాధించడంతో పాటు డిపార్ట్‌మెంటల్ టెస్ట్ తప్పకుండా పాసవ్వాలి. అలాంటి వారికి పోస్టుల లభ్యత ఆధారంగా పదోన్నతి ఇస్తారు. వీటిలో అర్హత లేనప్పుడు పదోన్నతికి అవకాశం ఉండదు. కానీ తాజాగా తీసుకొచ్చిన నిబంధనతో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేమని ప్రిన్స్‌పల్స్ చెబుతుండటంతో పలువురు డిగ్రీ లెక్చరర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
లిఖితపూర్వక ఆదేశాలు లేవు...
డిగ్రీ లెక్చరర్లకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు సంబంధించి కొత్త నిబంధనలతో కూడిన ఆదేశాలేవీ సొసైటీ కార్యాలయం నుంచి లిఖితపూర్వకంగా వెలువడలేదు. కేవలం రాష్ట్ర కార్యాలయంలోని ఓ అధికారి చెప్పిన మౌఖిక ఆదేశాలతో వీటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.