సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ @ 5.14 లక్షల మంది | State wide house listing blocks mapping | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ @ 5.14 లక్షల మంది

May 20 2026 4:11 AM | Updated on May 20 2026 4:11 AM

State wide house listing blocks mapping

రాష్ట్ర వ్యాప్తంగా వడివడిగా హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్స్‌ మ్యాపింగ్‌ 

గ్రామీణ ప్రాంతాల్లో హెచ్‌ఎల్‌బీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది 

పట్టణ ప్రాంతాల్లో కాస్త నెమ్మదించినా... రెండు రోజుల్లో పూర్తి చేస్తాం 

సెనెస్స్‌ నంబరింగ్, ఆన్‌లైన్‌ ఎంట్రీ ప్రక్రియ వేగవంతంగా చేపడతాం 

సెన్సెస్‌ విధుల్లో చేరని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం 

జనగణన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు 

‘సాక్షి’తో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెన్సెస్‌ విభాగం సంచాలకులు భారతి హోలికేరీ 

సాక్షి, హైదరాబాద్‌: జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టిన సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌కు రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెన్సెస్‌ విభాగం సంచాలకులు భారతి హోలికేరీ స్పష్టం చేశారు. తొలిరోజు సాంకేతిక కారణాలతో కాస్త ఇబ్బందులు ఎదురైనా, ఆ తర్వాత ఈ ప్రక్రియ సులభతరంగా జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.14 లక్షల మంది సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు. ఏప్రిల్‌ 26 నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ జరిగిందని, మే 11 నుంచి హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ (హెచ్‌ఎల్‌ఓ) ప్రక్రియ ప్రారంభమైందన్నారు. 

హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ (హెచ్‌ఎల్‌బీ) మ్యాపింగ్‌ ప్రక్రియపై చార్జ్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో హెచ్‌ఎల్‌ఓ ఆపరేషన్‌ ప్రక్రియ జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రధాన మున్సిపల్‌ కార్పొరేషన్లలోని కొన్నిచోట్ల ఆలస్యమైందన్నారు. రాష్ట్రంలో 79,200 హెచ్‌ఎల్‌బీలున్నాయని... తొలుత 75 వేల హెచ్‌ఎల్‌బీలుంటాయని అంచనా వేశామని, కానీ జనాభా పెరుగుదలతో ఈ సంఖ్య పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న హెచ్‌ఎల్‌ఓ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ‘సాక్షి’కి వివరించారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే... 

రెండు రోజుల్లో మ్యాపింగ్‌ పూర్తి... 
.సెన్సెస్‌ తొలివిడతలో భాగంగా హెచ్‌ఎల్‌ఓ ప్రక్రియలో హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ మ్యాపింగ్‌ కీలకం. ముందుగా మ్యాపింగ్‌ చేస్తేనే... ఆ తర్వాత డోర్‌ టు డోర్‌ సర్వే సులభతరమవుతుంది. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మ్యాపింగ్‌ కాగా, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో బ్లాక్‌ల ఎంపిక కాస్త ఆలస్యమైంది. దాదాపు 6 వేల బ్లాక్‌లు మినహాయిస్తే, ఇతర ప్రాంతమంతా దాదాపు పూర్తయింది. అక్కడ నంబరింగ్‌తోపాటు ఆన్‌లైన్‌ ఎంట్రీ కూడా ప్రారంభమైంది. 

అవగాహనే కీలకం... 
ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన వివరాలే కీలకం. ఇంటింటికి వెళ్లినప్పుడు ఎన్యుమరేటర్లు కూడా అవగాహన కల్పించి వారి నుంచి సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే అంతటా ఈ ప్రక్రియ సాఫీగా సాగుతోంది. ఈ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం. వ్యక్తిగత వివరాలు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందవు. సరైన వివరాలు ఇవ్వాలి. జనగణనకు వివరాలు సమర్పిస్తే సంక్షేమ పథకాల్లో ఇబ్బందులు కలుగుతాయనేది అపోహ మాత్రమే.  

బదిలీల నుంచి మినహాయింపు... 
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ సెన్సెస్‌ విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించాం. ఈ అంశంపై కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. నిర్ణీత గడువు ముగియడంతో తప్పనిసరి బదిలీల కేటగిరీల్లోని ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వొద్దని వినతులు అందుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.  

ఎన్యుమరేటర్లకు భద్రత... 
కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వెళ్లేందుకు ఎన్యుమరేటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫామ్‌హౌస్‌లు కూడా జనగణనలో భాగమే. వాటిల్లోకి వెళ్లేటప్పుడు ఎన్యుమరేటర్‌తోపాటు స్థానిక పంచాయతీ లేదా మున్సిపల్‌ సిబ్బందిని తోడుగా పంపిస్తున్నాం. ఇందుకు సంబంధించి ముందస్తుగా స్థానిక సంస్థల అధికారులకు సమాచారం ఇవ్వాలి. కొందరు సిబ్బంది సెన్సెస్‌ విధుల్లో రిపోర్టు చేయలేదనే సమాచారం ఉంది. రిజర్వ్‌లో ఉన్నా, తప్పకుండా విధుల్లో చేరాలి. లేకుంటే వారిపై సెన్సెస్‌ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. 

Advertisement
 
Advertisement
Advertisement