
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఒకనాడు కుగ్రామం.. నేడు మహానగరం. 1591 అక్టోబర్ 9న పునాదిరాయి పడ్డ ఈ గడ్డ ఇప్పుడు విశ్వనగరంగా రూపాంతరం చెందింది. ‘హే దేవుడా..! చేపలతో సరస్సును నింపినట్టుగా, నా నగరాన్ని ప్రజలతో నింపు’.. అని ప్రార్థించిన నగర నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్‌షా కలలు దాదాపుగా ఫలించాయి. కోటి మందికిపైగా ఉన్న మహానగరంగా ఖ్యాతికెక్కింది. చదువు పూర్తి చేసిన యువత.. ఉద్యోగ అన్వేషణలో వచ్చిన నిరుద్యోగి.. పొట్టచేత పట్టుకొని ఎవరొచ్చినా ప్రేమతో అక్కున చేర్చుకునే భాగ్యనగరిగా వర్ధిల్లుతోంది. సామాన్యులకు అనువైన నగరంగా విరాజిల్లుతోంది.
శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు ఆలవాలంగా నిలుస్తోంది. మూసీ, ఈసీ తెహజీబ్‌గా భిన్నసంస్కృతుల సమ్మిళితంగా ప్రసిద్ధికెక్కింది. మినీ భారత్‌గా పేరు పొందింది. ఒకసారి ఈ నేలపై అడుగుపెట్టిన వారెవరైనా, హైదరాబాద్‌పై మనసు పారేసుకోకుండా ఉండలేరనేది నిర్వివాదాంశం. 1591 వరకు చంచలం (చిన్న గ్రామం)గా ఉన్న ఈ ఊరు మహ్మద్ కులీ కుతుబ్‌షా ఆలోచనలు.. ఇరానీ ఆర్కిటెక్ట్ మీర్ మోమిన్ సృజన కారణంగా హైదరాబాద్‌గా అవతరించింది.
తొలి కట్టడం పురానాపూల్..
హైదరాబాద్ నగరంగా ఆవిర్భవించకముందే, ఈ నేలపై నిర్మితమైన తొలి కట్టడం పురానాపూల్ వంతెన. ఇది 1578లో దీన్ని నిర్మించారు. దక్షిణ భారతంలో తొలి వారధి కూడా ఇదే. భాగ్యనగర నిర్మాణం మాత్రం చార్మినార్ స్మారక చిహ్నంతో ప్రారంభమైందని.. మహ్మద్ కులీ చేతుల మీదుగా 1591 అక్టోబర్ 9న పునాది పడిందనడానికి కొన్ని చారిత్రక ఆధారాలున్నాయని దక్కన్ హెరిటెజ్ నిర్వాహకుడు సఫీవుల్లా చెప్పారు. అందుకు ఆనాటి ఒక ఫర్మానాలో పొందుపరిచిన విషయాలే రుజువులని ఆయన గుర్తు చేశారు. ఇస్లామియా హిజ్రీ కేలండర్ వెయ్యి ఏళ్లు పూర్తయిన వేళ ఖగోళ శాస్త్ర నిపుణులు అక్టోబరు తొమ్మిదిగా నగర అవతరణను లెక్కించినట్లు ఆయన చెబుతున్నారు. ఈ తేదీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న చరిత్ర అధ్యయనకారులూ లేకపోలేదు.
నయా పోకడలతో
వర్షాకాలంలో పాత నీరు పోయి కొత్త నీరు వచ్చి చేరినట్లు.. విశ్వస్థాయికి ఎదుగుతున్న భాగ్యనగరంలో పాతవి కనుమరుగవుతూ.. నయా పోకడలు, కొత్త పంథాలు జోష్ నింపుతున్నాయి. ఏళ్ల తరబడి అలవాటుగా మారిన కొన్ని సంస్కృతులకు దూరం కావాల్సి రావడం బాధనిపించినా.. అనివార్యంగా కొత్తవాటి వైపు మారక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించిన పురాతన కట్టడాలు.. శిథిలం పేరుతో నేలకూల్చక తప్పడం లేదు.హైదరాబాద్ అంటే ఒకప్పుడు మూసీ అవతల కేంద్రంగా పాతబస్తీ ఉండేది. మూసీ ఇవతల కొత్త నగరం విస్తరించి దినదినాభివృద్ధి చెందుతోంది. జయహో భాగ్యనగరం.