
అమీర్‌పేట: స్నేహితుడు డబ్బులు తీసుకుని మోసం చేయడంతో మనస్తాపానికి లోనైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగపూర్‌కు చెందిన శివాని, రుడాల్ప్ ఆంటోని (30) దంపతులు అమీర్‌పేట ధరమ్‌కరం రోడ్డులో నివాసముంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో భార్య కూడా ఉద్యోగం చేయాలని ఆంటోని భావించాడు. ఈ నేపథ్యంలో అతడి స్నేహితుడు విశాల్ శివానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతడికి రూ.4.50 లక్షలు ఇచ్చాడు.
అయితే అతను ఉద్యోగంఇప్పించకపోవడంతో ఆదివారం రాత్రి అల్వాల్‌లోని విశాల్ ఇంటికరి వెళ్లి గొడవ పడ్డాడు. రాత్రి ఇంటికి తిరిగి వచి్చన ఆంటోని కష్టపడి కూడబెట్టిన డబ్బు స్నేహితుడే కాజేశాడని భార్యకు చెప్పి బాధపడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శివాని స్నేహితుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆంటోనీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.