కలిసి పనిచేస్తేనే కరోనా నుంచి విముక్తి | Sakshi Interview with British Deputy High Commissioner Andrew Fleming | Sakshi
Sakshi News home page

కలిసి పనిచేస్తేనే కరోనా నుంచి విముక్తి

Aug 26 2020 5:44 AM | Updated on Aug 26 2020 5:44 AM

Sakshi Interview with British Deputy High Commissioner Andrew Fleming

సాక్షి, హైదరాబాద్‌: ఈ కరోనా సంక్షోభ సమయంలో ఏ దేశమూ ఒంటరిగా మనలేదని, అన్నిదేశాలూ కలసి పనిచేస్తేనే విపత్తు నుంచి బయటపడటం సాధ్యమని అంటున్నారు బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బ్రిటన్‌ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ, ఇరుదేశాల మధ్య సహకారం వంటి అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు..

సాక్షి: కరోనా కట్టడికి సిద్ధమవుతున్న వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా ముందు వరుసలో ఉంది. ఈ టీకా పేదలందరికీ చౌకగా అందేందుకు బ్రిటన్‌ ఏమైనా చర్యలు తీసుకుంటోందా? 
ఫ్లెమింగ్‌: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా తయారీ కోసం ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో వంద కోట్ల డోసుల టీకా తయారవ్వనుంది. ఇందులో 40 కోట్లు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వచ్చేలా బ్రిటన్‌ చర్యలు తీసుకుంది. ఆస్ట్రాజెనెకా ఈ టీకాలను పిల్లల కోసం ఉచితంగా అందివ్వనుంది. టీకా అభివృద్ధి కోసం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పెద్ద ఎత్తునే నిధులు సేకరించింది. టీకా పరిశోధనలు, అభివృద్ధి కోసం సుమారు రూ.7,434 కోట్లు సమీకరించింది. అంతేకాకుండా జూన్‌ 4వ తేదీన గావీ (గ్లోబల్‌వ్యాక్సిన్‌ అలయన్స్‌)తో కలసి సుమారు 700 కోట్ల పౌండ్లు కూడగట్టగలిగాం. ఈ నిధుల్లో కొంత భాగం కోవిడ్‌ పరీక్షలు, చికిత్స అందరికీ అందేలా చేసేందుకు ఉపయోగించనున్నాం.

కోవిడ్‌ సమయంలో యునైటెడ్‌ కింగ్‌డమ్, భారత్‌ల మధ్య సహకారం ఎలా ఉంది?
కోవిడ్‌ విజృంభణ మొదలైన మార్చి నుంచి బ్రిటన్‌–భారత్‌ పలు అంశాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి. వ్యాధుల నియంత్రణ విషయంలో బ్రిటన్‌కు ఎంతో అనుభవముంది. ఈ నైపుణ్యాన్ని భారత్‌తోనూ పంచుకుంటున్నాం. కోవిడ్‌ నిర్ధారణ కోసం కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సరికొత్త పరీక్ష పద్ధతిని అపోలో ఆసుపత్రి ద్వారా పరీక్షిస్తున్నాం. ‘బీహోల్డ్‌ ఏ.ఐ’అనే బ్రిటన్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ పద్ధతిలో కేవలం ఛాతీ ఎక్స్‌ రే సాయంతోనే కోవిడ్‌ ఉన్నదీ లేనిదీ 30 సెకన్లలో నిర్ధారించవచ్చు. అంతేకాదు.. కోవిడ్‌ వచ్చినప్పటి నుంచి బ్రిటన్‌ భారీ ఎత్తున పీపీఈ కిట్లు, ఫేస్‌ మాస్కులు, పారాసిటమాల్‌ మాత్రలు కొనుగోలు చేసింది. కోవిడ్‌ టీకా అభివృద్ధి, తయారీల్లో ప్రపంచానికి మందుల షాపు లాంటి భారత్‌ కీలకపాత్ర పోషించనుంది.

ఇటీవల కాలంలో బ్రిటన్‌ తెలుగు రాష్ట్రాల్లో పలు కొత్త కార్యక్రమాలు చేపట్టింది. వాటి గురించి వివరిస్తారా?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనంగా ఇటీవల మొదలైన 108 అంబులెన్స్‌ సర్వీస్‌లో బ్రిటన్‌ కీలకమైన సాంకేతిక పరిజ్ఞాన సాయం అందిస్తోంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడుతోంది. అంతేకాకుండా విశాఖపట్నంలోని మెడ్‌టెక్‌ జోన్‌లో వైద్య పరికరాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం స్టార్టప్‌లతో కలసి పనిచేస్తున్నాం. మధుమేహంతోపాటు ఇతర వ్యాధులకు సంబంధించిన పరికరాలను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది. అత్యంత ప్రయోజనకరమైన పది స్టార్టప్‌లను గుర్తించి ప్రోత్సహిస్తాం. తెలంగాణలోనూ మెడ్‌టెక్‌ జోన్‌ అంశంపై మా ప్రభుత్వం సాయం అందిస్తోంది. 

యూకే.. ఈయూ నుంచి వచ్చే ఏడాది వైదొలగనుంది. దీనివల్ల భారతీయులకు ఎంత మేరకు లాభం చేకూరుతుంది?
భారత్‌తోపాటు పలు ఇతర దేశాల వారికీ అవకాశాలు పెరుగుతాయి. ఈయూ నుంచి విడిపోవడం వల్ల ఆయా దేశాల నుంచి ఉద్యోగులను తీసుకోవాలన్న పరిమితి తొలగిపోతుంది. ఫలి తంగా యూకేలోని ఉద్యోగాల కోసం అందరూ పోటీ పడవచ్చు. దీంతో భారతీయులకూ ఎక్కు వ అవకాశాలు వస్తాయి. ఇందుకు అనుగుణం గానే ఎక్కువ వీసాల జారీకి ప్రయత్నిస్తున్నాం. 

కోవిడ్‌ ఈ ప్రపంచానికి నేర్పిన పాఠాలేంటని.. మీరు అనుకుంటున్నారు?
అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు అన్నది. అన్ని దేశాలకూ ఇది వర్తిస్తుంది. కోవిడ్‌ సమయంలో బ్రిటన్‌ చాలా దేశాలతో కొత్త సంబంధాలు ఏర్పరచుకుంది. వ్యాధికి సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకుంది. ఇరుదేశాలకూ లాభం చేకూరేలా ఈ సహకారం కొనసాగింది. కొనసాగుతోంది కూడా. అంతెందుకు శతాబ్దాల అనుబంధం ఉన్న భారత్‌తోనూ బ్రిటన్‌ సంబంధాలు కొత్త పుంతలు తొక్కిందంటే అతిశయోక్తి కాదు. ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నాం.

అమెరికా హెచ్‌–1బీ వీసాలపై పలు ఆంక్షలు విధిస్తోంది. టాలెంట్‌ను ఆకట్టుకునేందుకు ఇది మంచి అవకాశంగా బ్రిటన్‌ భావిస్తోందా?
నైపుణ్యమున్న అన్ని రంగాల వారూ బ్రిట న్‌కు అవసరమే. వివిధ రంగాల్లో అత్యున్నత నైపుణ్యమున్న వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్‌ అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఆరోగ్య రంగంలో పనిచేసే వారు బ్రిటన్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌తో కలసి పని చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. దీన్ని ఇప్పటికే పలువురు వైద్యులు ఉపయోగించుకున్నారు కూడా. వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు ఇక్కడ గడించిన జ్ఞానం స్వదేశాల్లోనూ ఉపయోగడుతుందన్నమాట. అలాగే గ్రాడ్యుయేషన్‌ కోసం బ్రిటన్‌కు వచ్చే వారికి చదువులైపోయిన తర్వాత ఇంకో రెండేళ్లపాటు కొనసాగేందుకు ఇటీవలే వీలు కల్పించారు. పీహెచ్‌డీ విషయంలో ఈ పరిమితి మూడేళ్ల వరకు ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement