సిబ్బందిని తుపాకులతో బెదిరిస్తున్న ముఠా సభ్యులు
జ్యువెలరీస్‌లో దోపిడీ..సిబ్బందిపై కాల్పులు
రూ.2 కోట్లకు పైగా విలువైన కేజీన్నర బంగారం చోరీ
కాల్పుల్లో నలుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం.. కరీంనగర్ పట్టణంలో కలకలం..
బండి సంజయ్ ఆఫీసుకు సమీపంలోనే ఘటన
దోపిడీ దొంగలు మహారాష్ట్రకు చెందిన పాత నేరస్తులుగా గుర్తింపు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆదివారం ఉదయం ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పుల మోతతో కలకలం రేగింది. జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీస్‌లో బంగారం, ఆభరణాలు దోచుకున్న దొంగలు..అడ్డువచ్చిన సిబ్బందిపై తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఇందులో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూ.2 కోట్లకు పైగా విలువైన కిలోన్నర బంగారం దొంగలు దోచుకున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..ఉదయం 11.06 గంటల ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు పీఎంజే జ్యువెలరీ షాపు వద్దకు వచ్చారు. తొలుత లోపలికి వచ్చిన ఒక వ్యక్తి 20 గ్రాముల గొలుసులు చూపించాలని అడిగాడు. ఆ వెంటనే మరో ఇద్దరు వచ్చి నగలు చూపాలని అడిగారు. వీరిద్దరిపై సేల్స్‌మాన్‌కు అనుమానం వచ్చి ఇన్‌చార్జికి చెప్పడంతో అతను నగలు చూపిస్తున్నాడు. ఆ సమయంలో ఇంకో ఇద్దరు ద్వారం వద్దే నిలబడ్డారు. ఈ క్రమంలో లోపల ఉన్న ముగ్గురూ తుపాకులు బయటకు తీసి తెలుగు, హిందీ భాషల్లో అరుస్తూ.. నగలు, బంగారం బయటికి తీయాలని బెదిరించారు. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు కట్టేశారు. తలలకు తుపాకులు గురిపెట్టారు. వీరిలో ఇద్దరు బంగారం, నగలు సర్దారు.
సిబ్బంది ప్రతిఘటనతో..
ఈ క్రమంలో అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న ముస్తాక్ దొంగలపై తిరగబడ్డాడు. మధుకర్, రాజేశ్, కమలాసన్ అనే సిబ్బంది కూడా ధైర్యం కూడగట్టుకుని ఎదురుతిరిగారు. దీంతో దుండగులు ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేశారు. ముస్తాక్‌కు బుల్లెట్ తలను రాసుకుంటూ దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడే కుప్పకూలాడు. మధుకర్‌కు బుల్లెట్ పేగుల వరకు వెళ్లింది. రాజేశ్‌కు కుడి భుజం, కమలాసన్‌కు ఎడమ భుజానికి తూటా గాయాలయ్యాయి. వీరిలో ముస్తాక్, మధుకర్ పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరుపుతూనే దొంగలు 11.11 గంటల కల్లా తాము వచ్చిన అపాచీ (తెలుపు), పల్సర్ (నలుపు) బండ్ల మీద శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, చింతకుంట మీదుగా సిరిసిల్ల వైపు పరారయ్యారు.
మొత్తం దొంగతనం కేవలం 5 నిమిషాల్లోనే ముగియడం విశేషం. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పలు బుల్లెట్ షెల్స్, ఒక మేగ్జిన్‌ను స్వాదీనం చేసుకున్నారు. దొంగల రాకపోకలకు సంబంధించి సీసీ టీవీల ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. ఘటనా స్థలం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. కాగా విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ వచ్చి పరిశీలించారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ శ్రీనివాస్‌లు కూడా ఘటనా స్థలానికి వచ్చారు.
ఉగ్ర శిక్షణ పొందారా?
పీఎంజే జ్యువెలరీస్‌లో క్లూస్ టీం పలు కీలక ఆధారాలు సేకరించింది. ఐదుగురు దుండగులలో కేవలం ఒకరు మాత్రమే మాస్కు వేసుకున్నారు. మిగిలిన నలుగురి ఫొటోలు సేకరించిన పోలీసులు వారిని మహారాష్ట్రకు చెందిన ఓ వర్గానికి చెందిన పాత నేరస్తుల ముఠాగా గుర్తించినట్లు సమాచారం. నిందితులంతా విదేశీ తుపాకులు వినియోగించడం, సిబ్బందిని మోకాళ్ల మీద కూర్చోబెట్టడం, తాళ్లతో కట్టేయడం చూస్తుంటే.. ఉగ్రశిక్షణ ఏమైనా పొందారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పక్కనే బండి సంజయ్ ఆఫీసు సమీపంలో ఉండటంతో ఐబీ కూడా ఘటనపై ఆరా తీస్తోంది. ఘటనా స్థలాన్ని సీపీ గౌస్ ఆలం, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను పరామర్శించారు.
నిందితుల ఫొటోలు విడుదల
నలుగురు నిందితుల ఫొటోలను పోలీసు శాఖ విడుదల చేసింది. వీరి ఆచూకీ తెలిసినట్లయితే డయల్ 100, 87126 70744, 87126 70745 నంబర్లకు తెలియజేయాలని కోరింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీపీ గౌస్ ఆలం చెప్పారు.


