మారకుంటే మరుభూమే!

Recent Research Suggests That We May Be Living As Aliens On Our planet - Sakshi

ఇంట్లోంచి బయటికెళ్లాలంటే ఒంటి నిండా సూట్‌.. అదీ ఎయిర్‌ కూల్‌ది. చిన్నవాగుల్లా మారిపోయిన పెద్ద నదులు.. మామూలు పొలాలన్నీ మాయం.. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే పంటల సాగు.. వాటికి డ్రోన్లతో నీటి సరఫరా.. ఇదంతా ఆదిత్య 369 చిత్రంలో ‘సింగీతం’ చూపించిన భవిష్యత్‌ ఊహాలోకం. ఆ సినిమాలోనే కాదు.. నిజంగానే మన భవిష్యత్‌ అలా ఉండబోతోందని.. మన భూమి మీద మనమే గ్రహాంతర వాసుల్లా జీవించాల్సి వస్తుందని తాజా పరిశోధన చెబుతోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..                                                            
–సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

‘2100’ అంచనాలు చాలవు!
ఓవైపు అడవుల నరికివేత.. మరోవైపు కాలుష్యం.. పెరిగిపోతున్న కాంక్రీట్‌ నిర్మాణాలు.. అన్నీ కలగలిసి రోజురోజుకూ వాతావరణం మారిపోతోంది. భూమి వేడెక్కి (గ్లోబల్‌ వార్మింగ్‌).. ఓవైపు తీవ్ర కరువు కాటకాలు, మరోవైపు వరదలు, తుపానులు అల్లకల్లోలం చేస్తున్నాయి. అడవుల నరికివేత ఆపడం, మరింతగా అడవులు పెంచడం, భూమి వేడెక్కేందుకు కారణమయ్యే గ్రీన్‌హౌజ్‌ వాయువుల (కర్బన ఉద్గారాల)ను తగ్గించడమే దీనికి పరిష్కారం. ఈ దిశగానే పారిస్‌లో జరిగిన ‘ఐపీసీసీ (ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌)’ సదస్సు ఇటీవల పలు లక్ష్యాలను నిర్దేశించుకుంది.

2100వ సంవత్సరం నాటికి భూమి ఉష్ణోగ్రతలో పెరుగుదలను గరిష్టంగా 2 డిగ్రీలకు పరిమితం చేయాలని అన్నిదేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. కానీ ఈ లక్ష్యాలు సరిపోవని.. భూమిపై జీవనం ప్రమాదంలో పడుతుందని ‘యూఎన్‌ ఎన్‌డీసీ (యునైటెడ్‌ నేషన్స్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ డెటర్మైన్డ్‌ కంట్రిబ్యూషన్స్‌)’ నివేదిక స్పష్టం చేస్తోంది. 

గ్రహాంతర వాసుల్లా బతకాల్సిందే..
2500 సంవత్సరం నాటికి మన భూమే మనం ఊహించనంతగా మారిపోతుందని.. మనమే గ్రహాంతర వాసుల్లా బతికే పరిస్థితి వస్తుందని పర్యావరణ సామాజిక శాస్త్రవేత్త క్రిస్టోఫర్‌ లియోన్, ఆయన సహ పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం చల్లగా ఉండే శీతల ప్రాంతాలు వేడెక్కి ఉష్ణమండల ప్రాంతాల్లా మారిపోతాయని.. ఇప్పుడున్న ఉష్ణమండల ప్రాంతాలు మనుషులు జీవించలేని దుర్భర వేడి ప్రాంతాలుగా మారుతాయని స్పష్టం చేశారు. భూమ్మీద వివిధ ప్రాంతాలకు సంబంధించి ఐదు వందల ఏళ్ల కిందటి పరిస్థితులు, ప్రస్తుతమున్న తీరు, 2500 నాటికి పరిస్థితులను చిత్రాలతో సహా వివరించారు. 

భవిష్యత్తు అత్యంత ప్రమాదకరం
వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌పై జరుగుతున్న పరిశోధనలు, లక్ష్యాలన్నీ కూడా 2100 సంవత్సరాన్నే అంచనాలకు ఆధారం (బెంచ్‌ మార్క్‌)గా తీసుకుంటున్నాయని యూఎన్‌ ఎన్‌డీసీ పేర్కొంది. ప్రపంచ దేశాలు ‘ప్యారిస్‌ ఐపీసీసీ’ ఒప్పందాన్ని అమలు చేసినా.. ప్రయోజనం తక్కువేనని స్పష్టం చేసింది. భూమి సగటు ఉష్ణోగ్రత 2100 నాటికే 2.2 డిగ్రీల మేర పెరిగితే.. అది 2500వ సంవత్సరం నాటికి 4.6 డిగ్రీలకు చేరుతుందని పేర్కొంది.

ఇది భూవాతావరణంలో, వృక్ష, జంతుజాలంలో అత్యంత తీవ్రస్థాయిలో మార్పులకు దారితీస్తుందని వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు, కరువులు, కార్చిచ్చులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు కమ్ముకుంటాయని హెచ్చరించింది. అందువల్ల మన భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని.. 2500వ సంవత్సరాన్ని మన లక్ష్యాలు, అంచనాలకు ఆధారంగా తీసుకోవాలని సూచించింది.

ఇవి చూసైనా మారుతారని..: ఐదు శతాబ్దాల తర్వాతి పరిస్థితిని ఇలా చూసి అయినా గ్లోబల్‌ వార్మింగ్, కర్బన ఉద్గారాల నియంత్రణ విషయంగా ప్రభుత్వాలు, ప్రజల్లో మార్పు వస్తుందేమో అన్నదే ఈ చిత్రాల ముఖ్య ఉద్దేశమట. 

భారత్‌లో చండ్ర నిప్పులే.. 
ఇక్కడున్న చిత్రాల్లో మొదటిది ఐదు శతాబ్దాల కిందటి భారతదేశంలో పరిస్థితిని చూపుతోంది. గ్రామాల్లో వ్యవసాయం, వరి పంట, పశువుల వినియోగం, జీవావరణం కలిసి ఉన్న దృశ్యమిది.
రెండో చిత్రం ప్రస్తుత కాలానిది. అడవులు తగ్గిపోయి.. సాగులో సంప్రదాయ, ఆధునిక మౌలిక సదుపాయాల కలబోతగా ఉన్నది.
మూడోది భవిష్యత్‌ (2500 ఏడాది)ను చూపుతోంది. పచ్చదనం తగ్గిపోయి.. ఉష్ణోగ్రతలు, ఎండలు విపరీతంగా పెరిగి.. శరీరాన్ని పూర్తిగా కప్పేస్తున్న సూట్‌లో బయటికి రావాల్సిన పరిస్థితి. పెరిగిన సాంకేతికతతో రోబోటిక్‌ వ్యవసాయం చేస్తారని అంచనా.

అమెజాన్‌ నది.. చిన్న వాగులా..
ఈ చిత్రం అమెజాన్‌ నది, దానివెంట ఉన్న భారీ అడవిని చూపుతోంది. ఐదు శతాబ్దాల కింద పూర్తిగా పచ్చదనంతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. 
అక్కడ ప్రస్తుతమున్న పరిస్థితి చూపుతున్నది రెండో చిత్రం. అభివృద్ధి పేరిట వేసిన రోడ్లు, ఇతర నిర్మాణాలతో తగ్గిపోయిన పచ్చదనం కనిపిస్తోంది.
మూడో చిత్రం భవిష్యత్తు భయానక దుస్థితిని చూపుతోంది. ప్రపంచంలోనే పెద్దదైన అమెజాన్‌ నది చిన్నవాగులా మారిపోవడం, అంత దట్టమైన అడవి నామరూపాల్లేకుండా పోవడం, పంటలు కూడా లేకుండా నిర్జీవంగా మారిన దుస్థితి కనిపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top