
సాక్షి, హైదరాబాద్ : ఫేస్‌బుక్‌లో అభ్యంతకర పోస్టులు పెడుతున్న ఇతర రాజకీయ పార్టీల అకౌంట్లను కూడా బ్యాన్ చేయాలని గోషామహాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా డిమాండ్ చేశారు. అభ్యంతరకర పోస్టులు ఉన్నాయంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ అకౌంట్‌ను ఫేస్‌బుక్ నిషేధించిన విషయం తెలిసిందే. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఫేస్‌బుక్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పలుమార్లు నీచంగా అభ్యంతరకర పోస్టులు పెట్టారని, ఆయన అకౌంట్‌ను ఎందుకు బ్యాన్ చేయలేదని సూటిగా ప్రశ్నించారు. (ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్‌బుక్ నిషేధం)
మజ్లిస్ పార్టీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో కూడా ప్రజలకు విరుద్ధంగా అభ్యంతరకర పోస్టులు ఉన్నా ఎందుకు బ్యాన్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫేస్‌బుక్ అకౌంట్లను చూస్తే ఘోరాతి ఘోరంగా ఉంటాయన్నారు. అలాగే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల అభ్యంతరకర పోస్టులపై వారి అకౌంట్లను బ్యాన్ చేయాలని ఫేస్‌బుక్ అధికారులకు తాను ఈ మెయిల్ చేసినట్లు పేర్కొన్నారు. (నాకు ఎవరి నుంచి ప్రాణ హాని ఉందో చెప్పాలి!)
గత ఏడాది నుంచి తన ఫేస్‌బుక్ అకౌంట్ పేజీలను ఉపయోగించడం లేదని, తనకు సంబంధం లేని వారు క్రియేట్ చేసి వాడుతున్నారని రాజాసింగ్ లోధా ఆరోపించారు. తన పేరుపై గుర్తు తెలియని వారు ఫేస్‌బుక్ పేజీలను వాడితే తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని బిజెపితో అనుసంధానం చేయడం సరైంది కాదని అన్నారు. తను కొత్త అకౌంట్ కోసం ఫేస్‌బుక్‌కు లేఖ రాస్తానని, అన్ని నిబంధనలను పాటిస్తానని హామీ ఇచ్చానని చెప్పారు.