మావోయిజం ఇంకా బతికే ఉంది.. అనారోగ్యంతోనే బయటకు వచ్చా
45 ఏళ్ల ఉద్యమంలో కొంత సాధించానన్న తృప్తి ఉంది
పార్టీ మనుగడ కోసం డబ్బు వసూలు నిజమే
‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న
సాక్షి, హైదరాబాద్ : అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు ఇచ్చేందుకే ఆపరేషన్ కగార్ అని ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న అలియాస్ శంకరన్న అన్నారు. కాలంతోపాటు మారకపోవడమే మావోయిస్టు పార్టీకి భారీ నష్టం చేసిందని చెప్పారు.
అయితే సమాజంలో తారతమ్యాలు పోనంత వరకు ప్రజల్లో మావోయిస్టు భావజాలం బతికే ఉంటుందని స్పష్టం చేశారు. 45 ఏళ్ల ఉద్యమ జీవితంలో పీడిత ప్రజల కోసం పనిచేశానన్న తృప్తి ఉందన్నారు. డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఎదుట ఇటీవల లొంగిపోయిన చంద్రన్న ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
రీమౌల్డ్ చేయలేకపోయాం
మావోయిస్టు పార్టీ కేవలం కొన్ని సమస్యలకు, అటవీ ప్రాంతానికే పరిమితమైంది. పట్టణ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో పార్టీ విస్తరణ చేయలేదు. గతంలో మేధావులు, చదువుకున్నవారు చేరేవారు..క్రమంగా వారు పార్టీలోకి రావడం తగ్గింది. అటవీ ప్రాంతంలోనూ నిరక్షరాస్యులే పార్టీలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి రిక్రూట్‌మెంట్ చాలా తగ్గింది.
అగ్ర నాయకత్వం మధ్య సమన్వయం దెబ్బతిన్నదినంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీ అగ్ర నాయకత్వంలోని వారి మధ్య విబేధాలు బహిర్గతమ య్యాయి. కగార్ దాడి పెరిగిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ (సెంట్రల్ కమిటీ) మెంబర్లు, పొలిట్ బ్యూరో సభ్యుల వంటి కీలక నాయకులు ఒక్క దగ్గరకు చేరే అవకాశాలు లేకుండా పోయాయి. మరోవైపు కోవర్టుల బెడద పెరగడంతోనూ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. బయట ప్రచారంలో ఉన్నట్టుగా అక్కడ కుల వివక్షకు తావులేదు.
మా దినచర్య ఇలా...
ఉద్యమ జీవితంలో అడవిలో ఉదయం 4 గంటలకు మా దైనందిన జీవితం మొదలయ్యేది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తాం. అంతా ఓకే అనుకున్నాక ఉదయం 6 గంటలకు రోల్‌కాల్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతిరోజు వ్యాయామం. 8 గంటలకు కిచిడీ, చింతపులుసుతో టిఫిన్. ఆ తర్వాత పేపర్లలో వార్తలు, ఇతర అంశాలపై సమష్టిగా చదవడం..మధ్యాహ్నం 12 గంటలకే భోజనం. తర్వాత రెస్ట్. 2 గంటల నుంచి కాసేపు ఏదో ఒక అంశంపై వ్యక్తిగతంగా చదవడం ఉంటుంది.
సాయంత్రం 5 గంటలకే రాత్రి భోజనం..ఆరు గంటలకు గప్‌చుప్ అయిపోవాలి. ఒకవేళ శత్రువు అలికిడి ఉండే ఆ రోజు వంట బంద్. పొయ్యి పెడితే పొగతో మా జాడ తెలుస్తుంది. డ్రోన్లు తిరుగుతున్నట్టు అనుమానం ఉంటే వంట బంద్ పెట్టి, మూమెంట్ లేకుండా అలర్ట్‌గా ఉంటాం. పరిస్థితి సరిగా ఉంటే అర్ధరాత్రి తర్వాతే వండుకుంటాం. ప్రతి సీసీ సభ్యుడికి ఏడు నుంచి పది మంది వ్యక్తిగత భద్రత ఉంటుంది.
రూ.వందల కోట్ల డంప్‌లు.. కిలోల కొద్దీ బంగారం శుద్ధ అబద్ధం
పార్టీ ఖర్చుల కోసం స్థానికుల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు.. తునికాకు, ఇతర కాంట్రాక్టర్ల నుంచి పర్సెంటేజీల రూపంలో ఫండ్ వసూలు చేయడం వాస్తవమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రాబడి కూడా లేదు. అయితే, మావోయిస్టుల దగ్గర రూ.వందల కోట్ల డంప్ లు, కిలోల కొద్ది బంగారం నిల్వలు ఉన్నాయన్న వార్తలు శుద్ధ అబ ద్దం. నేను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీగా 17 ఏళ్లు పనిచేశాను. నా భార్య ఇప్పటికీ చిన్న గుడిసెలో ఉంటోంది. ఈ మధ్యే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని నాకు తెలిసింది.
నా దగ్గరే రూ. వందల కోట్లు ఉంటే మా వారు బిల్డింగ్‌లు కట్టాలి కదా..పార్టీ నడపడానికి కొంత మొత్తంలో డబ్బులు ఉంటాయి కానీ.. వందల కోట్లు లేవు. నేను ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత కేవలం 1990లో ఒకసారి వచ్చి కుటుంబాన్ని కలిసి వెళ్లాను. మళ్లీ ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదు. అయితే, కుటుంబాన్ని కలిసేందుకు రెండు, మూడేళ్లకు ఒకసారి పరిస్థితిని బట్టి పర్మిషన్ ఇస్తారు. ఆ టైంలో వెళ్లి రావొచ్చు. అయితే అది అందరికీ సాధ్యం కాదు.
ఆరోగ్యం బాగయ్యాక భవిష్యత్ ప్రణాళిక
నేను ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా. ఆ తర్వాత బయటి పరిస్థితులను తెలుసుకుంటా. సమాజాన్ని అర్థం చేసుకొని, సమ స్యలపై నా పోరాటం నిర్ణయించుకుంటా. ఏ రాజకీయ పార్టీలో నే ను చేరను. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనను. ప్రజాసంఘాల్లో పనిచేస్తా. కుటుంబంతో కలిసి ఉంటా. బయటకు వచ్చిన తర్వాత కూ డా మావోయిస్టు పార్టీ నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొనక తప్పదు.


