
గద్వాల జిల్లా గట్టు మండలంలో కొత్తగూడెం జిల్లా యువతి ఆత్మహత్య
కానిస్టేబుల్ రఘునాథ్‌గౌడ్‌తో ప్రేమ
పెళ్లికి నిరాకరించడంతో రెండు నెలలుగా యువకుడి ఇంట్లోనే మకాం
గుళికల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
గద్వాల జిల్లా: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అందరి నీ ఎదిరించింది. పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకు వచ్చింది. రెండు నెలలుగా ఆ యువకుడి ఇంట్లోనే మకాం వేసింది. చివరికి విషపు గుళికలను తీసుకొని తనువు చాలించింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక (32), జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామా నికి చెందిన రఘునాథ్‌గౌడ్‌ను ప్రేమించింది. హైదరాబాద్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అనంతరం రఘునాథ్‌గౌడ్‌కు కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో రెండు నెలల కిందట తనను పెళ్లి చేసుకోవాలని ప్రియాంక చిన్నోనిపల్లె గ్రామానికి వచ్చి రఘునాథ్‌గౌడ్‌ను కోరింది.
అయితే రఘునాథ్ గౌడ్, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకువచ్చింది. ఆమె వారి ఇంట్లోనే మకాం వేయడంతో రఘునాథ్‌గౌడ్, అతని కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కాగా, అప్పట్లోనే ప్రియాంక నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా గ్రామస్తులు ఆమెను వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణా పాయం తప్పింది. అనంతరం ప్రియాంక రఘునా థ్‌గౌడ్‌తోపాటు కుటుంబ సభ్యులపై గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జూలైలో కేసు నమోదు చేశారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా సెక్షన్ మార్పు చేసి, రఘునాథ్‌ను రిమాండ్‌కు తరలించగా ఇటీవలే బెయిల్‌పై విడుదల అయ్యాడు.
మరోసారి ఆత్మహత్యాయత్నం..
ఈ క్రమంలో ప్రియాంక శుక్రవారం గుళికల మందు తీసుకున్నట్లు పోలీసు లకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహు టిన చిన్నోనిపల్లె గ్రామానికి చేరుకొని చికిత్స నిమిత్తం ఆమెను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆమె మృతిచెందింది. ఇదిలా ఉండగా రఘునాథ్‌గౌడ్, అతని కుటుంబ సభ్యులు తమ కూతురుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపినట్లుగా ఆమె తల్లి దండ్రులు ఆస్పత్రి వద్ద ఆరోపించారు. రఘునాథ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై ప్రియాంక తల్లి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. కాగా, ప్రియాంక మృతికి కారణమైన రఘు నాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ప్రియాంక ఆత్మహత్య ఘటనకు సంబంధించి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లేశ్ వెల్లడించారు. మరో పక్క దళిత యువతి మృతికి కారణమైన రఘునాథ్‌గౌడ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా, కుల సంఘాల నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు.