కొత్తగా 22ఏ లో పెట్టలేదు.. అవి ఎప్పటి నుంచో ఉన్నవే | Ponguleti Srinivas Reddy Assurance To Telangana Public On 22A Prohibited Lands | Sakshi
Sakshi News home page

కొత్తగా 22ఏ లో పెట్టలేదు.. అవి ఎప్పటి నుంచో ఉన్నవే

Sep 2 2026 5:55 AM | Updated on Sep 2 2026 5:55 AM

Ponguleti Srinivas Reddy Assurance To Telangana Public On 22A Prohibited Lands

ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమే: మంత్రి పొంగులేటి  

సాక్షి, హైదరాబాద్‌: నిషేధ భూముల జాబితా తాజా­గా తయారు చేసిందేమీ కాదని.. ముందు నుంచీ ఉన్నవేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. 22ఏలో ఉన్న భూములు ఎప్పటి నుంచి ఉన్నాయి.? గత ప్రభుత్వ హయాంలో ఉన్న నిషేధ జాబితాలోని భూములు, ప్రస్తుతం ఉన్న భూముల వివరాలన్నీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వెల్లడి­స్తామని పొంగులేటి చెప్పారు. కోటి ఎకరాలు నిషేధ జాబితాలో పెట్టారంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కోటి ఎకరాల్లో అటవీ, ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, భూదాన్‌ భూములతోపాటు, ప్రభు­త్వం సేకరించిన భూములు క్రయ విక్రయాలు చేయకుండా నిషేధ జాబి­తా­లో ఉంటాయన్నారు. 

ప్రైవేట్‌ వ్యక్తుల పట్టా భూములు నిషేధ జాబితాలో ఉండవని చెప్పారు. 22ఏ లో ఉండే భూములను కొందరు సబ్‌ రిజిస్ట్రార్‌లు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతో ఈమధ్య ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌లు సస్పెండ్‌ కాగా... మరో ఇద్దరు ఏసీబీకి చిక్కారని, దీంతోనే 22ఏ భూముల రిజిస్ట్రేష­న్లు చేయకుండా ఆపారని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి సచివాలయంలోని తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 22ఏ వివాదం సద్దుమణిగిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఏదో ఆరోపణలు చేస్తున్నట్టు..ఏదో ఆశించి భూములను నిషేధ జాబితాలో పెట్టి.. తర్వాత తొలగించి ఉంటే.. ఒక్కటైనా అలాంటి అంశాలను బహిర్గతం చేయాలి కదా అని ఆయన ప్రశ్నించారు. 

10 వరకు సర్వేయర్లకు అవకాశం..
దాదాపు ఆరువేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను తీసుకుంటే.. అందులో కేవ­లం 1,300 మంది మాత్రమే రెగ్యులర్‌గా సర్వే కార్యక్రమాల్లో పాల్గొంటున్నా­రని, మిగిలిన వారు సర్వేలో పాల్గొనడం లేదని మంత్రి పొంగులేటి చెప్పారు. వారికి వేతనాలు ఇస్తామని ఎక్కడా చేప్పలేదని, సర్వే సమయంలో వారు చేసే సర్వే ఆధారంగా ఎకరాకు రూ.60 ఫీజు నిర్ణయించినట్టు చెప్పారు. అంతేకానీ లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, ప్రతిపక్షం చేస్తున్న దుష్ఫ్రచారం చేస్తున్నట్టు వేతనాల అంశం సరికాదన్నారు. ఈనెల 10వ తేదీలోగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు వారికి కేటా­యించిన ప్రాంతాల్లో పనిచేస్తే మంచిదని, లేని పక్షంలో వారి లైసెన్స్‌లను రద్దు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల కోసం హైదరాబాద్‌లో రూ.10 వేలు చెల్లించిన వారిలో డ్రాలో ఇళ్లు రాకపోతే..వారి డబ్బును తిరిగి ఇస్తామన్నారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని మంత్రి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement