
పోలీసులపై రాజకీయ నేతల ఒత్తిళ్లు
లైసెన్స్ లేదని బండి ఆపినా ఫోన్లు
కింది స్థాయి ఉద్యోగులు నిరాకరిస్తే ఆపై స్థాయిలో పైరవీలు
ఏం చేయాలో పాలుపోక ఉద్యోగులకు తలనొప్పి
ఖమ్మంక్రైం: ఖమ్మం బైపాస్‌రోడ్డులో ఓ ఎస్‌ఐ స్థాయి అధికారి ఇటీవల వాహన తనిఖీలు చేపడుతున్నారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తుండగా ఆపి పరిశీలించగా లైసెన్స్, ఆర్‌సీ లేదని.. అసలు వాహనమే తమది కాదని బదులిచ్చారు. దీంతో ఆ ఎస్‌ఐ వాహనాన్ని పక్కన పెట్టించారు. అయితే, యువకులు ఎవరికో ఫోన్ చేయగా.. కొద్దిసేపటికే అధికార పార్టీ కార్పొరేటర్ నుంచి ఎస్‌ఐకి ఫోన్ వచ్చింది. ‘ఆ ముగ్గురు మా వాళ్లే వదిలేయ్’ అని సూచిస్తే ఎస్సై లైసెన్స్ లేదని చెబుతున్నా వినకుండా పై అధికారితో మాట్లాడుతానంటూ ఫోన్ కట్ చేశాడు.
అనుకున్నట్టుగానే పై అధికారి నుంచి ఎస్సైకి ఫోన్ రావడంతో ఆ ముగ్గురిని వదిలేయగా ఒకే బండిపై ట్రిపుల్ రైడింగ్‌గా పోలీసుల ముందే కాలర్ ఎగురవేసుకుంటూ వెళ్లిపోయారు. అదే సమయాన ఎలాంటి పైరవీలు లేని కొందరు వాహనదారులు జరిమానా చెల్లించి వెళ్లారు. దీంతో సామాన్యులకు ఓ న్యాయం, పైరవీలు ఉంటే ఇంకో తీరేంటని నిట్టూర్చారు అక్కడున్నవారు. ఈ ఘటన ఒకటే కాదు.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని నాలుగు పోలీస్‌స్టేషన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిత్యం జరుగుతున్న తంతే ఇది.
చిన్న పాముకూ పెద్ద కర్రే
నిబంధనలకు విరుద్ధంగా డీజే పెట్టి నృత్యాలు చేసే వారిపై ఫిర్యాదు అందితే పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలిస్తారు. ఆ వెంటనే ఓ రాజకీయ నాయకుడు వచ్చి కీలక ప్రజాప్రతినిధికి దగ్గరి మనిషినంటూ డీజే వాహనం, నిర్వాహకులను తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. వాహనం బయటకు వెళ్లగానే మళ్లీ పాటలతో హోరెత్తిస్తుండడంతో పోలీసులు ఉసూరుమనడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇక ద్విచక్ర వాహనాలను ఆపినా, జరిమానా కట్టాలని అడిగినా కొందరు రాజకీయ నాయకులు రంగంలోకి దిగుతుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొంటుండగా.. ఇలాంటి వారితో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు సమాధానం చెప్పలేకపోతున్నామని వారు మథనపడుతున్నారు.