ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

Dec 22 2025 2:03 AM | Updated on Dec 22 2025 2:03 AM

ఆగి ఉ

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

లారీ క్లీనర్‌ మృతి..

తిరుమలాయపాలెం: మండలంలోని చంద్రుతండా వద్ద ఖమ్మం–వరంగల్‌ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో లారీ క్లీనర్‌ మృతిచెందగా బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఖమ్మం రూరల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆది వారం ఉదయం అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద లారీ టైరు పంఛర్‌ కావడంతో లారీ క్లీనర్‌ మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో బోధన్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా.. లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో లారీ టైరు మారుస్తున్న బిహార్‌కు చెందిన క్లినర్‌ నితీష్‌ కుమార్‌ రామ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ కూచిపూడి జగదీష్‌ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. లారీ క్లీనర్‌ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

ఖమ్మంరూరల్‌: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌గృహకల్పకు చెందిన జి.చినరంగయ్య(21) మున్నేటిలో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చినరంగయ్య తన బంధువుతో కలిసి మున్నేటిలో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో చినరంగయ్య చేతిలో ఉన్న డిటోనేటర్‌ పేలడంతో అతని కుడి చేయి తెగిపోయింది. దీంతో 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు చినరంగయ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తల్లి జి.నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాయుడు తెలిపారు.

చెట్టును ఢీకొట్టిన లారీ డ్రైవర్‌..

పెనుబల్లి: లారీ చెట్టుకు ఢీ కొట్టడంతో భవాని మాలలో ఉన్న లారీ డ్రైవర్‌ జంగం నరసయ్య(50) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పెనుబల్లి మండలం వీఎం బంజరు గ్రామ శివారులో మినీ డీసీఎం వ్యాను ఖమ్మం వైపు వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీ కొట్టడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా వీఎం బంజరు పోలీసులు అతడిని బయటికి తీసి పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి, ఆపై ఖమ్మం తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు ఏపీ రాష్ట్రానికి చెందిన చిల్లకల్లు గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఘటనపై ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

యువతి అదృశ్యంపై కేసు నమోదు

ఖమ్మంరూరల్‌: ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన యువతి తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో ఉంటూ ఆరెంపులలోని లారెన్స్‌ కళాశాలలో బీఈడీ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో బంధువులు ఆచూకీ కోసం తెలిసిన వారి, బంధువుల ఇళ్లల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి షేక్‌.అబ్బసల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ రాయుడు తెలిపారు.

ధంసలాపురంలో..

ఖమ్మంఅర్బన్‌: నగరంలోని ధంసలాపురం అగ్రహారం కాలనీకి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యంపై ఖమ్మంఅర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో చాలా చోట్ల ఆరా తీశారు. అయినా ఆచూకీ లేకపోవడంతో ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు1
1/2

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు2
2/2

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement