ఇక కొత్త కళ!
పంచాయతీలు ముస్తాబు..
నేడు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు
సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యుల ప్రమాణ స్వీకారం
అభివృద్ధి పథం పట్టనున్న గ్రామాలు
22 నెలలుగా ‘ప్రత్యేక’పాలన..
జిల్లాలోని మొత్తం 571 పంచాయతీల్లో గత 22 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2019లో 584 జీపీలకు ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఏడాది ఫిబ్రవరి 2న పాలక వర్గాలు పగ్గాలు చేపట్టాయి. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. అయితే ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలు ఏర్పడిన నేపథ్యంలో కొన్ని గ్రామపంచాయతీలు వీటిలో విలీనమయ్యాయి. దీంతో ప్రస్తుతం 571 గ్రామపంచాయతీలు ఉండగా.. అందులో ఐదు జీపీలకు స్టే కారణంగా ఎన్నికలు జరగలేదు. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీకి రిజర్వ్ కాగా.. ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఇక్కడ కూడా ఎన్నిక జరగలేదు. ఈ ఆరు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతుండగా.. మిగిలిన 565 జీపీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి.
ఇక అభివృద్ధి బాట..
గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన ప్రారంభం కానుండడంతో పల్లెలు కొత్త కళ సంతరించుకుంటున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కనీస సమస్యలు కూడా పరిష్కారం కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. పల్లెల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. డ్రెయిన్లలో చెత్త పేరుకుపోవడం, రోడ్లపక్కన చెత్త కుప్పల దర్శనం వంటివి నిత్యకృత్యం అయ్యాయి. ఇక వర్షం వస్తే ఇళ్ల ముందే మురుగు నీరు నిలిచి రోజుల తరబడి ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. సైడ్ డ్రెయిన్లలో చెత్త పేరుకుపోగా మురుగునీరు పొంగి రోడ్లపైకి, ఇళ్లలోకి రావడం సర్వసాధారణంగా మారింది. దీంతో దోమలు ప్రబలి ప్రజలు విషజ్వరాల బారిన పడిన ఘటనలూ ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో బ్లీచింగ్ కూడా చల్లించలేదు. ఇక ప్రత్యేకాధికారులకు వివిధ రకాల బాధ్యతలు ఉండడంతో ఆయా గ్రామాలపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయారు. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నిధుల విడుదలకు లైన్ క్లియర్..
గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు అడ్డంకి తప్పింది. ఎన్నికలు జరగకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. ఎన్నికలు ముగిసినందున పల్లెలకు నిధులు విడుదలవుతాయనే ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ఆస్తి, ఇతర పన్నుల వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే జరగడంతో కనీస అవసరాలకు కూడా నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో జీపీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే గ్రామాలు కొత్తకళ సంతరించుకుంటాయి. ఇక ప్రభుత్వం నుంచి పలు బిల్లులు కూడా రావాల్సి ఉంది. ఇవి కూడా విడుదలవుతాయని నూతన సర్పంచ్‌లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి గ్రామపంచాయతీలు ముస్తాబవుతున్నాయి. జీపీల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లతో పాటు భవనాలను అలంకరిస్తున్నారు. నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులతో పంచాయతీ కార్యదర్శులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పాలకవర్గాలు ఏర్పడిన నేపథ్యంలో వీలైన సమయంలో గ్రామసభ ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధి, నిధుల వినియోగం, రావాల్సిన నిధులు తదితర వాటిపై చర్చిస్తారు. చేపట్టాల్సిన పనులపై తీర్మానం చేస్తారు. గ్రామంలో అవసరాలకు అనుగుణంగా నిధులు వెచ్చిస్తారు.
పల్లెల్లో కొలువుదీరనున్న పాలకవర్గాలు


