27, 28వ తేదీల్లో ఖమ్మం జోన్ క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి ఖమ్మం జోన్ డిగ్రీ కళాశాలల క్రికెట్ పోటీలు ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి.వెంకన్న తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఖమ్మం జోన్ పరిధిలోని 14 కళాశాలల నుంచి జట్ల నుంచి ఎంట్రీలు అందాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ఖమ్మం జోన్ జట్టును ఎంపిక చేయనుండగా, కాకతీయ యూనివర్సిటీ స్థాయి టోర్నీలో పాల్గొంటుందని వెల్లడించారు.
‘ప్రకృతి విపత్తుల’పై
నేడు మాక్ డ్రిల్
ఖమ్మం సహకారనగర్ : ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం బొక్కలగడ్డ ప్రాంత ప్రజ లను రామ్‌లీలా ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించడం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ పేషెంట్లను టాప్ ఫ్లోర్‌కు తరలించడాన్ని మాక్ ఎక్సర్‌సైజ్‌గా చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నారు. మాక్‌డ్రిల్‌లో భాగంగా వరదలతో బొక్కలగడ్డ ప్రాంతం మునిగిపోతుందని ఉదయం 9 గంటలకు జిల్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందని, ఆ వెంటనే ఏయే శాఖలను అలర్ట్ చేయాలి, క్షేత్రస్థాయిలో ఎలా సాయం అందించాలి, ప్రజలను త్వరగా ఖాళీ చేయించడం ఎలా అనే అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో సీపీఓ ఎ.శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు యాకూబ్, అజయ్‌కుమార్, రామారావు, వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు.
గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు ఖండన
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణా ఉద్యమ కారుడు, ప్రజాతంత్ర వాది గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ ఉపా చట్టం కింద అరెస్టు చేయడం దుర్మార్గమని, దీన్ని ఖండిస్తున్నామని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల నిర్మూలనకు పిలుపునిచ్చి నరమేధాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. ఇన్నయ్యపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


