‘స్వయం’శక్తితో ముందడుగు | - | Sakshi
Sakshi News home page

‘స్వయం’శక్తితో ముందడుగు

Dec 22 2025 2:01 AM | Updated on Dec 22 2025 2:01 AM

‘స్వయ

‘స్వయం’శక్తితో ముందడుగు

● ట్రాన్స్‌జెండర్ల సరికొత్త ప్రస్థానం ● నగరంలో ఐదు స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ● మూడు సంఘాలకు రూ.3లక్షల చొప్పున రుణం ● వివిధ వ్యాపారాలతో రాణిస్తున్న వైనం

● ట్రాన్స్‌జెండర్ల సరికొత్త ప్రస్థానం ● నగరంలో ఐదు స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ● మూడు సంఘాలకు రూ.3లక్షల చొప్పున రుణం ● వివిధ వ్యాపారాలతో రాణిస్తున్న వైనం

ఖమ్మంమయూరిసెంటర్‌: సమాజంలో ఒకప్పుడు చిన్నచూపునకు గురై, ఉపాధి మార్గాలు లేక యాచనకే పరిమితమైన ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌, మెప్మా అధికారుల చొరవ, ప్రభుత్వ ప్రోత్సాహంతో వారు ఇప్పుడు వ్యాపారులుగా ఎదుగుతున్నారు. మొదటి విడతలో ట్రాన్స్‌జెండర్లతో ఐదు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. వాటిలో మూడు సంఘాలకు రుణాలు ఇప్పించడం ద్వారా స్వయం శక్తితో ఎదిగేందుకు అవకాశం కల్పించారు.

గౌరవంగా బతికేలా..

ట్రాన్స్‌జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య ప్రోత్సాహం, మెప్మా అధికారుల చొరవతో వారందరితో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించారు. మెప్మా అధికారులు వారికి పొదుపుపై అవగాహన కల్పించారు. దీంతో ట్రాన్స్‌జెండర్లకు సామాజిక రక్షణతోపాటు ఆర్థిక భరోసా లభించింది.

బ్యాంక్‌ లింకేజీ రుణాలు..

నగరంలోని ట్రాన్స్‌జెండర్లతో మెప్మా ఆధ్వర్యంలో ఐదు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు మంజూరు చేయించారు. మూడు సంఘాలకు రూ.3 లక్షల చొప్పున రుణం ఇవ్వగా.. సంఘంలోని పది మంది సభ్యులకు రూ.30 వేల చొప్పున అందాయి. దీంతో వారు తమకు నచ్చిన రంగాల్లో స్వయం ఉపాధిని ప్రారంభించారు. రుణం తీసుకున్న సంఘాల్లో విశ్వం స్వయం సహాయక సంఘ సభ్యులు రూ.3లక్షలు సకాలంలో చెల్లించడంతో మరో రూ.10 లక్షల బ్యాంక్‌ లింకేజీ రుణం అందించారు. ఇక మిగిలిన రెండు సంఘాలు కూడా రుణాలను సక్రమంగానే చెల్లిస్తున్నాయి.

అదర్శ జీవితం గడుపుతూ..

గౌరవప్రద జీవనానికి ఖమ్మంలోని ట్రాన్స్‌జెండర్లు మార్గదర్శకులుగా మారారు. ఒకప్పుడు యాచనే ప్రధాన వృత్తిగా ఉన్న వీరు ప్రస్తుతం తమ కాళ్లపై తాము నిలబడగలమనే ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నారు. ‘మాకు గౌరవం కావాలి, మేమూ సమాజంలో భాగమే’ అని చాటిచెబుతూ, ఇతర ప్రాంతాల్లోని ట్రాన్స్‌జెండర్లకు ఖమ్మం బిడ్డలు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి వచ్చిన రుణంతో చిన్న తరహా వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. అలాగే కేటరింగ్‌, ఇతర రంగాల్లో కూడా సేవలు అందిస్తున్నారు. మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఇప్పించారు. అధికారులు తీసుకున్న చొరవతో ట్రాన్స్‌జెండర్లలో ఆర్ధిక స్థిరత్వం ఏర్పడింది.

మరికొందరికి ఉపాధి కల్పించేలా..

విశ్వం స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన బోడ శివాని తనకు వచ్చిన రూ.30వేల రుణంతో టీస్టాల్‌ ఏర్పా టు చేసుకుంది. తద్వారా వచ్చే ఆదాయంలో కొంత రుణం కింద చెల్లిస్తోంది. టీ స్టాల్‌ బాగానే నడుస్తుండటంతో మరింత అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ స్వ యం సహాయక సంఘం సభ్యులు తమ రుణమొత్తం రూ.3 లక్షలు చెల్లించడంతో మరో రూ.10లక్షల రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొచ్చారు. ఈ రుణంతో మరో ఆరుగురు సభ్యులతో వేర్వేరు వ్యాపారాలు ఏర్పాటు చేయించనున్నట్లు శివాని తెలిపింది. కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య తమకు మంచి అవకాశం కల్పించారని చెప్పింది.

‘స్వయం’శక్తితో ముందడుగు1
1/1

‘స్వయం’శక్తితో ముందడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement