హెచ్‌ఐసీసీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ. చిత్రంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మన్మోహన్ స్ఫూర్తితో రాష్ట్రానికి తోడ్పాటునివ్వండి
మెట్రో నగరాల అభివృద్ధికి పీఎంఓలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయండి
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్రంతో కలిసి నడుస్తాం
రాష్ట్ర అభివృద్ధిపై మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విన్నపం
ముందు దేశం.. తర్వాతే ప్రజలు... పార్టీ అని వెల్లడి
ఇదే తమ నినాదం.. విధానమని ఉద్ఘాటన
సాక్షి, హైదరాబాద్: ‘జాతీయ భద్రత, దేశ అభివృద్ధే మనకు అత్యంత ప్రాధాన్యం. ముందు భారతదేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ.. ఇదే మా నినాదం.. ఇదే మా విధానం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హెచ్‌ఐసీసీలో జరిగిన అభివృద్ధి ఉత్సవంలో సీఎం ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రంతో కలిసి నడిచేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తరచూ ప్రధానికి పెద్ద మనసు ఉందని చెబుతుంటారని.. ఆ పెద్ద మనసుతో తెలంగాణ పెండింగ్ పనులు, ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలని కోరారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా దేశాన్ని 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై మాట్లాడినప్పుడు రాష్ట్రం కోసం ’తెలంగాణ రైజింగ్–2047’ను రూపొందించామని, ఈ క్రతువులో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి తమకు సహకారం అందడం లేదని, ప్రధాని మోదీ రాకతో తెలంగాణ అభివృద్ధికి కొత్త రూపు వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, తెలంగాణ అభివృద్ధికి పండగ లాంటిదన్నారు.
మన్మోహన్ సింగ్ స్ఫూర్తిని కొనసాగించండి..
‘మీరు (మోదీ) గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాడు మన్మోహన్ ఇచి్చన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా’నని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని, దీనికి కేంద్రం తోడ్పాటు అత్యవసరమని విన్నవించారు.
మీరు సమయం కేటాయించండి
దేశాభివృద్ధిలో మహానగరాల పాత్ర కీలకమని, ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా మెట్రో నగరాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ సూచించారు. దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ మహా నగరాలను అభివృద్ధి చేయాలన్నారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు వేగవంతం చేసేలా ప్రధాని కార్యాలయంలో ఈ రాష్ట్రాల కోసం ప్రత్యేక ’సింగిల్ విండో టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
‘నా రాష్ట్రం, నా ప్రజల కోసం సానుకూల నిర్ణయాల విషయంలో నేను మిమ్మల్సి, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. మా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు మీ అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. మూసీ నది, మెట్రో రైలు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్–మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారికి సంబంధించి రెండు గంటలపాటు మీరు సమయం కేటాయించి సమీక్షించాలి’అని మోదీని రేవంత్ కోరారు.
రాజకీయాలకన్నా రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
‘రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అది బీఆర్‌ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎప్పుడూ వివక్ష చూపదు’అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హెచ్‌ఐసీసీలో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకు రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అంకురార్పణ జరగడం రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టమన్నారు.
ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు మూడేళ్ల క్రితమే కేంద్రం పచ్చజెండా ఊపిందని, భూసేకరణ పూర్తయి కేబినెట్ ఆమోదం లభించగానే పనులు పరుగులు పెడతాయని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందని, ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ. 220 కోట్లతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ స్థాయి సౌకర్యాలతో ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది మోదీ సంకల్పమని, ఈ మహా యజ్ఞంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


