Paralysis: పక్షవాతం పడగొడుతోంది!

Paralysis Cases Increasing in Rajanna Sirisilla District - Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెరుగుతున్న కేసులు

రక్తపోటు బాధితులు 29 వేల

అప్పులపాలవుతున్న వైనం

రోడ్డున పడుతున్న కుటుంబాలు

ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు ముస్తాబాద్‌కు చెందిన అనమేని బాలయ్య, శ్యామల. మేస్త్రీ పనిచేస్తూ, వ్యవసాయం చేసుకునే బాలయ్యకు ఏడాదిన్నర క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. రూ.3లక్షల వరకు అప్పు చేసి వైద్యం చేయిస్తున్నారు. కూతురు వెన్నెలను ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదివిస్తున్నారు. బాలయ్యకు నెలకు రూ.13వేల వరకు ఖర్చు అవుతుంది. 


ఈ చిత్రంలో మంచానికే పరిమితమైన మెంగని శ్రీనివాస్‌(51)ది ముస్తాబాద్‌. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీనివాస్‌ 2020లో తిరిగొచ్చాడు. ఆరు గెదెలు కొని, డెయిరీతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతలోనే శ్రీనివాస్‌కు పక్షవాతం రాగా.. రూ.8లక్షలు ఖర్చ య్యింది. అయినా నయం కాలేదు.  కుటుంబ పెద్ద పక్షవాతానికి గురవడంతో పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన కొడుకు వివేక్‌ బీటెక్‌కు చదువలేకపోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తండ్రికి ఆసరాగా నిలుస్తున్నాడు. చిన్నకుమారుడు సాత్విక్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. 

ముస్తాబాద్‌(సిరిసిల్ల): జిల్లాలో ఇటీవల పక్షవాతానికి గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మారుతున్న జీవన విధానం.. ఆహారమార్పులతో బీపీ(బ్లడ్‌ ప్రెషర్‌) పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వ్యక్తులు మంచానికి పరిమితం అవుతుండగా.. చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. 

మారుతున్న జీవన విధానం
ప్రస్తుత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలతో చిన్న వయస్సులోనే పక్షవాతానికి గురవుతున్నారు. పెరుగుతున్న రక్తపోటు(బీపీ), షుగర్, కొలెస్ట్రాల్‌ వంటి వాటితో పక్షవాతం దాడి చేస్తుంది. ఒకే చోట కదలకుండా పనిచేయడం, మద్యం ఎక్కువగా తాగడం, మాంసం, జంక్‌ఫుడ్‌ తీసుకోవడం, పొగతాగే అలవాటు ఉన్న వాళ్లలో పెరాలసిస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. అతిగా మొబైల్‌ వినియోగించే వారిలోనూ పెరాలసిస్‌ లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 

స్పందించే సమయం ముఖ్యం
పక్షవాతానికి గురయ్యే వారికి ముందుగానే లక్షణాలు బయటపడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు ముందుగానే గుర్తించి తక్షణమే వైద్యం అందిస్తే త్వరగా కోలుకునే లక్షణాలు ఉన్నాయి. ఇటీవల సిరిసిల్లకు చెందిన ఒకరు పక్షవాతానికి గురికాగా కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యంత వేగంగా స్పందించిన డ్యూటీ డాక్టర్‌ పక్షవాతానికి గురైన నాలుగు గంటల్లోపే ఖరీదైన ఇంజక్షన్‌ ఇవ్వడంతో శాశ్వత పక్షవాతం నుంచి బయటపడ్డాడు. (క్లిక్: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..)

ఇలా తెలుసుకోవాలి

  • మెదడులో ఒక ప్రాంతం ఒక్కో భాగాన్ని నియంత్రిస్తుంది. రక్తప్రసరణ నిలిచిపోయినప్పుడు ఆ భాగంలో రక్తం గడ్డకట్టి తలనొప్పి, కళ్లు తిరగడం, అపస్మారక స్థితిలోకి వెళ్తుంటాయి. 
  • నాడీవేగం తగ్గడం, తల, కళ్లు ఒక వైపునకు తిరగడం. 
  • కనుపాపలు వెలుతురుకు స్పందించకపోవడం జరుగుతుంది.
  • మూత్ర ఆపుకునే శక్తి సన్నగిల్లడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతి సమస్యలు లక్షణాలు కనిపిస్తాయి.
  • బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారు బలహీనంగా ఉంటారు. 
  • పక్షవాతానికి గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి, ఎంతవేగంగా చికిత్స అందిస్తే రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. 

ఈ–హెల్త్‌ ద్వారా నమోదు
జిల్లాలో ఈ–హెల్త్‌ అధికారులు సర్వే చేపట్టారు. జిల్లాలో అధిక రక్తపోటు(బీపీ) కేసులు 29,213 ఉన్నాయి. ఇందులోని వారే పెరాలసిస్‌కు గురవుతున్నట్లు ఆరోగ్యశాఖ భావిస్తోంది. జిల్లాలో దాదాపుగా 2500 ఆపైగా పక్షవాతం కేసులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి కారణమయ్యే షుగర్‌ కేసులు కూడా జిల్లాలో 13,331 కేసులు ఉన్నాయి. పెరాలసిస్‌ బాధితులకు కూడా ప్రభుత్వం అండగా నిలవాలని పేద కుటుంబాలు కోరుతున్నాయి. (క్లిక్: స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి)


జీవన విధానం మార్చుకోవాలి

ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చా యి. స్మోకింగ్, ఆల్కహల్, జంక్‌ఫుడ్‌ తీసుకుంటున్నారు. యువత కూడా పెరాలసిస్‌కు గురవడం సాధారణంగా మారింది. లక్షణాలు బయటపడగానే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. మానసిక ఒత్తిడికి గురికావద్దు. వ్యాయామం, యోగా చేయాలి. 
– డాక్టర్‌ చింతోజు శంకర్, ఐఎంఏ జిల్లా మాజీ అధ్యక్షుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top