
లైఫ్‌ట్యాక్స్ పెంచినా యథావిధిగా ఆర్టీఏ బాదుడు
రెండో వాహనం ఉంటే 2 శాతం అదనం
వాహనదారులపై ఏటా రూ.150 కోట్లకుపైగా భారం
కొద్దిరోజుల క్రితం జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి కొత్త కారు నమోదు కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులను సంప్రదించారు. ఆయన పేరుతో ఇప్పటికే ఓ ద్విచక్ర వాహనం ఉందని, 2 శాతం పన్ను అదనంగా చెల్లించాలని వారు చెప్పారు. దీంతో ఆ వ్యక్తి విస్మయానికి గురయ్యారు. 33 ఏళ్ల క్రితం వినియోగించిన స్కూటర్ అది. చాలా ఏళ్ల క్రితమే అది తుక్కుగా మారింది. కనీసం ఆ వాహనానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కానీ.. రవాణాశాఖ రికార్డుల్లో మాత్రం నమోదై ఉండడంతో బిత్తరపోయారు. లేని వాహనం ఉన్నట్లుగా చూపడంతో పాటు రెండో బండి పేరిట కొత్తగా కొనుగోలు చేసిన వాహనంపై 20 శాతం నుంచి 22 శాతం వరకు జీవితకాల పన్ను పెంచారు. వాహనదారులపై రవాణా శాఖ గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న దోపిడీకి ఇదో తాజా ఉదాహరణ.
సాక్షి, హైదరాబాద్: కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై జీవితకాల పన్ను పెంచినప్పటికీ రెండో బండి పేరిట సాగించే ఆర్టీఏ అదనపు బాదుడు యథావిధిగా కొనసాగుతూనే ఉంది. పాత వాహనం ఉండి కొత్తగా మరో వాహనం కొనుగోలు చేసేవారు అదనంగా 2 శాతం పన్ను చెల్లించాల్సివస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన స్క్రాప్ పాలసీకి అనుగుణంగా రెండో వాహనం నిబంధనను ఎత్తివేయనున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. కానీ.. ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా కొత్త వాహనాలపై పన్నులు పెంచింది. కార్లు, తదితర నాలుగు చక్రాల వాహనాల ధరలపై 20 నుంచి 25 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ విధించారు. ఒకవైపు అదనపు పన్నుల మోతను భరిస్తున్న వాహనదారులపై ‘పాతబండి’ పేరిట మరో 2 శాతం బాదుతున్నారు. రెండో బండి పేరిట ఏటా దాదాపు రూ.150 కోట్లకు పైగా పన్ను వసూలు చేయడం గమనార్హం.
తుక్కు విధానం ఏమైనట్లు..
కూకట్‌పల్లికి చెందిన ఓ వాహనదారుడి పాత ద్విచక్ర వాహనం ఏడేళ్ల క్రితం చోరీకి గురయింది. ఈ మేరకు పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇప్పటి వరకు ఆ బండి ఆచూకీ లభించలేదు. కానీ.. సదరు వాహనదారు కొత్తగా కొనుగోలు చేసిన కారుపై 2 శాతం అదనంగా పన్ను చెల్లించాల్సివచి్చంది. బండి అపహరణకు గురైనట్లు కేసు నమోదైనస్పటికీ కేవలం రవాణాశాఖ రికార్డుల్లో నమోదై ఉన్నందుకే అదనంగా సమరి్పంచుకోవాల్సి వస్తోంది. ఇలా భౌతికంగా లేని వాహనాలపై, కాలం చెల్లినవాటిపై సమగ్రమైన తుక్కు విధానాన్ని (స్క్రాప్ పాలసీ)ని రూపొందించి 2 శాతం అదనపు బాదుడు నుంచి మినహాయింపును ఇవ్వనున్నట్లు రవాణా అధికారులు ఏడాది క్రితం ప్రతిపాదించారు.
గత ఆగస్టులో ఎడాపెడా జీవితకాల పన్ను పెంచినప్పటికీ ఈ రెండో వాహనం నిబంధనను తొలగించలేదు. దీంతో వాహనం ఉన్నా, లేకున్నా పెద్ద మొత్తంలో జీవితకాల పన్ను రూపంలో కోల్పోవాల్సివస్తోంది. ఇది కేవలం ఒకరిద్దరికి సంబంధించిన అంశం కాదు. గ్రేటర్‌లో లక్షలాది మంది వాహనదారులు తమ పాత వాహనాలపై రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనాలను విక్రయించినప్పటికీ యాజమాన్యం బదిలీ చేయకపోవడంతో కొందరు, కాలం చెల్లిన వాహనాలను రవాణా అధికారుల సమక్షంలో తుక్కుగా మార్చకపోవడంతో మరికొందరు దారుణంగా నష్టపోతున్నారు.
ద్విచక్ర వాహనం ఉన్నా..
నగరంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కొనుగోలు చేయకుండా నిరుత్సాహపరిచేందుకు రవాణాశాఖ 2 శాతం అదనపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. నిజానికి అప్పటికే ఒక కారు కలిగి ఉన్న వ్యక్తి అదనంగా మరో కారును కొనుగోలు చేసినప్పుడు మాత్రమే 2 శాతం అదనపు పన్ను వర్తిస్తుంది. ఒక ద్విచక్ర వాహనం ఉండి కొత్తగా కారు కొనుగోలు చేసినప్పుడు ఇది వర్తించదు. కానీ రవాణా అధికారులు ఈ నిబంధనను బేఖాతరు చేశారు. ద్విచక్ర వాహనం ఉన్నా సరే ఏకంగా రూ.లక్షల్లో అదనపు బాదుడుకు పాల్పడుతున్నారు.‘కనీసం రూ.25 వేలు కూడా ఖరీదు చేయలేని డొక్కు స్కూటర్ ఉన్నందుకు రూ.లక్షల్లో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని’ ఓ వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు ద్విచక్ర వాహనాలను ఈ నిబంధన నుంచి తొలగించాలనే ప్రతిపాదన ఉన్నా.. ఏటా రూ.150 కోట్లకు పైగా అదనపు ఆదాయం వస్తుండడంతో బాదుడు కొనసాగిస్తున్నారు.