ఆన్‌‘లైన్’‌లో పడని చదువులు

Online Teaching Not Available To Rural Students Due To Network Problem - Sakshi

‘నెట్‌వర్క్‌’ సమస్యతో మారుమూల..

ప్రాంత విద్యార్థులకు చేరని పాఠాలు

తెలంగాణలో 94 శాతం టీవీలు, 74 శాతం స్మార్ట్‌ఫోన్లు

ఏఎస్‌ఈఆర్‌ సర్వే – 2020 నివేదికలో వెల్లడి

సాక్షి, వరంగల్‌ : కరోనా దెబ్బకు కుదేలవ్వని రంగం లేదు. ఆర్థిక వ్యవస్థ పడకేయగా, చదువులు అటకెక్కాయి. విద్యారంగానికి ఎదురవుతున్న సవాళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో విద్యాబోధన జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1న ప్రారంభించిన ఈ ఆన్‌లైన్‌ తరగతులు కొంతవరకు ప్రయోజనం చేకూర్చినా... గ్రామీణ, గిరిజన, మారుమూల, ప్రాంతాల విద్యార్థులను చేరలేకపోయాయి. నెట్‌వర్క్‌ సమస్యతో గ్రామీణ విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన అందట్లేదు. తాజాగా ప్రథమ్‌ సంస్థ దేశవ్యాప్తంగా సర్వేచేసి రూపొందించిన విద్యావార్షిక స్థితి నివేదిక (ఏఎస్‌ఈఆర్‌) ఇదే చెబుతోంది. ఈ నివేదిక ఆధారంగా డిజిటల్‌ విద్య స్థితిగతులెలా ఉన్నాయంటే..

డిజిటల్‌ బోధనకు భారీ ఖర్చు
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు డిజిటల్‌ బోధన కోసం టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లతో పాటు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు అధిక మొత్తంలో ఖర్చు చేశారు. 2018 ఏఎస్‌ఈఆర్‌ నివేదిక ప్రకారం 45.8 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండగా 2020 నివేదిక ప్రకారం ఇది 74 శాతానికి పెరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం 37.6 నుండి 68.1 శాతానికి పెరిగింది. మొత్తంగా తెలంగాణలో 90.5 శాతం మంది విద్యార్థులకు టీవీలు, 74 శాతం విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా కాలంలో డిజిటల్‌ బోధనలో పాఠాలు వినేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు రూ.2,500 కోట్లు వెచ్చించినట్లు నివేదిక తెలిపింది.

వేధిస్తున్న నెట్‌వర్క్‌ సమస్య
రాష్ట్రంలో స్మార్ట్‌ఫోన్లు, టీవీల సంఖ్య గణనీయంగా పెరిగినా గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులను నెట్‌వర్క్‌ సమస్య వేధిస్తోంది. ఫైబర్‌ ఆప్టికల్‌ (భారత్‌ నెట్‌) ద్వారా ప్రతీ గ్రామానికి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తామని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా.. అదంతా మాట లకే పరిమితమవుతోంది. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ నెట్‌వర్క్‌ సమస్యతో రాష్ట్రంలోని చాలామంది విద్యార్థులకు డిజిటల్‌ బోధన అందని ద్రాక్షగా మారిందని ఏఎస్‌ఈఆర్‌ నివేదిక పేర్కొంటోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top