
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్టీఆర్ అభిమానులు
ఎమ్మెల్యేను టీడీపీ నుంచి సస్పెండ్ చెయ్యాలి
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హెచ్చరిక
హైదరాబాద్: ‘జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను టీడీపీ నుండి వెంటనే సస్పెండ్ చెయ్యాలని.. రెండ్రోజుల్లో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే అనంతపురం ముట్టడిస్తామని ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరించారు. ‘నందమూరి’ కోడలిని తిడితే ఎలా ఒప్పుకుంటామని వారు బుధవారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌మీట్ పెట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎవరికైతే ఫోన్‌చేసి బూతులు మాట్లాడాడో అతన్ని పక్కన కూర్చోపెట్టుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్టీఆర్ అభిమానులు నరేంద్ర చౌదరి, సుధీర్ రాజు, కావూరి కృష్ణ, బాబ్జి, ఆదోని ముజీబ్‌లు ఏమన్నారంటే..
ఎమ్మెల్యేను టీడీపీ నేతలు నిలదీయాలి..
ప్రజాప్రతినిధి అయి ఉండి ఎమ్మెల్యే దగ్గుపాటి ఒక మాతృమూర్తిని నోటికి ఎంతవస్తే అంత సోయిలేకుండా మాట్లాడడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. టీడీపీ అంటే మహిళలను ఎంతో గౌరవించే పార్టీ అని గొప్పగా చెప్పుకునే నాయకులు ఇలా ఒక స్త్రీ గురించి ఎందుకు మాట్లాడాడో ఆయన్ని నిలదీయాలి. ప్రసాద్ అనే ఎమ్మెల్యే వెనక ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ లేకపోతే తమ సత్తా ఏమిటో చూపించే వాళ్లం. తప్పుచేసి ఇప్పుడు నా వాయిస్ కాదు అని అంటున్నాడు. కానీ, ఫోన్‌లో మాట్లాడిన అభిమానం మాత్రం ఎమ్మెల్యేనే మాట్లాడాడని స్పష్టంగా చెబుతున్నాడు. దీంతో.. ఎమ్మెల్యే ప్రసాద్ అతనిని, అతని కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు.
దగ్గుపాటి అహంకారానికి నిదర్శనం..
ప్రభుత్వం సినిమాకు అనుమతిచ్చిన తరువాత ‘ఎలా రిలీజ్ చేస్తారు’ అని అనడానికి ఎమ్మెల్యే ఎవరు? 25 ఏళ్లుగా తలాతోక లేనివారు ఎంతోమంది నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే, ఎన్టీఆర్ ఏనాడూ ఎవ్వరినీ ఒక్కమాట కూడా అనలేదు. వార్–2 సినిమా ప్రమోషన్‌లో కూడా పాతికేళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని ఎన్టీఆర్ చెప్పారు కానీ, ఎవ్వరినీ విమర్శించలేదు.. ఎవరికీ వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు. అయినా, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అలా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం. రెండ్రోజుల్లో ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే చలో అనంతపూర్ నిర్వహించి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం. అక్కడి ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన, రాస్తారోకో చేస్తాం. ఎన్టీఆర్ యువసైన్యం తన సత్తా చూపిస్తుంది.
ఏపీలో ప్రెస్‌మీట్ పెట్టే పరిస్థితి లేదు..
ఇక ఈ ప్రెస్‌మీట్ అనంతపురంలో పెట్టాల్సింది. కానీ, అక్కడ పోలీసులు విపరీతమైన ఆంక్షలు పెట్టి మీడియా సమావేశం పెట్టకుండా అడ్డుకుంటున్నారు. ఆఖరుకు విజయవాడలో పెడదామనుకున్నా అక్కడ కూడా పెట్టకూడదంటున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో చివరికి హైదరాబాద్‌కు వచ్చి సమావేశం పెట్టాల్సి వచ్చింది.