No Shave November: గడ్డాలు పెంచుతూ ఆకర్షణగా నిలుస్తున్న యువత

No Shave November 2021: Youth Donate Funds To Cancer Patients In Warangal - Sakshi

సాక్షి, కాజీపేట(వరంగల్‌): క్రాఫ్‌లో వివిధ రకాల స్టైల్స్‌.. ఆ మాదిరిగానే గడ్డంలోనూ తమకంటూ ఓ ప్రత్యేకత కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. తమ అందాన్ని గడ్డం రూపంలోనూ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు మక్కువ చూపుతూ ఇదో స్టైల్‌ అంటూ కొత్త ట్రెండ్‌కు తెరలేపుతోంది. ‘నో షేవ్‌.. పెంచెయ్‌ గడ్డం’ అంటూ నగర యువత గడ్డం పెంచడంతో కొత్తదనం చూపుతోంది.

అయితే ఏడాదిలో ప్రతి నెలకో ప్రత్యేకత ఉండగా.. కేన్సర్‌ మహమ్మారిని సమాజం నుంచి పారదోలేందుకు.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు.. పేషెంట్లకు ఆర్థిక చేయూతనందించేందుకు నో షేవ్‌ నవంబర్‌ మాసంగా జరుపుకునేందుకు యువత ఉత్సాహం కనబరుస్తోంది. 

నవంబర్‌ నో షేవ్‌ మాసంగా..
గతంలో గడ్డం పెంచుకుంటే ఏంట్రా దేవదాసులా మారావు అనేవారు. కానీ.. ఇప్పుడు గడ్డం పెంచేసుకుందాం బాసూ అంటున్నారు. ప్రస్తుత యువతకు గడ్డం ఓ ట్రెండ్‌లా మారింది. తీరొక్క ఆకృతుల్లో.. ఇష్టమైన విధంగా మలచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నవంబర్‌ మాసాన్ని నో షేవ్‌ నవంబర్‌ పేరిట.. గడ్డంపై కత్తెర పడనివ్వకుండా.. గడ్డానికి వెచ్చించే ఖర్చును మాసం మొత్తంలో పొదుపు చేసి కేన్సర్‌ పేషెంట్లకు అందజేయడంతోపాటు గడ్డం పెంచడంలో తమ స్టైల్‌ను కనబరుస్తూ.. డబ్బును ఆదా చేసి పేషెంట్లకు అందిస్తూ తమ ఉదారతను చాటుతున్నారు.

ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు నగర యువకులు. ఇందుకోసం యువతను మరింతగా ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్‌ నో షేవ్‌ నవంబర్‌ పేరిట స్వచ్ఛంద సంస్థ అందుబాటులో ఉండడం విశేషం. కాగా.. యువత ఫ్రెంచ్, అండర్‌ కట్‌ బియర్డ్, యాంకర్‌ బియర్డ్‌ వంటి వాటితోపాటు తమకు ఇష్టమైన హీరోల గడ్డాలను సరిపోలే విధంగా గడ్డాన్ని తీర్చిదిద్దుకునేందుకు నగరంలో ప్రత్యేకంగా మెన్స్‌ పార్లర్లు అందుబాటులో ఉన్నాయి.

గడ్డం ప్రవీణ్‌ అంటారు..
నాకు గడ్డం పెంచడం అంటే చాలా ఇష్టం. నన్ను మా ఆఫీసులో అందరూ గడ్డం ప్రవీణ్‌ అనే పిలుస్తారు. నవంబర్‌ మాసంలో గడ్డంపై పెట్టే డబ్బులను కేన్సర్‌ పేషెంట్లకు అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదో మంచి సేవా కార్యక్రమంలా నేను భావిస్తున్నా. 

– సుందర ప్రవీణ్‌కుమార్, రైల్వే బుకింగ్‌ క్లర్క్‌

నా బియర్డ్‌ నా ఇష్టం
నా బియర్డ్‌ నా ఇష్టం అంటాను నేను. మా ఇంట్లో వారు గడ్డం ఎందుకన్నా నాకు మాత్రం పెంచడం అంటే చాలా ఇష్టం. ప్రతి ఏడాది నవంబర్‌ మాసంలో నో షేవ్‌ నవంబర్‌ను పాటించి డబ్బులను ఆదా చేసి కేన్సర్‌ పేషెంట్లకు అందజేయడం బాధ్యతగా భావిస్తా.

– ప్రియాంషు, ఎంటెక్, నిట్‌ వరంగల్‌

నో షేవ్‌ నవంబర్‌ను పాటిస్తాం..
నిట్‌ వరంగల్‌ ప్రతి అంశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నిట్‌లో నవంబర్‌ నెలను నో షేవ్‌ నవంబర్‌గా పాటిస్తున్నాం. నాతోటి మిత్రులతో కలిసి బియర్డ్‌ కటింగ్‌కు అయ్యే డబ్బులను కేన్సర్‌ పేషెంట్ల చికిత్సకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాం.

– విదిష్‌రామ్, పీహెచ్‌డీ స్కాలర్, నిట్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top