కరోనాతో ప్రపంచదేశాలు గడగడ.. వారి జోలికి మాత్రం పోలేదు

No Corona Cases In Adilabad District Tribal Villagse  - Sakshi

కోవిడ్‌ అంటని గూడేలు

కరోనా చూపు తాకని పలు ఆదివాసీ గిరిజన ఆవాసాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో ప్రశాంతంగా గిరిజనం 

సొంతంగా కూరగాయలు పండిస్తూ ఆరోగ్యంగా ప్రజలు 

అటవీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడంతో మంచి రోగనిరోధక శక్తి 

శుభకార్యాలకూ దూరంగా ఉంటున్న ఆయా గ్రామాల గిరిజనులు 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ములుగు: ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌ మహమ్మారితో గడగడలాడుతున్నాయి. కానీ వారి జోలికి మాత్రం పోలేదు. కరోనాతో సంబంధం లేకుండా ఆదివాసీ గిరిజన ప్రజలు సాఫీగా జీవనం సాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక, ఇల్లెందు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా బారిన పడకపోవడం గమనార్హం. ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లోనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవడం, అడవుల్లో లభించే దుంపలు, కాయలు, ఆకులు, చింతపూలు ఆహారంగా తీసుకుంటుం టారు.

అడవుల్లో లభించే విప్ప పువ్వు, కాయలు వాడుతారు. విప్ప పువ్వును ఆహారంగా తీసుకుంటూ.. విప్ప కాయలను గానుగ పట్టి నూనె తయా రు చేసుకుంటున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. పైగా కూరగాయలన్నీ సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నా రు. తమ గ్రామాలు దాటి ఎలాంటి శుభకార్యాల కోసం ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లట్లేదు. మాస్కులు, శానిటైజర్లు సైతం అవసరం లేకుండానే ఆయా గ్రామాల ప్రజలు నిశ్చింతగా ఉంటున్నారు. 

సాగుకే పరిమితం.. 
పినపాక నియోజకవర్గంలోని గుండాల మండలంలో 50 గిరిజన గ్రామాలుండగా.. 5 గ్రామాల్లో ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. ఆళ్లపల్లి మండలంలో 40 గ్రామాలుండగా.. వీటిలో 5 గ్రామాల్లోనే కరోనా కేసులు నమోదయ్యాయి. కరకగూడెం మండలంలో 7 గ్రామాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. పినపాక మండలంలోని పలు గ్రామాలు కోవిడ్‌ తమ దరికి చేరనీయలేదు.

టేకులగూడెం, ఎర్రగుంట, పిట్టతోగు, ఉమేశ్‌ చంద్రనగర్, సుందరయ్యనగర్, తిర్లాపురం గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వారు మాస్కులు, శానిటైజర్లు వాడట్లేదు. అశ్వాపురం మండల కేంద్రానికి దూరంగా మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలోని మనుబోతులగూడెంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో 4 గొత్తికోయ గ్రామాలున్నాయి.

ఐతయ్య గుంపులో 41, మడకం మల్లయ్య గుంపులో 11, మనుబోతులగూడెం గ్రామంలో 20 కుటుంబాలు, సంతోష్‌ గుంపు 28, పొడియం నాగేశ్వరరావు గుంపు 20, వేములూరు గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి వారు ఇతర గ్రామాలకు, శుభకార్యాలకు వెళ్లకపోవడం, ఎక్కువ శాతం ఆ గ్రామానికే పరిమితం కావడంతో కరోనాకు దూరంగా ఉన్నారు. పైగా ఈ గ్రామాలకు ఇతర ప్రాంతాల వారు వచ్చే పరిస్థితి కూడా లేదు. జూలూరుపాడు మండలంలోని బాడవప్రోలు గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కోవిడ్‌ కేసు నమోదు కాలేదు. భద్రాచలం నియోజకవర్గంలోని చత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న చర్ల మండలం వీరాపురం గ్రామంలో 36 కుటుంబాలకు చెందిన 185 మంది జనాభా ఉన్నారు. ఇక్కడా ఒక్క కోవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. 

ఇప్పటికీ అవే ఆచార వ్యవహారాలు 
ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట, పూబెల్లి పంచాయతీల్లో పలు గిరిజన గూడెంలలో కరోనా జాడలు లేవు. ముఖ్యంగా ముత్తారపుకట్టలో వీరాపురం, కోటగడ్డలో మాణిక్యారం పంచాయతీలో ఒంపుగూడెం, పూబెల్లి పంచాయతీలో పూబెల్లి, పూబెల్లి స్కూల్‌ గుంపు, దండగుండాలలో కరోనా ఒక్కరికి కూడా రాలేదు. వీరాపురంలో 100 కుటుంబాలు, కోటగడ్డలో 30 కుటుంబాలు, ఒంపుగూడెంలో 100 కుటుంబాలు, పూబెల్లిలో 75 కుటుంబాలు, పూబెల్లి స్కూల్‌ గుంపులో 100 కుటుంబాలు, దండగుండాలలో 40 కుటుంబాలు ఉన్నాయి. వీరాపురంలో లంబాడీ, ఆదివాసీలు మినహా మిగిలిన ఈ గూడేలన్నీ ఆదివాసీలవే. వీరు తెల్లవారుజాము నుంచి వ్యవసాయ పనుల్లో ఉండటంతో బయటకు వెళ్లే సమయం కూడా దొరకట్లేదు. ఇప్పటికీ గిరిజన ఆచార వ్యవహారాలు గూడేలలో సాగుతున్నాయి.

గంజి, గటకే ఆహారం! 
కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్ల గ్రామపంచాయతీలో గంగమ్మ కాలనీ ఆదివాసీగూడెం ఉంది. ఈ గూడెంలో 24 ఇళ్లు మాత్రమే ఉంటాయి. వీరంతా వారికి సంబంధించిన పోడులను సాగు చేసుకుంటున్నారు. అడవిలో దొరికే దుంపలు, ఆకుకూరలను తింటూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా చింతపూలను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు. సౌర విద్యుత్‌నే వాడుతారు. పాల్వంచ మండలం రాళ్లచెలక గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. అంతా ఆదివాసీలే. అడవిలో దొరికే వాటితోనే జీవనం సాగిస్తారు. తునికాకు సేకరణ, అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్మకాలు చేసి జీవనం సాగిస్తారు. ఉదయన్నే గంజి తాగుతారు. గటక తింటారు. పాల్వంచ మండలం ఎర్రబోరు ఆదివాసీ గూడెంలో 150 కుటుంబాలున్నాయి. వీరు వరి, జొన్న వంటి పంటలు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

శనగకుంట.. కరోనా లేదంట 
ములుగు జిల్లా శనగకుంట గ్రామంలో 153 కుటుంబాలు, 482 మంది జనాభా, 252 మంది ఓటర్లు ఉన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. గూడెం వాసులు ఎక్కువగా ఆకుకూర, బొద్దికూరలు, గురుజవెండి చెట్టు, పొత కాయలతో పచ్చడి చేసుకొని తింటారు. వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసుకుంటారు. సాధారణగా లభించే కూరగాయలు, పప్పులు ఆహారంగా తీసుకుంటారు. తాగునీటి అవసరాలను బోరుబావుల ద్వారా తీర్చుకుంటారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తల సూచనలు, సలహాలను తు.చ. తప్పక పాటిస్తారు. 

ములుగు జిల్లా లవ్వాల గ్రామానికి చెందిన ఈమె పేరు వాసం లక్ష్మి. ఇప్పటివరకు మూడు సార్లు కరోనా పరీక్ష చేసుకుం టే అన్నిసార్లు నెగెటివ్‌ వచ్చింది. మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అవసరాల కోసం మాత్రమే బయటకు వెళ్తుంది. మిగతా రోజులు వ్యవసాయ పనులు చేస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మాంసాహారం తీసుకోదు. పప్పుదినుసులు, ఆకుకూరలే ఆహారంలో ప్రధాన భాగం. 

ములుగు జిల్లా ఎక్కెల గ్రామానికి చెందిన ఈమె పేరు దుబ్బ కన్నమ్మ. ఇప్పటివరకు రెండు సార్లు కరోనా పరీక్ష చేసుకుంటే నెగెటివ్‌ వచ్చింది. రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఈమె అత్యవసర పని ఉంటే తప్ప గ్రామం నుంచి బయటకెళ్లదు. ఎక్కువగా పప్పుదినుసులు, ఆకుకూరలనే ఆహారంలో తీసుకుంటారు. వేసవిలో మొక్కజొన్న అంబలి తాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పనులు చేస్తుంది. గ్రామం నుంచి బయటకు వెళ్తే మొఖానికి ఏదైనా టవల్‌ లాంటిది కట్టుకుంది. ఎవరికి తాకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. 

మా దరిదాపుల్లోకి కూడా రాదు
కరోనా మా దరిదాపుల్లోకి కూడా రాలేదు. రాదు కూడా.. ఎందుకంటే మేం మానవ ప్రపంచానికి దూరంగా మారుమూల గ్రామాల్లో ఉంటున్నాం. జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలను స్వయంగా పండించి వాటినే ఆహారంగా తీసుకుంటాం. ఆకుకూరలు, కూరగాయలు, నూనెలు వంటివి స్వయంగా సమకూర్చుకుంటాం. ఇప్పనూనెలో శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఉంటుందని మా పూర్వీకులు చెప్పారు. 
– మడవి నంద, వీరాపురం ఆదివాసీ గ్రామం, చర్ల మండలం 

సమష్టి జీవన విధానమే మంత్రం
గిరిజన గూడేలలో నేటికీ సమష్టి జీవన విధానం వల్ల గిరిజనం ఒకే మాట, ఒకే బాటపై కట్టుబడి ఉంటున్నారు. ముత్తారపు కట్ట పంచాయతీలో వీరాపురం, కోటగడ్డలో కరోనా జాడలేదు. పంచాయతీ తరఫున హైపోక్లోరైట్, బ్లీచింగ్‌ పిచికారి చేస్తున్నాం. మైక్‌ ద్వారా ప్రచారం చేస్తున్నాం. కూరగాయలు పండించుకోవటం, పప్పులు ఇంటి నుంచే సేకరించుకోవడం, చింతపండు మా వద్దే ఉంటుంది. ఆరోగ్యం బాగోలేకుంటే గటక, జావ తాగుతారు. ఇలా బయటి ఆహార పదార్థాలంటేనే ముట్టుకోరు. 
– మంకిడి కృష్ణ, సర్పంచ్, ముత్తారపుకట్ట పంచాయతీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top