భారత సంస్కృతీ సంప్రదాయాలు అత్యుత్తమం  | Sakshi
Sakshi News home page

భారత సంస్కృతీ సంప్రదాయాలు అత్యుత్తమం 

Published Wed, Mar 30 2022 1:47 AM

National Culture Festival Begin In Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు అత్యుత్తమమైనవని, దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ఓ చారిత్రక నేపథ్యం ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా జాతీయ సంస్కృతీ మహోత్సవాలను కేంద్రం వేడుకగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో మంగళవారం నుంచి రెండ్రోజులు జరిగే రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్‌ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు.

‘మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం, అన్ని రకాల కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం’అని చెప్పారు. సాంస్కృతిక శాఖ ఏటా రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్‌ను నిర్వహిస్తుందని.. కళాకారులు వారి కళాత్మకతను ప్రదర్శించడానికి ఇది చక్కని అవకాశమన్నారు. 7 జోన్ల నుంచి 15 మంది చొప్పున 525 మంది కళాకారుల ప్రదర్శనను చూసి గవర్నర్‌ ముగ్దులయ్యారు.  

వైభవంగా ‘సంస్కృతీ మహోత్సవ్‌’: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సంస్కృతీ మహోత్సవ్‌ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో ఏపీలోని రాజమండ్రిలో వేడుకలు జరగ్గా.. మంగళవారం తెలంగాణలోని వరంగల్‌లో ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 1, 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.  

ప్రజాప్రతినిధులు ఈసారీ దూరం  
గవర్నర్‌ పర్యటనకు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈసారి కూడా దూరంగా ఉన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు హాజరైతే కనీసం గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ స్వాగతం పలకకపోవడం, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం మరోసారి గవర్నర్‌ను అవమానపరిచినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి గవర్నర్‌కు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అధికారులు కూడా కార్యక్రమం పట్ల అంటీముట్టనట్లే వ్యవహరించారు.  

Advertisement
Advertisement