కానిస్టేబుల్‌పై దాడి.. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ ఎంపీ రఘురామ ఇంటికి 

MP Raghurama Krishna Raju Family Attacked Constable - Sakshi

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లతో కలసి దాష్టీకం.. ప్రధాని పర్యటన భద్రత విధుల్లో ఉండగా ఘాతుకం 

నడిరోడ్డుపై దాడి.. ఈడ్చుకుంటూ ఎంపీ రఘురామ ఇంటికి 

రెండు గంటలు చిత్రహింసలు 

కానిస్టేబుల్‌ ఫిర్యాదు ఎంపీ కుటుంబ సభ్యులు, సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లపై కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్‌ చేశారు. కొందరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లతో వచ్చి నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. అతని ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటలకు పైగా చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లోనే ఉండటం గమనార్హం.

తనపై దాడికి పాల్పడిన రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు, కొందరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లపై ఫరూక్‌ బాషా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణ పర్యటన సందర్భంగా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) మార్గదర్శకాల ప్రకారం రెండు రాష్ట్రాల పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో ప్రధానికి  నిరసన తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా కొన్ని సంఘాలు వచ్చినట్లు సమాచారం అందింది.

చదవండి: (Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర) 

విజయవాడ, భీమవరంలలో కూడా ఆందోళనలకు కొందరు సిద్ధమవుతున్నట్టు గుర్తించారు. దాంతో ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సంఘాల ప్రతినిధులు, ఆందోళనకారులు, అనుమానితుల కదలికలను గుర్తించేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం కొందరు కానిస్టేబుళ్లను హైదరాబాద్‌లో స్పాటర్స్‌గా నియమించింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం ఇది అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు అనుసరించే విధానమే. ఆ విధంగా ఏపీ అధికారులు అనంతపురానికి చెందిన కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాను హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ గేటు వద్ద స్పాటర్‌గా నియమించారు. ఫరూక్‌ సోమవారం ఉదయం ఐఎస్‌బీ గేటు వద్ద విధుల్లో ఉన్నారు.

గచ్చిబౌలిలోని బౌల్డర్‌ హిల్స్‌లో ఉన్న ఎంపీ నివాసానికి ఇది దాదాపు కిలోమీటర్‌ దూరంలో ఉంది. ఫరూక్‌ విధులకు రఘురామకృష్ణరాజు ఇంటితోగానీ ఆ  ప్రాంతంతోగానీ సంబంధమే లేదు. అయినప్పటికీ రఘురామ కుటుంబ సభ్యులు కొందరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లతో కలసి కారు (7777 నంబరుతో తెలుపు రంగు ఫోర్డ్‌ ఎకో స్పోర్ట్స్‌)లో వచ్చి ఫరూక్‌పై దాడి చేశారు. ఎవరు నువ్వు అంటూ నడిరోడ్డుపైనే పిడిగుద్దులు కురిపించారు. తాను ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ను అని గుర్తింపు కార్డు చూపిస్తున్నా వినిపించుకోలేదు. గుర్తింపు కార్డును లాక్కున్నారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా చేతులు వెనక్కి కట్టి, దాడి చేస్తూ ఈడ్చుకుని ఎంపీ ఇంటికి తీసుకెళ్లారు. ఆ దృశ్యాలను కొందరు పాదచారులు సెల్‌ఫోన్లలో వీడియో కూడా తీశారు.

చదవండి: (టీడీపీని పైకెత్తలేక.. జాకీలు విరిగిపోతున్నాయి)

అనంతరం ఇంట్లో ఎంపీ కుటుంబ సభ్యులు, సిబ్బందితోపాటు కొందరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు చిత్రహింసలకు గురిచేశారు. ఫైబర్‌ లాఠీలతో కాళ్లూ, చేతులు, కడుపుపై కొట్టారు. గొంతు పట్టుకుని గాయపరిచారు. పిడిగుద్దులు గుద్దారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అనుమానిత వ్యక్తి అని భావించి పట్టుకున్నామని వారు పోలీసులకు చెప్పారు. కాగా విధి నిర్వహణలో ఉన్న తనను ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు, సిబ్బంది, సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు దాడి చేసి గాయపరిచారని కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top