రైతుల ఖాతాల్లోకి రూ.2,329 కోట్లు రావాలి

Monsoon Season Grain Sales Process End In Telangana - Sakshi

ధాన్యం విక్రయించిన 4 లక్షల మంది ఎదురుచూపులు

సాక్షి హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌ ధాన్యం అమ్మకాల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12.78 లక్షల మంది రైతులు 69.86 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని వి క్రయించారు. దీని విలువ రూ.13,670 కోట్లు కా గా.. 8,71,920మంది రైతులఖాతాల్లో రూ.11,341 కోట్ల సొమ్మును ప్రభుత్వం జమచేసింది. ఇంకా సుమారు 4 లక్షల మంది రైతులకు రూ.2,329 కోట్లు అందాల్సి ఉంది.

4 లక్షల మంది రైతుల్లో ధాన్యం అమ్ముకుని 20–25 రోజులు గడిచిన వారూ ఉన్నారు. వీరంతా ఖాతాల్లో ఎప్పుడు డబ్బు జమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తూకంవేసి, రసీదు ఇస్తే వారంలో బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చేవి. కానీ ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలు, డబ్బు చెల్లింపు ప్రక్రియ సుదీర్ఘంగా మారింది. వడ్ల తూకం వేయాలంటే తొలుత పట్టా పాస్‌పుస్తకంతో ఆధార్, ఫోన్‌నంబర్‌ను లింక్‌  చేయాలి. అలాచేసిన రైతుకు ఉన్న పొలం విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలో నిర్దేశిస్తారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయడంతోనే సరిపోదు. మిల్లింగ్‌కు పంపించే వరకు రైతుదే బాధ్యత. ఆపై రసీదు ఇచ్చే పరిస్థితి ఉంది. తూకం వేసిన ధాన్యం మిల్లుకు వెళ్లాక మిల్లర్‌ వచ్చిన ధాన్యం నాణ్యతను బట్టి కోతపెట్టి ఎంత కొనుగోలు చేశాడో చెబుతాడు. రైతు నుంచి మిల్లరు ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పిన లెక్కకు అనుగుణంగా ఐకేపీ సెంటర్‌ నుంచి రసీదు వస్తుంది. ఆ తర్వాతే ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలోకి రైతు విక్రయించిన ధాన్యం వివరాలు నమోదవుతాయి. దానికి అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ ధాన్యం సొమ్మును ఆయా జిల్లాల ట్రెజరీల ద్వారా రైతుల ఖాతాల్లోకి పంపుతుంది. దీని వల్లే ధాన్యం  సొమ్ము ఇంకా వారి ఖాతాల్లోకి రాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top