గత జ్ఞాపకాలతో బరువెక్కుతున్న గుండెలు | Sakshi
Sakshi News home page

మిడ్‌మానేరు ఒడి.. మది నిండా తడి

Published Sat, Apr 16 2022 8:21 PM

Midmaneru Heavy Hearts With Past Memories - Sakshi

బోయినపల్లి (చొప్పదండి): కూలిన గోడలు.. శిథిల రోడ్లు.. మోడువారిన చెట్లు.. పాడుబడిన గుడిని చూసి వారి గుండెలు బరువెక్కుతున్నాయి. తాము పుట్టి, పెరిగిన గ్రామాలు జ్ఞాపకాలుగా మిగలడాన్ని చూసి కళ్లు చెమర్చుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్యమానేరులో ముంపునకు గురైన గ్రామాలు ఇప్పుడు తేలడంతో వాటిని చూసిన నిర్వాసితులు ఉద్వేగానికి గురవుతున్నారు. ‘ఇది మా ఇల్లు.. ఇది మా బడి.. అరే అదిగదిగో అంజన్న గుడి’అంటూ పాత జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. మొండి గోడలు, మోడువారిన చెట్లను చూసి చలించిపోతున్నారు. ఈ దృశ్యాలు మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపు నకు గురైన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మిడ్‌మానేరులో నీటిమట్టం తగ్గడంతో మునిగిన గ్రామాలు తేలాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు నిత్యం వెళ్లి వస్తున్నారు. రోజంతా అక్కడే గడిపి బరువెక్కిన హృదయాలతో తిరిగి వస్తున్నారు. 
 
2019లో మునిగిన గ్రామాలు 
రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టుతో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులో 2018 నుంచి నీరు చేరడంతో ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలకు తరలిపోయారు. 2019లో 25 టీఎంసీల నీరు చేరడంతో బ్యాక్‌వాటర్‌లో ముంపు గ్రామాలు మొత్తం మునిగిపోయాయి. రెండేళ్లుగా ప్రాజెక్టులో నీరు నిండుగా ఉండటంతో ఆ గ్రామాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. నెల రోజులుగా 8 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 

పది కి.మీ. తగ్గిన బ్యాక్‌వాటర్‌ 
మిడ్‌మానేరు ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు చేరితే తంగళ్లపల్లి బ్రిడ్జి, సిరిసిల్ల బతుకమ్మ ఘాట్, సాయినగర్‌ వరకు 18 కి.మీ. మేర బ్యాక్‌వాటర్‌ చేరుతుంది. ఇటీవల ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్, ఎల్‌ఎండీలకు నీరు విడుదల చేయడంతో ఇప్పుడు 8.33 టీఎంసీల జలాలున్నాయి. దీంతో బ్యాక్‌వాటర్‌ పది కిలోమీటర్లలోపే ఉంది. 

మిడ్‌మానేరు ప్రాజెక్టు స్వరూపం 
నీటి సామర్థ్యం    27.55 టీఎంసీలు 
ప్రస్తుత నిల్వ    8.33 టీఎంసీలు 
బ్యాక్‌ వాటర్‌    18 కి.మీ. 
ప్రస్తుత బ్యాక్‌వాటర్‌    10 కి.మీ. 
ముంపు గ్రామాలు    11 
ప్రాజెక్టులో సేకరించిన భూమి    20వేల ఎకరాలు 
ముంపునకు గురైన ఇళ్లు    సుమారు 8,500  
నిర్వాసిత కుటుంబాలు    11,731 

గుండెలు బరువెక్కుతున్నాయి 
ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గ డంతో నీలోజిపల్లి పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూసేందుకు వెళ్తే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కూలిన గోడలు.. దర్వాజలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. 
– సింగిరెడ్డి బాలమల్లు, నీలోజిపల్లి, బోయినపల్లితెలియని అనుభూతి 
ముంపులో మునిగిన ఊరు మళ్లీ కనిపిస్తుందంటే చూసేందుకు వెళ్తున్నారు. మళ్లీ ఆ ఆనవాళ్లు కనిపిస్తాయో.. లేదోనని చాలామంది పాత ఊళ్లు చూసేందుకు వెళ్తున్నారు. పాత గ్రామాలను చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అదోరకమైన సంతోషం.. బాధ రెండూ కలుగుతున్నాయి.  
– ఆడెపు రాజు, వరదవెల్లి, బోయినపల్లి
 

తేలిన గ్రామాలివీ
వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభాష్‌పల్లి, రుద్రవరం, బోయినపల్లి మండలం, కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి

Advertisement
 
Advertisement
 
Advertisement