‘మేల్‌’కోండి!  

Men Are Affecting More By Coronavirus Says Yale University of America - Sakshi

కోవిడ్‌ రోగనిరోధకశక్తి పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికం... 

మగవారిలో కరోనా వ్యాధి తీవ్రత, మరణాలూ ఎక్కువే  

పురుషుల కంటే మహిళల్లోనే టీ–సెల్, తెల్ల రక్తకణాల యాక్టివేషన్‌ 

యేల్‌ వర్సిటీ ఉమెన్‌ హెల్త్‌ రీసెర్చ్‌లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: పేరుకు మగమహారాజులే అయినా..కరోనా విషయానికొచ్చేసరికి బలహీనులే అట. ఎందుకంటే కోవిడ్‌ మహమ్మారి బారిన పడుతున్నవారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ. త్వరగా కోలుకోవడంలో మహిళలు ముందంజలో ఉండగా, మరణిస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. కోవిడ్‌ సోకకుండా తట్టుకునే రోగనిరోధశక్తి మహిళల్లో అధికంగా ఉండడంతోపాటు పురుషులతో పోల్చితే మహిళల్లోనే మెరుగైన ‘ఇమ్యూన్‌ రెస్పాన్స్‌’ ఉన్నట్టు తాజాగా అమె రికా యేల్‌ యూనివర్సిటీ ఉమెన్స్‌ హెల్త్‌ రీసె ర్చ్‌లో వెల్లడైంది.

కోవిడ్‌ పాజిటివ్‌ మహిళా పేషెంట్లలో పురుషుల కంటే టీ–సెల్‌ యాక్టివేషన్‌ చురుకుగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తిం చారు. మానవశరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మలచుకోవడంలో టీ–లింపోసైట్స్‌గా నూ పిలిచే ఈ–సెల్స్‌ ప్రధాన భూమికను పో షిస్తాయి. శరీరంలోని వైరస్‌ సోకిన కణాలను ప్రత్యక్షంగా చంపడంతోపాటు ఇతర రోగనిరోధక  కణాలను యాక్టివేట్‌ చేయడంలోనూ టీ–సెల్స్‌ పాత్ర నిర్వహిస్తాయి. టీ–సెల్స్‌ నెమ్మదిగా లేదా బలహీనంగా స్పందించిన సందర్భాల్లో మహిళా పేషెంట్ల కంటే మగవారిలోనే తీవ్రప్రభావం చూపడం తోపాటు మరణాలకు కారణమవుతున్నట్టుగా తాము జరిపిన పరిశోధనల్లో వెల్లడైందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 

పేషెంట్లపై యేల్‌ పరిశీలన 
యేల్‌ న్యూహెవెన్‌ హాస్పిటల్‌లో స్వల్ప లక్షణాలతోపాటు ఒక మోస్తరు వ్యాధి సోకిన కోవిడ్‌–19 పేషెంట్లపై అధ్యయనం నిర్వహించారు. కోవిడ్‌–19 ఇన్‌ఫెక్షన్ల విషయంలో మహిళలు, పురుషుల్లో తేడాలున్నట్టు, పెద్ద వయసున్న మగవారు ఎక్కువగా ప్రభావితమైనట్టు  సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ‘ఇమ్యూన్‌ రెస్పాన్స్‌’ అనేది లింగభేదాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న దానిపై మరింత లోతైన పరిశీలన నిర్వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్‌ పేషెంట్లలో రోగనిరోధక విధానం  మహిళలు, పురుషుల్లో భిన్నంగా ఉన్నట్టు, ఈ కారణంగా మగవారిలో ఈ వ్యాధి తీవ్రత ప్రభావం ఎక్కువయ్యేందుకు అవకాశాలున్నట్టుగా వారు అంచనా వేస్తున్నారు. కరోనా బారిన పడని వారితోపాటు పాజిటివ్‌ రోగుల రక్తనమూనాలు, ముక్కులు, నోళ్లలోంచి ఇతర నమూనాలను సేకరించి వారిలో తొలుత రోగ నిరోధక స్పందనలు ఎలా ఉన్నాయి. వ్యాధి తీవ్ర దశకు  చేరుకుంటున్నవారిలో, కోలుకుంటున్న వారిలో ఎలా ఉన్నాయన్న దాన్ని ఈ పరిశోధకులు పరిశీలించారు.  

ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ భిన్నం 
వ్యాధి సోకిన తొలిదశల్లో మహిళలు, పురుషుల్లో ‘ఇమ్యూన్‌ రెస్పాన్స్‌’లు భిన్నంగా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. కోవిడ్‌ సోకిన సందర్భంగా వైరస్‌తో పోరాడి వాటి నిర్మూలనకు కృషి చేసే టీ–సెల్, తెల్లరక్తకణాల యాక్టివేషన్‌ రోగనిరోధక వ్యవస్థగా పురుషుల కంటే మహిళల్లోనే వేగంగా ఏర్పడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. టీ–సెల్స్‌ స్పందన బలహీనంగా ఉన్న మగవారిలో కోవిడ్‌ తీవ్రత పెరగడంతోపాటు మృత్యువాత పడే పరిస్థితులు ఎదురుకావొచ్చని చెబుతున్నారు. వయసు పైబడిన మహిళల కంటే పురుషుల్లోనే టీ–సెల్‌ స్పందన తక్కువగా ఉందని కూడా ఈ  పరిశోధనలో తేలింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top