కరోనా తగ్గుతోంది.. 

Medical And Health Department Says Corona Gradually Declining - Sakshi

వారం రోజులుగా కేసుల నమోదులో తగ్గుదల 

4.01 నుంచి 3.51 శాతానికి తగ్గిన పాజిటివిటీ 

కోటి ఇళ్లలో జ్వర సర్వే.. 4,32,518 మందికి మెడికల్‌ కిట్లు  

వైద్య, ఆరోగ్యశాఖ తాజా నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని వైద్య,ఆరోగ్యశాఖ తెలిపింది. దేశం లో, రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉందంటూ తాజాగా నివేదికను విడుదల చేసింది. జనవరి చివరి వారం నుంచి కేసులతోపాటు పాజిటివిటీ రేటు తగ్గుతోందని స్పష్టం చేసింది. జనవరి 25న 4,559 కరోనా కేసులుండగా, పాజిటివిటీ రేటు 4.01 శాతం నమోదైంది. అదే నెల 31న 2,861 కేసులు.. పాజిటివిటీ రేటు 3.51 శాతంగా నమోదైనట్టు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆ నివేదికలో ప్రస్తావించారు.

ఈ వారం రోజుల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ క్రమంగా కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గాయని పేర్కొన్నారు. కాగా, జనవరి 1 నుంచి 31 వరకు రాష్ట్రంలో 24.11 లక్షల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, అందులో 82,013 మందికి పాజిటివ్‌ వచ్చింది. 3.40 శాతం పాజిటివిటీ నమోదైంది. ఇక జనవరి 19 నుంచి 31 వరకు రాష్ట్రంలో రోజుకు సరాసరి 1,00,734 కరోనా పరీక్షలు నిర్వహించారు. 

నిర్మల్‌లో అత్యధికంగా పాజిటివిటీ రేటు 
జనవరి 25–31 మధ్య కాలంలో సరాసరి పాజిటివిటీ రేటు 3.90 శాతంగా నమోదైంది. అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 8.88 శాతం, కామారెడ్డి జిల్లాలో 8.32, కొమురంభీంలో 8, నిజామాబాద్‌లో 7.61, యాదాద్రిలో 7.25, జనగాంలో 6.83, సంగారెడ్డిలో 6.27, వికారాబాద్‌లో 6.15, మెదక్‌లో 5.78, మహబూబ్‌నగర్‌లో 5.79 శాతం నమోదైంది. అత్యల్పంగా గద్వాల జిల్లాలో 1.45 శాతం, వనపర్తి జిల్లాలో 1.75 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.  

4.32 లక్షల మందికి కిట్టు..: ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే రాష్ట్రంలో విజయవంతమైంది. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనవరి 21 నుంచి 31 వరకు మొత్తం 99,66,191 (దాదాపు కోటి) ఇళ్లకు వెళ్లి సర్వేచేశారు. 4,34,982 మంది లక్షణాలున్న వారిని గుర్తించి, 4,32,518 మందికి మెడికల్‌ కిట్లు అందజేశారు. 7,73,961 మందికి కోవిడ్‌ ఓపీ సేవలు అందించారు. ఇంటింటి సర్వే రెండో దశ 11 జిల్లాల్లో ప్రారంభమైంది. మిగిలిన జిల్లాల్లోనూ త్వరలో మొదలుకానుంది. కరోనా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టే వరకు సర్వేలు కొనసాగుతాయి. కాగా, రాష్ట్రంలో 60,632 పడకలు కోవిడ్‌ కోసం కేటాయించారు. అందులో 94.69% ఖాళీగా ఉన్నాయి. గత వారం రోజులుగా ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ నిలకడగా 6 శాతం అటుఇటుగా ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top