బందోబస్తుగా పెళ్లి బాజా! 

Marriages Canceled Due To Corona Have Now Begun - Sakshi

కరోనాతో వాయిదాపడ్డ పెళ్లిళ్లకు ఇప్పుడు ముహూర్తాలు

నవంబర్‌ నుంచి జనవరి వరకు జరగనున్న వివాహాలు

కరోనా సెకండ్‌ వేవ్‌ భయంతో అతిథుల జాబితా తగ్గుదల

పెళ్లి రిసెప్షన్ల రద్దుకే 23 శాతం జంటల మొగ్గు..

అతిథులు, ఫొటోగ్రాఫర్లు, మేకప్‌ ఆర్టిస్టులకు శానిటైజర్లు, మాస్క్‌లు

వంటకాల సంఖ్య తగ్గింపు.. 25 నుంచి 40 శాతం ఖర్చు ఆదా

అనారోగ్యముంటే సామూహిక కార్యక్రమాలకు పోవద్దు: డబ్ల్యూహెచ్‌వో  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి మళ్లీ మొదలైంది. శ్రావణం ముగిశాక మళ్లీ ఇప్పుడే మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహ వేడుకల హంగామా పెరిగింది. కరోనా భయం పూర్తిగా వీడకపోవడం.. జాగ్రత్తలు పాటించకుంటే చలికాలంలో దీని తీవ్రత అధికంగా ఉంటుందన్న ప్రభుత్వం, వైద్యుల హెచ్చరికలతో పూర్తి భద్రత చర్యల మధ్య పెళ్లిళ్లు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా దేశాల్లో సెకండ్‌ వేవ్‌ భయంతో పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నా, రాష్ట్రంలో మాత్రం వివాహ వేడుకల రద్దు తక్కువేనని సర్వేలు చెబుతున్నాయి. 76 శాతం జంటలు ఎంచుకున్న తేదీల్లో వివాహానికే ముందుకెళ్తున్నారని.. అయితే కరోనా భయంతో అతిథుల సంఖ్య తగ్గింపు మొదలు శానిటైజర్లు, మాస్క్‌లు, సామాజిక దూరం, కచ్చితమైన నిబంధనలు పాటించేలా చొరవ తీసుకుంటున్నారని ఈ సర్వేలు వెల్లడిస్తున్నాయి.  

వాయిదాపడ్డవన్నీ ఇప్పుడు ఫిక్స్‌.. 
రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలలో తెలుగునాట ఎక్కువ వివాహాలకు ముహూర్తాలు కుదిరాయి. దీనికి అనుగుణంగా కల్యాణ మండపాలు, ప్రముఖ దేవాలయాలు వేదికలుగా ఏర్పాట్లు జరిగినా కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వేలాది వివాహాలు వాయిదాపడ్డాయి. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల నుంచి 50 వేల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అనంతరం జూలై 22 తర్వాత శ్రావణం మొదలైనా కరోనా మహమ్మారి విస్తృతి దృష్ట్యా, పరిమిత సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఇరు పక్షాల కుటుంబీకులతో కేవలం 20 నుంచి 50 మందితోనే వివాహ వేడుకను ముగించారు. ఆగస్టు 14 అనంతరం మళ్లీ ఇప్పుడు అక్టోబర్‌ 28 నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. 29న సైతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగ్గా, నవంబర్‌లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. దీనికి అనుగుణంగా ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాలు, హోటళ్లలో వేదికల బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో జనవరి 8 వరకు మంచి రోజులుండగా, సుమారు 50 వేల నుంచి 80 వేల జంటలు ఒక్కటయ్యే అవకాశముందని అంచనా. 

తగ్గిన అతిథులు.. పెరిగిన జాగ్రత్తలు 
రాష్ట్రంలో ప్రస్తుతం మొదలైన పెళ్లిళ్లలో అతిథుల సంఖ్య పరిమితంగానే ఉంటోంది. 2 వేల నుంచి 3 వేల సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ ఉన్న ఫంక్షన్‌ హాళ్లలోనూ 500కు మించి అతిథులు కనిపించడం లేదు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా తమకు అత్యంత దగ్గరైన, ముఖ్యమైన బంధువులు, సన్నిహితులకు మాత్రమే ఆహా్వన పత్రికలు ఇస్తున్నారు. ఈ ఆహ్వానాలు సైతం పత్రిక ద్వారా కాకుండా వాట్సాప్‌లు, ఈ–మెయిల్స్, మెసేజ్‌ల ద్వారానే ఉంటున్నాయి. చాలా మంది జంటలు తమ అతిథుల జాబితాను 68 శాతం తగ్గించుకున్నట్లు వెడ్డింగ్‌ టెక్నాలజీ సంస్థ ది నాట్‌ వరల్డ్‌ వైడ్‌ నివేదిక వెల్లడించింది. 90 శాతం కుటుంబ సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారని పేర్కొంది.

కేవలం తమ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వారినే ఆహా్వనిస్తున్న వారు 52 శాతం ఉండగా, దూర ప్రాంతాల వారికి ఆహా్వనాలు పంపుతున్న వారు 30 శాతంగా ఉంటున్నారు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా 23 శాతం మంది జంటలు వివాహ రిసెప్షన్లను రద్దు చేసుకుంటున్నాయి. ఇక వివాహ కార్యక్రమాల్లో 80 శాతం మంది సామాజిక దూరాన్ని ప్రోత్సహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 91 శాతం ఫంక్షన్‌ హాళ్లలో హ్యాండ్‌ శానిటైజర్లు వాడుతుండగా, 79 శాతం మంది మాస్కులు వినియోగిస్తున్నారని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి.. ఇక వివాహా వేడుకల్లో అతిథులు మొదలు ఫంక్షన్‌ హాల్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, మేకప్‌ ఆరి్టస్టులు, క్యాటరింగ్‌ బాయ్స్‌ వరకు మాస్‌్కలు, హ్యాండ్‌ గ్లౌజ్‌లు అందిస్తున్నారు. పలుచోట్ల ఎంట్రీల వద్దే ఫీవర్‌ చెకింగ్, సామాజిక దూరం పాటించేలా సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ చేస్తున్నారు.  

భోజన ఖర్చులు భారీగా తగ్గింపు.. 
ఇక గతంలో పెళ్లిళ్లంటే భారీ ఆడంబరాలు, అందుకు తగ్గట్లే పసందైన వివిధ రకాల వంటకాలతో భోజనాలు ఉండేవి. అయితే ప్రస్తుతం వంటకాల సంఖ్యను పూర్తిగా తగ్గించేస్తున్నారు. భోజనాల ఖర్చు 25 నుంచి 40 శాతం వరకు తగ్గుతోంది. ఇక వంద నుంచి 500 మంది వ్యక్తులతో కలసి విందు ప్రాంగణంలో భోజనం చేయాలంటే ఇప్పుడు అతిథులూ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఏమాత్రం అపరిశుభ్రతతో కూడిన ప్రాంగణమున్నా, ఒకరు తిన్న ప్లేట్లనే మళ్లీ శుభ్రం చేసి తెచ్చినా జనాలు భోజనం చేసేందుకు జంకుతున్నారు. దీనికి తోడు నాన్‌వెజ్‌ను ఎక్కువగా ప్రోత్సహించే వివాహ రిసెప్షన్లను ప్రస్తుతం చాలా జంటలు రద్దు చేసుకుంటుండటం సైతం భోజన ఖర్చులను భారీగా తగ్గిస్తోంది.  

రిసెప్షన్లను రద్దు చేసుకుంటున్న వారే ఎక్కువ.. 
‘భారతీయ వివాహ సంప్రదాయంలో చాలా రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాదనలేని కార్యక్రమాలు కొనసాగిస్తూనే అవసరం లేని రిసెప్షన్‌ను రద్దు చేసుకుంటున్న జంటల సంఖ్య ఎక్కువగానే ఉంది..’అని జూబ్లీహిల్స్‌కు చెందిన మ్యారేజ్‌ ఈవెంట్స్‌ మేనేజర్‌ ఒకరు తెలిపారు. ఇక కనీసంగా 20 రకాలు ఉండే వివాహ భోజనంలో ప్రస్తుతం 10 రకాలకు మించటం లేదని కూకట్‌పల్లికి చెందిన ఈవెంట్‌ మేనేజర్‌ ఒకరు తెలిపారు. ముఖ్యంగా స్వీట్లు, ఐస్‌క్రీంలు, పానీయాలను మెనూ నుంచి పూర్తిగా తొలగిస్తున్నారని వెల్లడించారు.

డబ్ల్యూహెచ్‌ఓ సూచనలిలా..
వివాహాది శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు వంటి సమూహ కార్యక్రమాల సమయంలో ప్రజల మధ్య కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి ప్రదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ఎట్లా సురక్షితంగా మలచాలన్న దానిపై డబ్ల్యూహెచ్‌ఓ పలు సూచనలు చేసింది. కరోనా జాగ్రత్తలు పాటించడం వీలు కాదో అలాంటి వాటిని రద్దు చేసుకోవడమే ఉత్తమమని, సమూహ కార్యక్రమాలకు హాజరవ్వాలంటే మొదటగా స్థానిక నిబంధనలు ఏమున్నాయో చూసుకోవాలని తెలిపింది. ఏమాత్రం అనార్యోగమున్నా ఇంటికే పరిమితం కావాలని, ఇతరుల నుంచి కనీసం మీటర్‌ దూరం పాటించాలని సూచించింది. మాస్క్‌ తప్పనిసరని, తుమ్మినా, దగ్గినా మోచేతిని అడ్డుపెట్టుకోవాలంది. వేడుక ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అతిథులకు అవగాహన కలి్పంచాలని, ఇండోర్‌ కంటే అవుట్‌డోర్‌లోనే ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది. అతిథుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు భౌతిక దూరం పాటించేలా సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ ఉండాలని, కార్యక్రమాలకు వచ్చే వారికి సబ్బులు, నీళ్లు, టిష్యూ పేపర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలని తెలిపింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top