
నవీ ముంబైలో భార్యను చంపిన మనోహర్
ఆరేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ దారుణం
తప్పించుకుని వచ్చి సిటీలో దాక్కున్న నిందితుడు
గత వారం వచ్చి పట్టుకెళ్లిన ప్రత్యేక బృందం
సాక్షి, హైదరాబాద్: చిన్న కారణం నేపథ్యంలో మహారాష్ట్రలోని నవీ ముంబైలో భార్యను చంపి, పరారై వచ్చిన మనోహర్ సరోదే (50) ఆరేళ్ల తర్వాత నగరంలో పట్టుబడ్డాడు. 2019లో ఈ ఘాతుకానికి పాల్పడిన అతగాడు హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నాడు. కాటేదాన్ ప్రాంతంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. సాంకేతిక ఆధారాలను బట్టి మనోహర్ ఆచూకీ కనిపెట్టిన నవీ ముంబై పోలీసులు గత వారం అతడు నివసిస్తున్న గదిపై దాడి చేసి అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
చికెన్ ముక్కల విషయంలో వివాదం...
నవీ ముంబైలోని కమోథే ప్రాంతానికి చెందిన మనోహర్‌కు నాందేడ్‌కు చెందిన పల్లవితో 2007లో వివాహమైంది. పల్లవి గృహిణి కాగా... మనోహర్ స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే వాడు. మద్యానికి బానిసైన ఇతగాడు నిత్యం భార్యతో గొడవ పడేవాడు. ఓ దశలో మానసికంగానూ దెబ్బతిన్న వ్యక్తిలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. 2019 డిసెంబరు 4న రాత్రి మనోహర్ తన విధులు ముగించుకుని, ఇంటికి వెళ్తూ చికెన్ తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలోనే పూటుగా మద్యం సేవించిన అతగాడు ఇంటికి వెళ్లిన తర్వాత చికెన్‌ను భార్యకు అప్పగించి వండమని చెప్పాడు. అప్పటికే ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూస్తున్న ఆమె వంట చేయడం కాస్త ఆలస్యమైంది.
విచక్షణ కోల్పోయి కిరోసిన్ పోసి...
దీంతో దాదాపు గంట పాటు ఆమెతో వాగ్వాదం చేస్తూనే ఉన్నాడు. వంట పూర్తయిన తర్వాత భార్యకు భోజనం వడ్డించిన పల్లవి తన పిల్లల వద్దకు వెళ్లింది. తనకు వడ్డించిన కూరలో చికెన్ ముక్కలు తక్కువ ఉన్నాయని, పిల్లలతో కలిసి తినడానికి దాచుకున్నావా? అంటూ మనోహర్ భార్యను దూషించడం మొదలుపెట్టాడు. ఆమె వారించడానికి ప్రయతి్నంచడంతో మరింత రెచి్చపోయిన అతగాడు తీవ్రంగా దాడి చేశాడు. స్ఫృహ తప్పి పడిపోయిన పల్లవిపై ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసిన మనోహర్ నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘోరాన్ని చూసిన వారి సంతానం నిశ్ఛేష్టులై ఉండిపోయారు. పల్లవి ఆర్తనాదాలు విన్న చుట్టపక్కల వాళ్లు ఆమెను ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 45 శాతం కాలిన గాయాలైన ఆమె మూడు రోజుల చికిత్స తర్వాత చనిపోయింది.
కాటేదాన్ వచ్చి కూలీగా మారి...
దీంతో మనోహర్‌పై నమోదైన హత్యాయత్నం కేసును కమోథే పోలీసుస్టేషన్ అధికారులు హత్యగా మార్చారు. నవీ ముంబై నుంచి పరారైన మనోహర్ రెండేళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో సంచరించాడు. 2021లో నగరానికి వచి్చన ఇతగాడు కాటేదాన్ ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. బతుకుతెరువు కోసం ఓ కంపెనీలో దినసరి కూలీగా చేరాడు. నవీ ముంబైతో పాటు తన కుటుంబీకులు, బంధువులతో సంబంధాలు తెంచుకున్నాడు. దీంతో ఇతడి ఆచూకీ కనిపెట్టడం కమోథే పోలీసులకు సవాల్‌గా మారింది. ఇటీవల మనోహర్ నవీ ముంబైలో ఉన్న తన స్నేహితుడిని సంప్రదించాడు. సాంకేతిక ఆధారాలను బట్టి ఈ విషయం గుర్తించిన కమోథే అధికారులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సిటీకి వచి్చన ఆ టీమ్ మనోహర్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లింది.